సామంతులమా.. స్వతంత్రులమా?
ఢిల్లీకి సామంతులుగా ఉందామా? స్వతంత్రులుగా ఉందామా? ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలను గుర్తుచేసిన ఆయన.. ఢిల్లీకి గులాములుగా ఉందామా? లేదా గులాబీలను ఢిల్లీకి పంపుదామా? తేల్చుకోవాలని దీక్షా దివస్ స్ఫూర్తి సభ సాక్షిగా పిలుపునిచ్చారు.
- మిగిలింది కేవలం 500 రోజులే!
- మొదలైన కౌంట్ డౌన్ కాంగ్రెస్ డౌన్
- గులాములుగా ఉందామా.. గులాబీలను ఢిల్లీకి పంపుదామా?: కేటీఆర్
- 17 మంది ఎంపీలుంటే మోకాళ్లపై హస్తిన దేక్కుంటూ వస్తది
- పార్లమెంట్లో ఉన్నది మోదీ, సోనియా, చంద్రబాబు తొత్తులే
- తెలంగాణపై మోదీ మనసులో విషం ఉన్నది నిజం కాదా?
- 90 సీట్లు కాదు..900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతిపెడుదాం
- 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా రాబోతున్నడు.. కౌంట్‌డౌన్ హ్యాస్ బిగిన్
- అలుగునూర్ దీక్షాదివస్ స్ఫూర్తి సభలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి సామంతులుగా ఉందామా? స్వతంత్రులుగా ఉందామా? ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలను గుర్తుచేసిన ఆయన.. ఢిల్లీకి గులాములుగా ఉందామా? లేదా గులాబీలను ఢిల్లీకి పంపుదామా? తేల్చుకోవాలని దీక్షా దివస్ స్ఫూర్తి సభ సాక్షిగా పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా లోక్‌సభలో తెలంగాణకు మాత్రం గొంతులేదని చెప్పారు.
అకడ ఉన్నది చంద్రబాబు తొత్తులు, మోదీ బానిసలు, సోనియా గాంధీకి ఊడిగం చేసేటోళ్లు తప్ప తెలంగాణ బిడ్డలు అకడ లేరన్న కేటీఆర్.. గులాబీ జెండా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎట్టిపనికైనా.. మట్టిపనికైనా మనోడే ఉండాలన్నట్టు 17 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ పార్టీని గెలిపిస్తే ఢిల్లీయే మోకాళ్ల మీద దేక్కుంటూ తెలంగాణకు వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ద్వారా ఆనాడు ఢిల్లీని శాసించినట్టే.. మళ్లీ ఢిల్లీని శాసిద్దామని చెప్పారు. శిశుపాలుడి తప్పులు వంద పూర్తయినట్టు కాంగ్రెస్ తప్పులు కూడా లెక్కకు చేరాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు 90 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి డైలాగ్‌లు నరుకుతున్నారని, కానీ ప్రజలు ఆ పార్టీని 900 ఫీట్ల లోతున పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలే సుదర్శన చక్రం పట్టుకుని కాంగ్రెస్ తల నరికేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మూడేండ్ల పాలన ముగిసింది. ఇక మిగిలింది 500 రోజులే.. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం’ అని ధీమాగా చెప్పారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ సభలో కేటీఆర్ భావోద్వేగంతో ప్రసంగించారు. ‘తెలంగాణ కడుపులో పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణను కడుపుల పెట్టుకునే పార్టీ బీఆర్ఎస్. అసొంటి పార్టీలే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడగలుగుతాయని. మిగతావాళ్లతో ఏం కాదని.. తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఉండదు’ అని పేర్కొన్నారు.
సంచులు మోసేదొకటి.. చెప్పులు మోసేదొకటి
తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకటి సంచులు మోసే పార్టీ అయితే.. మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ విమర్శించారు. ‘ఒకాయన మా అధ్యక్షుడు ఎప్పుడు చెప్పులు ఇడుస్తడా అని చూస్తడు. ఆయన సంగతి నాకంటే మీకే ఎక్కువ ఎరుక అంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఏం చేసిండ్రు బీజేపోళ్లు ఒక బడి తెచ్చిండ్రా? ఒక గుడి తెచ్చిండ్రా? రూపాయైనా తెచ్చిండ్రా? ఎప్పుడో 2004-05లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్‌ను 21 ఏండ్లయినా పూర్తికాలేదు.. కొత్తపల్లికి కాదు కదా.. కనీసం సిరిసిల్లకు కూడా రైలు చేరలేదు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇదేనా బీజేపీ అభివృద్ధి.. ఇదేనా మీ గొప్పదనం. పన్నెండేండ్లుగా అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటి అని నిలదీశారు.

రాష్ట్ర విభజనను పాకిస్తాన్‌తో పోల్చుతరా?
కాంగ్రెస్‌తోపాటు ఇంకొక దుర్మార్గమైన పార్టీ బీజేపీ అని కేటీఆర్ చెప్పారు. ‘తల్లిని చంపి, బిడ్డను బతికిచ్చిన్రు’ అని ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నోసార్లు అన్నారని గుర్తుచేశారు. ‘కడుపులో నిజంగా విషం లేకపోతే మోదీ అలా ఎలా మాట్లాడతారా? ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి? తెలంగాణ ఉద్యమ త్యాగాలు నీకు తెల్వదా? మా బిడ్డల బలిదానాలు నీ సోయిలో లేవా? ఒక రాష్ట్రం గురించి, అందుకు చేసిన త్యాగాల గురించి మాట్లాడే పద్ధతి ఇదేనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకుడొకడు పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్లమెంట్లో గులాబీ కండువా కప్పుకొన్న ఒక బీఆర్ఎస్ బిడ్డ ఉంటే.. తెలంగాణ సోయి ఉన్నోడు ఉంటే.. పాకిస్తాన్‌తో పోల్చిన ఆ బీజేపీ ఎంపీ గల్లా పట్టి ప్రశ్నించేదని చెప్పారు.
కాంగ్రెసోళ్లు ఒక్కటైనా నెరవేర్చారా?
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి.. ఒక్కటైనా నెరవేర్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. నాడు ‘ముసలోళ్ల పెన్షన్ నవంబర్‌లో తీసుకుంటే 2వేలు, డిసెంబర్లో తీసుకుంటే 4వేలు ఇస్తామన్నడు? మూడేండ్లు అయింది ఇచ్చిండా?’ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు. మేము ఆ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నడు? ఇచ్చిండా?’ అని కేటీఆర్ అడుగగా, సభలోంచి జనాలు ‘ఇవ్వలేదు.. ఇవ్వలేదు’ బదులిచ్చారు.

ఇక ‘రైతుబంధు కేసీఆర్ రూ.10వేలు ఇస్తే.. నేను 15వేలు ఇస్తా అన్నడు. కేసీఆర్ రైతులకే ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నడు. ఇవ్వకపాయె. రైతు కూలీలకు నెలకు రూ. వెయ్యి ఇవ్వకపాయె, ఆటో డ్రైవర్లకు నెలకు రూ. వెయ్యి ఇయ్యకపాయె’ అని చెప్పారు. వారే కాకుండా మహిళలకు, విద్యార్థినులకు సూ టీలు అన్నాడని, 10వ తరగతి పాస్ అయితే 10వేలు. 12వ తరగతి పాస్ అయితే 18 వేలు, డిగ్రీ చేస్తే 50వేలు పీజీ చేస్తే లక్ష, పీహెచ్డీ చేస్తే 5 లక్షలు, విద్యాభరోసా కార్డు ఇస్తామని నరికిన రేవంత్‌రెడ్డి.. ఒక హామీ అయినా నెరవేర్చిండా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ మళ్లీ మొదటికొచ్చింది..
