Israel : ఇజ్రాయెల్ వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కో పైలట్ అల్ హమ్మామి కూల్చాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడు ఈ విమానాన్ని కూల్చాలని నిర్ణయించుకోవడానికి గల కారణాల్ని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగానే తాను ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చాలని నిర్ణయించుకున్నట్లు అల్ హమ్మామి చెప్పాడు. ఈ విషయాన్ని యూఏఈ అధికారులు జరుపుతున్న విచారణలో అతడు వెల్లడించాడు.
అంతేకాదు.. అతడు ఇలా విమానాన్ని కూల్చి, తాను కూడా మరణించి అమరుడు అవ్వాలని భావించినట్లు చెప్పాడు. గత వారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) బయల్దేరిన విమానాన్ని కూల్చేందుకు కో పైలట్ అల్ హమ్మామి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాన్ని పైలట్, ఇండియన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్నాడు. అదే సమయంలో అక్కడున్న ఇతర పైలట్లు విమానాన్ని సురక్షితంగా సౌదీలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కుట్రకు పాల్పడిన కో పైలట్ అల్ హమ్మామి ప్రస్తుతం యూఏఈ అధికారుల స్వాధీనంలో ఉన్నాడు. ఇజ్రాయెల్‌కు చెందిన విచారణ అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొంటున్నారు.
యూఏఈ అధికారులతో కలిసి ఇజ్రాయెల్ అధికారులు విచారణ జరుపుతున్నారు. హమ్మామి విమానాన్ని ఎందుకు కూల్చాలనుకున్నాడు.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో అతడు వెల్లడించిన వివరాల్ని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. దీని ప్రకారం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిరసనగా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే హమ్మాని ఇజ్రాయెల్ పౌరులు ఉన్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. దీన్ని పైలట్, ఇతరులు కలిసి అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా విచారణ కొనసాగుతోంది.