డీలిమిటేషన్‌తో ‘జెర్రీమాండరింగ్’ భయం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు చట్టంగా మారే అవకాశాలు కనిపిస్తుండటంతో దేశవ్యాప్తంగా జెర్రీమాండరింగ్ అనే అంశంపై ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
- అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గ సరిహద్దులు మార్చే ప్రమాదం: విపక్షాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు చట్టంగా మారే అవకాశాలు కనిపిస్తుండటంతో దేశవ్యాప్తంగా జెర్రీమాండరింగ్ అనే అంశంపై ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాజకీయ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చేలా నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడాన్నే జెర్రీమాండరింగ్ అంటారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాలు తమ అనుమానాలను బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నాయి. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. డీఎంకే, ఎన్సీపీ(శరద్‌పవార్ వర్గం) వంటి రెండు కీలక ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
జెర్రీమాండరింగ్ అంటే ఏమిటి?
అమెరికా కాంగ్రెస్ లైబ్రరీ ప్రకారం.. 1812 మార్చి 26న బోస్టన్ గెజిట్‌లో ప్రచురితమైన ఒక కార్టూన్ ద్వారా ఈ పదం మొదటిసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ ఎల్బ్రిడ్జ్ జెర్రీ హయాంలో రాష్ట్ర సెనేట్ ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించారు. ఈ మార్పుల్లో భాగంగా బోస్టన్ ప్రాంతంలోని ఒక నియోజకవర్గం వంకరటింకర ఆకారంలో ఉండటంతో, అది పౌరాణిక జీవి సాలమాండర్ను పోలి ఉన్నదని విమర్శలు వచ్చాయి. దీంతో గవర్నర్ జెర్రీ పేరులోని ‘జెర్రీ’, సాలమాండర్లోని ’మాండర్’ పదాలను కలిపి ‘జెర్రీమాండరింగ్’ అనే పదం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల సరిహద్దులను మార్చే విధానంతో ఆయన పేరు శాశ్వతంగా ముడిపడిపోయింది.
జెర్రీమాండరింగ్ను ఎలా ఉపయోగించుకోవచ్చు?
ఓటర్లను వివిధ నియోజకవర్గాల్లో విభజించడం ద్వారా ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పార్టీలు అనేక పద్ధతులను ఉపయోగించవచ్చు.
- తమ బలమైన ఓటర్లను కొన్ని నియోజకవర్గాలకే పరిమితం చేయడం: ఒక పార్టీకి బలమైన మద్దతు ఉన్న ఓటర్లను కొన్ని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కేంద్రీకరిస్తారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆయా స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుస్తారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో వారి ప్రభావం తగ్గిపోతుంది. పునర్విభజన ప్రక్రియను నియంత్రించే పార్టీ.. కొన్ని స్థానాలను ప్రత్యర్థులకు వదిలేసినా, మిగిలిన నియోజకవర్గాల్లో ఆధిపత్యం కొనసాగించేలా వ్యూహం రచించవచ్చు.
- ప్రత్యర్థి పార్టీ ఓటర్లను వివిధ నియోజకవర్గాలకు విభజించడం: ప్రత్యర్థి పార్టీకి బలమైన మద్దతు ఉన్న ఓటర్లను అనేక నియోజకవర్గాలకు విడగొడతారు. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ వారి ఓట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఆ ఓటర్ల సమిష్టి ప్రభావం బలహీనపడుతుంది.
- ప్రత్యర్థి నేతలను ఒకే నియోజకవర్గంలో పోటీకి దించడం: ఒకే పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకే నియోజకవర్గంలో ఉండేలా సరిహద్దులను మార్చవచ్చు. దీంతో వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వస్తుంది. ఫలితంగా ప్రత్యర్థి పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది.
- సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేయడం: ఒక ఎమ్మెల్యే నివాసం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం పరిధి నుంచి బయటకు వెళ్లేలా సరిహద్దులను మార్చవచ్చు. దీంతో సదరు ఎమ్మెల్యేకు తన పాత ఓటర్లతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. తిరిగి ఎన్నిక కావడం కష్టమవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

