రాలిపోతున్న నేతన్నసంక్షోభంలో చేనేత..
- కాంగ్రెస్ పాలనలో మూగబోతున్న మరమగ్గాలు
- ఉపాధి కరువై.. బతుకు భారమై బలవన్మరణాలు
- మూడేండ్లల్లో 54మంది ఆత్మహత్యలు
- ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆర్డర్లు
- చేతికందని సర్కార్ సంక్షేమ పథకాలు
- రోడ్డునపడుతున్న కుటుంబాలు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేండ్ల పాలనలో సాంచాల సవ్వడితో కళకళలాడిన వస్త్రోత్పత్తి రంగం మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. నాడు బతుకమ్మ చీరలు, స్కూల్ విద్యార్థుల యూనిఫామ్‌ల తయారీతో తీరికలేని మరమగ్గం నేడు మూగబోతున్నది. ఇన్నాళ్లు మరమగ్గాన్ని నమ్ముకొని నిశ్చింతగా బతుకెళ్లదీసిన కార్మికలోకం చేతినిండా పనిలేక, బతుకు భారమై.. ఉపాధి కరువై మళ్లీ ఉరితాళ్లు పేనుతున్నది. అండగా నిలువాల్సిన సర్కార్ భరోసాను ఎ గ్గొట్టడం.. చేనేత బీమాను నిలిపివేయడం.. చేయూతకు పొగబెట్టడం.. త్రిఫ్ట్కు మంగళం పాడటం.. నాలుగు వేల పింఛన్ ఊసెత్తకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 36 నెలల్లో 20వేలకు పైగా పవర్‌లూమ్‌లు మూతపడటం.. ఏకంగా 54 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
వెలుగులు నింపిన కేసీఆర్
సమైక్య రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారిన నేతన్నల బతుకుల్లో స్వరాష్ట్రంలో కేసీఆర్ వెలుగులు నింపారు. ఉమ్మడి రాష్ట్రం లో లేని విధంగా ఏటా బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించారు. బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మక్ కానుకలు, స్కూల్ యూనిఫామ్‌లు, ప్రభుత్వ శాఖల్లోని ఇతరత్రా వ స్త్రాల కోసం ఏటా రూ.300 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించారు. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, చేనేత మిత్ర, బతుకమ్మ చీరలు పథకం, నేత కార్మికుల రుణమాఫీ, పావలా వడ్డీ పథకం, మరమగ్గాల కార్మికులకు పొదుపు వంటి బృహత్తర పథకాలను అమలు చేశారు. మరమగ్గాల ఆధునీకరణకు చర్యలు తీసుకున్నారు. ప్రతినెలా కనీసం రూ.20వేల ఆదాయం సమకూరేలా చేసి వారి కడుపు నింపారు. 50 ఏండ్లు నిండిన సుమారు 5వేల మందికి ప్రతి నెలా రూ.2,016 పింఛన్ అందజేసి అండగా నిలిచారు. సిరిసిల్లలో అప్పెరల్ పార్క్, వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధికి బాటలు వేశారు.
నేతన్నలకు మొండిచెయ్యి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల జీవితం తారుమారైంది. వస్త్రోత్పత్తి రంగాన్ని ఉద్ధరిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైంది. టెస్కో ద్వారా నిరంతర ఉపాధి కల్పిస్తామని 2024 మార్చి 11న జీవో 1 జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, దవాఖానలు, కార్పొరేషన్లు, విద్యాసంస్థల వస్త్రాల ఆర్డర్లను టెస్కో ద్వారా తీసుకోవాలని పేర్కొన్నది. గుర్తింపు పొందిన సంఘాలు ఒకవేళ సరఫరా చేయకుంటే నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇతర ఏజెన్సీలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. జీవో1ని సర్కారే తుంగలో తొక్కుతున్నది. కేవలం ఇందిరమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చి న ప్రభుత్వం.. గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్‌ల టెండర్లను గుజరాత్‌కు చెందిన మఫత్లాల్కు కట్టబెట్టింది. కమీషన్ల కోసమే వంద కోట్ల విలువైన టెండర్లను ప్రైవేట్ కంపెనీకి బట్టల ఆర్డర్లు ఇచ్చిందనే కార్మిక సంఘాలు అభ్యంతరం చెబుతున్నా మొండిగా ముందుకెళ్తున్నది.
కార్మికులపై కాంగ్రెస్ కక్ష
కేసీఆర్ హయాంలో చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మంగళం పాడుతున్నది. పావ లా వడ్డీ పథకానికి నిధులివ్వడం లేదు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నామనే కారణంతో నేతన్న బీమా స్కీమ్‌ను ఎత్తేశారు. 50% నూలు సబ్సిడీని సైతం వర్తింపజేయడం లేదనే ఆరోపణలున్నాయి. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతం కాగా వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరమగ్గాల బంద్‌తో ఉపాధికి దెబ్బ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చేనేత కార్మికులకు వస్త్రాల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోని మరమగ్గాలు పెద్దసంఖ్యలో మూతపడ్డాయి. సిరిసిల్లలో సుమారు 15 వేలు, నల్లగొండలో 2,800, మిగిలిన ప్రాంతాల్లో సుమారు 1,200 పవర్‌లూమ్‌లను పక్కనబెట్టారు. గతంలో పవర్లూమ్ పరిశ్రమ ద్వారా 59వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందేవారు. అయితే చేతినిండా పనిలేకపోవడంతో 23వేలకు పైగా కార్మికులు ఇతర వృత్తులకు మళ్లినట్లు చేనేత సంఘాల బాధ్యులు చెప్తున్నారు. ఇలా సర్కార్ చేనేత, పవర్లూమ్ పరిశ్రమలపై చిన్నచూపు చూడటంతో అప్పుల భారం పెరిగిపోయి. ఉపాధి దూరం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 54మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. వందలాది మంది మనోవేదన, ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరికి బీమా పథకం కింద ఆర్థికసాయం కూడా అందలేదని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 18మంది మాత్రమే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించి ఇందులో 11మందికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామని చెప్పడం గమనార్హం.
కేసీఆర్ పాలనలో పవర్లూమ్ కార్మికులకు అమలుచేసిన పథకాలు
1) నేతన్నకు చేయూత
2) నేతన్నకు బీమా
3) చేనేత మిత్ర
4) బతుకమ్మ చీరలు పథకం
5) నేత కార్మికుల రుణమాఫీ
6) పావలా వడ్డీ పథకం
7) మరమగ్గాల కార్మికులకు పొదుపు పథకం
8) ఆసరా పింఛన్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