తెలంగాణ గ్రామాల్లో ఇవాళ పరిస్థితి మొదటి కొచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు వేయకపోవడం, కరెంట్ సకగా ఇవ్వకపోవడం, ఉన్న రైతు బీమాను ఎగ్గొట్టడం వంటి చేష్టలతో తెలంగాణ ద్రోహుల చేతుల్లో వెళ్లి.. మళ్లీ మొదటికొచ్చిందని చెప్పారు. నాటి క్రాప్ హాలిడేలు మళ్లీ వినిపిస్తున్నాయని, మొన్నటిదాకా లక్షణంగా వచ్చిన కరెంట్‌కు ఏం రోగం వచ్చింది? మళ్లీ ఎందుకు మాయమైందో ఆలోచించాలని ప్రజలను కోరారు. బ్రహ్మాండంగా పారిన నీళ్లు ఇప్పుడెందుకు వస్తలేవని ప్రశ్నించారు. ‘కరోనా కంటే భయంకరమైన కాంగ్రెస్ మన నెత్తి మీద వచ్చి కూర్చున్నది. ఇవాళ తెలంగాణ సోయి లేని పాలకులు కాళేశ్వరం మీద కక్ష కట్టిన్రు’ అని ధ్వజమెత్తారు.

కుప్పం దాకా ఎట్ల పారుతున్నయ్?
‘తెలంగాణ సోయి ఉన్నోడెవడైనా ఆంధ్రా కు నీళ్లు ఇడిచిపెడతాడా? కేసీఆర్ మీద కోపం తో కాళేశ్వరాన్ని పండబెడతడా? ఆ కోపంతో పాలమూరు మీద పగబడతడా? ఇదేనా తెలంగాణ సోయి? కేసీఆర్ మీద కోపంతో నీళ్లన్నీ కిందికి ఇడిచిపెట్టిండు. గోదావరి నీళ్లు ఆంధ్రాకి ఇడిసిపెట్టిండు. కృష్ణా నీళ్లు గురువు కుప్పం దాకా తీసుకపోయిండు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. 750 కిలోమీటర్ల అవతల కుప్పానికి పోయిన నీళ్లు.. 70 కిలోమీటర్ల లోపలే ఉండే పాలమూరుకు మాత్రం ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. ఆనాడు పోతిరెడ్డిపాడు శ్రీశైలం నుంచి నీళ్లు గుంజుకపోతుంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్లు నోరు మూసుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నాగార్జునసాగర్‌కు బొకగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా మళ్లీ నోరు మూసుకొని చంద్రబాబుకు చెంచాల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
జీవనాడి కాళేశ్వరంపై కాంగ్రెస్ దాడి
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం మీద కాంగ్రెస్, బీజేపీ నేతల దాడి జరుగుతున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘కన్నీళ్లు తప్ప సాగు నీళ్లు తెలువని తెలంగాణ గోస మీకు తెలువా లి’ అని చెప్పారు. ‘కేసీఆర్ సీఎం కాకముందు, తెలంగాణ రాకముందు పాడువడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఎండిన చెరువులు, మొండి గోడలు, పల్లె పల్లెన పల్లేర్లు, వలవల ఏడుస్తూ వలసలు. పొద్దున్నే పేపర్ చూస్తే రై తుల ఆత్మహత్యలు లేదంటే ఎన్కౌంటర్లు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మాట వాస్తవం కాదా? నాటి యువత అడవులు పట్టుకొని పోలేదా? మానేరు వా గులో నీళ్లు పారలేదు కానీ.. తెలంగాణ రాకముందు నెత్తురు పారింది’ అని గుర్తుచేశారు. కేసీఆర్ గళమెత్తి గర్జించేదాకా తెలంగాణకు నీళ్లు లేవని, అందుకే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టుకున్నట్లు చెప్పారు. ‘అన్నమో రామచంద్ర’ అని అలమటించిన తెలంగాణను దేశానికే ధాన్య భాండాగారంగా, అన్నపూర్ణగా అవతరించేలా కేసీఆర్ చేశారని వివరించారు.

