– గులకరాళ్ల ఆట నుండి సాఫ్ట్బాల్ కోచ్ వరకు పొన్నాల పృథ్విరాజ్ ప్రస్థానం
– ఆదరణ కరువైన సాఫ్ట్బాల్కు స్పాన్సర్ల కోసం ఎదురుచూపు
చుంచుపల్లి, సెప్టెంబర్ 29 : చిన్నతనంలో గులకరాళ్లను చేతిలోకి తీసుకుని, మరో చేత్తో చిన్న కర్ర పట్టుకుని గురి తప్పకుండా వాటిని కొట్టడం సరదాగా భావించిన ఓ బాలుడి ఆసక్తి నేడు అతడిని సాఫ్ట్బాల్ క్రీడాకారుడిగా, కోచ్గా తీర్చిదిద్దింది. కడు పేదరికాన్ని ఎదుర్కొంటూనే ఆటపై మక్కువతో ముందుకు సాగి 26 ఏళ్ల వయసులోనే కోచ్గా బాధ్యతలు చేపట్టి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతున్నాడు. ఆయనే చుంచుపల్లి మండలం రుద్రంపూర్కు చెందిన పొన్నాల పృథ్విరాజ్.
పృథ్విరాజ్ చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి కూలి పనులకు వెళ్లేది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ చదువును మాత్రం వదులుకోలేదు. తెల్లవారుజామునే వార్తాపత్రికలు పంపిణీ చేస్తూ, చిన్నచిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించాడు. ఆటపై ఉన్న ఆసక్తిని కొనసాగిస్తూనే మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్
సాఫ్ట్బాల్పై ఆసక్తితో 2015లో క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన పృథ్విరాజ్, క్రమంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2018లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడంతో పాటు కోచ్గా శిక్షణ పొందాడు. క్రీడలో నైపుణ్యం సాధిస్తే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చనే పట్టుదల కూడా అతడిని మరింతగా కష్టపడేలా చేసింది. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఎ-గ్రేడ్ సర్టిఫికెట్ పొందిన పృథ్విరాజ్ సాఫ్ట్బాల్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ ఎంతోమందిని రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతున్నాడు.
ఇప్పటివరకు సుమారు 600 మంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడేలా పృథ్విరాజ్ తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సుమారు 120 మంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపేందుకు శిక్షణ ఇస్తున్నారు. 2018–19లో జాతీయ స్థాయిలో తన శిక్షణలోని క్రీడాకారులు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం సాధించగా, 2025లో మహిళల విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ వారి ప్రతిభను వెలికితీస్తున్నారు.

కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్
సాఫ్ట్బాల్కు ఒలింపిక్స్లో స్థానం ఉన్నప్పటికీ క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ వంటి క్రీడలకు లభిస్తున్న ఆదరణ, గుర్తింపు ఈ క్రీడకు లభించడం లేదని పృథ్విరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్బాల్ క్రీడకు అవసరమైన బ్యాట్, గ్లోవ్స్, బంతులు తదితర సామగ్రిని విదేశాలైన జర్మనీ అమెరికా రావాల్సి ఉంటుందన్నారు. స్లగ్గర్ (బ్యాట్) సుమారు రూ.7 వేలు, గ్లోవ్ రూ.2 వేలు, బంతి సుమారు రూ.500 వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా ద్వారా సాఫ్ట్బాల్లో ప్రతిభ చూపిన పలువురు ఉద్యోగాలు పొందుతున్నారని పృథ్విరాజ్ తెలిపారు. ఇటీవల పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ద్వారా 49 మంది సాఫ్ట్బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. డిఎస్పి స్థాయిలో కూడా ఉన్నారు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం సాఫ్ట్బాల్ కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర అధికారులు మరియు స్పాన్సర్లు ముందుకు రావాలని కోరారు. తగిన ప్రోత్సాహం, క్రీడా సామగ్రి, ఆర్థిక సహకారం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేయాలన్నదే తన లక్ష్యమని పృథ్విరాజ్ తెలిపారు.