Mis Matching Jewellery | పెండ్లి, పేరంటం, పండుగ, నైట్ పార్టీ, మార్నింగ్ ఫంక్షన్.. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారు మహిళలు. సంప్రదాయమైనా, ఆధునికమైనా.. ఆయా దుస్తుల మీద అమరిపోయే మ్యాచింగ్ నగలు ఉంటేనే మగువల అలంకరణ పూర్తవుతుంది. దుస్తులకు నప్పే రంగు, డిజైన్లకు అనుగుణంగా ఆభరణాలను ఎంచుకుని ముస్తాబవుతారు. అయితే మ్యాచింగ్ నగలకు పోటీగా అతివల అలంకరణలో చేరి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది మిస్ మ్యాచింగ్ జువెలరీ. రంగు, పరిమాణం, ఆకారాల్లో ఏదో ఒక తేడాను కలిగి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ మిస్ మ్యాచింగ్ జువెలరీ విశేషాలు మీకోసం..
మహిళల అలంకరణలో చెవులకు జుంకాలు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా ఇవి రెండిటికీ ఒకేలా ఉంటాయి. రెండు చెవులకూ ఒకే రకమైన కమ్మలు, రెండు చేతులకూ ఒకే డిజైన్ గాజులు వేసుకుంటారు. కానీ, మిస్ మ్యాచింగ్ జువెలరీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇందులో ఒక చెవికమ్మ పెద్దగా, మరొకటి చిన్నగా ఉంటాయి. మిస్ మ్యాచింగ్ ట్రెండ్ ఎంతవరకూ వెళ్లిందంటే..
ఒక చెవికి చంద్రుడు వేలాడుతుంటే, మరోచెవిని సూర్యుడు పట్టుకుంటాడు. ఒకవైపు నక్షత్రం మెరిస్తే.. ఇంకోవైపు నుంచి నెలవంక తొంగిచూస్తుంటుంది. ఒకటి ముదురు రంగులో ముచ్చట గొలిపితే, మరొకటి లేత రంగులో మనసు దోచుకుంటుంది. ఇలా.. రెండు నగలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటూనే అందాన్ని రెట్టింపు చేస్తూ అందరిలోనూ ప్రత్యేకంగా నిలుపుతాయి. రెండు చేతులకు ఉండే గాజులు విభిన్న సైజుల్లో, డిజైన్లలో అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.
ఈ మిస్ మ్యాచింగ్ జువెలరీ ఆధునిక దుస్తులపైనే కాకుండా సంప్రదాయ వస్త్రశ్రేణిపైనా చక్కగా నప్పుతుంది. అంతేకాదు దీనిని అభిరుచికి తగినట్లుగా డిజైన్ చేయించుకునే సౌలభ్యం కూడా ఉంది. ఆన్లైన్ అంగళ్లలో కస్టమైజ్డ్ డిజైన్లు చేసుకునే సౌలభ్యమూ ఉంది. బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలతో చేసిన ఆభరణాలే కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెల్లరీలోనూ ఈ నగలు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేసేయండి!