నేడు లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్ 2.0
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నది.
- బిల్లు ఆమోదంపై కేంద్రం ధీమా
- 371 మంది లోక్ సభ సభ్యుల మద్దతుందన్న ప్రభుత్వ వర్గాలు
- డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) మద్దతుతో మారిన ఓటింగ్ సమీకరణలు
- స్టాలిన్, పవార్‌ను ఒప్పించడంలో ఇండియా కూటమి నేతలు విఫలం
న్యూఢిల్లీ, నవంబర్ 29: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నది. గత ఏప్రిల్‌లో భంగపాటుకు గురైన కేంద్ర సర్కార్.. ఈసారి బిల్లులు కచ్చితంగా గట్టెక్కుతాయన్న ధీమాతో ఉన్నది. లోక్‌సభలో 371 మంది ఎంపీల మద్దతు తమకు ఉందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించాలని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, తృణమూల్ అధినేత మమతాబెనర్జీ తదితర ఇండియా కూటమి నేతలు చెన్నైకి వెళ్లి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అయితే తన వైఖరిని మార్చుకునేందుకు స్టాలిన్నిరాకరించారు.
ఎన్సీపీ( ఎస్పీ) కూడా మద్దతు..
ఈ ఏడాది ఏప్రిల్‌లో గత రూపంలోని బిల్లును వ్యతిరేకించిన ఎన్సీపీ (ఎస్పీ) కూడా తాజాగా ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. గతంలో డీఎంకేతో కలిసి ఈ బిల్లును వ్యతిరేకించడం వల్ల పార్లమెంట్లో నరేంద్రమోదీ సర్కార్‌కు అరుదైన పరాజయం ఎదురైంది.
ఎస్సీ, ఎస్టీ స్థానాలూ 50 శాతం పెంపు
లోక్‌సభ స్థానాల సంఖ్యను గరిష్ఠంగా 850కి పెంచి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే షెడ్యూల్డ్ కులాలు (ఎస్పీ), షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వే చేసిన స్థానాలు కూడా 50 శాతం పెరుగుతాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
బీజేపీ ఎంపీలతో మోదీ సమావేశం
ఆదివారం ప్రధానిమోదీ, కేంద్రమం త్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. 30 మందికిపైగా ఎంపీలు, మంత్రులు, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రధాని నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు.
ఏప్రిల్ ఓటింగ్‌తో పోలిస్తే మారిన లెక్కలు
ఈ ఏడాది ఏప్రిల్ 17న రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 298 మంది ఎంపీలు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. మొత్తం 528 ఓట్లు పోలవగా, బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో ప్రభుత్వం 54 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయని, ప్రతిపక్ష శిబిరం నుంచి 26 మంది ఎంపీలు బయటకు వచ్చారని కేంద్రం చెబుతున్నది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. మరో ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.
మద్దతు లెక్కలు ఇలా..
ప్రస్తుతం ఎన్డీయేకు అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో కలిపి 299 మంది ఎంపీల బలం ఉంది. ఇందులో బీజేపీకి 240, టీడీపీకి 16, షిండే శివసేనకు 13, జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. మిగిలిన వారు ఇతర చిన్న మిత్రపక్షాలకు చెందినవారు. డీఎంకే (22), ఎన్సీపీ (ఎస్పీ) 8, ఎన్సీపీఐ (20), వైఎస్సార్సీపీ (4) మద్దతు లభిస్తే బిల్లుకు అనుకూలంగా ఉన్న ఎంపీల సంఖ్య 353కు చేరుతుందని సమాచారం.
జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వంలో ఉన్న జేఎంఎం కూడా అనుకూల సంకేతాలు ఇచ్చింది. ఏడుగురు స్వతంత్ర ఎంపీలు ఉన్నారు. మరోవైపు, ఇండియా కూటమి బలం ఏప్రిల్‌తో పోలిస్తే తగ్గింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 98, ఎస్పీకి 37, మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ వర్గానికి 8, ఆర్జేడీకి 4, శివసేన (యూబీటీ)కి 3, వామపక్ష పార్టీలకు 9 మంది ఎంపీలు ఉన్నారు. కొత్త బిల్లుతో లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

