కారేపల్లి, అక్టోబర్ 06 : తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార పదార్థాలను పరిశీలించి, వాటి వినియోగం, పోషక విలువలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం, స్థానికంగా లభించే చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పిడి ఆలేటి ప్రమీల, కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కె.ఉమా ఉన్నారు.