కేసీఆర్ సీఎంగా ఉంటే.. నీళ్లెత్తుకపోయేవాళ్లా?
ఇవాళ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్లు ఎత్తుకపోయే ధైర్యం చేసేవాళ్లా అని ఆలోచన చేయాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్ తూములు బద్దలుకొట్టి నీళ్లు తీసుకపోతామని ఒక ఆంధ్రా నాయకుడు బెదిరిస్తే.. ‘మా ఆర్డీఎస్ను ము డితే.. సుంకేశుల బ్యారేజ్‌ను వెయ్యి బాంబులు పెట్టి లేపుతా’ అని గర్జించిన నాయకుడు కేసీఆర్, అది కదా తెలంగాణ పౌరుషం. తెలంగా ణ సోయి’ అని కేటీఆర్ చెప్పారు.
ఎత్తిన జెండా దించని కేసీఆర్..
నాడు కేసీఆర్ ఇదే కరీంనగర్లో ‘నేను ఉ ద్యమానికి బయలుదేరుతున్నా… నేను గనుక ఎత్తిన జెండా దించితే.. నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం కరీంనగర్ బిడ్డలుగా మీకిస్తున్నా’ అని కేసీఆర్ అన్నాడని.. అలా అనగలిగే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా.. మళ్లీ తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా.. తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతా’ అనే ఆత్మవిశ్వాసం ఉన్న నేత ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? అని ఆలోచన చేయాలన్నారు.
కలాలు.. గళాలపై దాడులా?
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొంతమంది మన కవులు.. కళాకారుల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు. ‘తెలంగాణ కళాకారుల మీద.. ఆడబిడ్డల మీద కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డమైన కారుకూతలు కూస్తున్నరు. మన మధుప్రియ మీద.. మన సావిత్రి మీద ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. కలాలు.. గళాలు మళ్లీ విప్పాల్సిన రోజు మళ్లీ వచ్చింది. కవులు, గాయకులు రసమయి బాలకిషన్ లాంటి వాళ్లు విజృంభించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది’ అని చెప్పారు.
కాంగ్రెసోళ్ల పేరు లేకుండా చేస్తాం..
కాళేశ్వరం సహా పలు ప్రాజెక్ట్‌ల పేర్లను మా ర్చి కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏ పథకానికీ కాంగ్రెస్ నేతల పేర్లు లేకుండా చూస్తామని ప్రకటించారు. ‘అధికారులారా.. డ్యూటీలు చేయండి.. అతి చేయకండి.. యాది పెట్టుకోండి కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్టయింది. 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా రాబోతున్నరు.. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
గాంధీభవన్‌కు ప్యాకింగ్ చేస్తాం..
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి కాంగ్రెస్ తప్పు చేసిందని కేటీఆర్ విమర్శించా రు. సాంస్కృతిక ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి రూపుదిద్దుకున్నదని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాంగ్రెస్ దౌర్భాగ్యుడు మాయం చేశాడని.. ఆమె తలపై కిరీటాన్ని దొంగ ఎత్తుకుపోయాడని.. తులం బంగారం ఇస్తామని.. తెలంగాణ తల్లి నెత్తిమీదున్న కిరీటం ఎత్తుకుపోయారని వంగ్యాస్ర్తాలు సంధించారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ విగ్రహాన్ని గాంధీభవన్‌కు ప్యాకింగ్ చేసి పంపుతామని తేల్చిచెప్పారు.
అభిమన్యుడు కాదు.. అర్జునుడు
పార్టీ పెట్టి దండి గుండెతో మొండి ధైర్యంతో కేసీఆర్ ముందుకు నడిచిననాడు. ఆయనెంబడి పిడికెడు మందే ఉన్నరు. ఎన్ని కుట్రలు.. ఎన్ని కుతంత్రాలు.. ఎన్నెన్ని అవమానాలు? తెలంగాణ సాధన ఉద్యమం అదొక పద్మవ్యూహం. కానీ బీరిపోయేతందుకు అక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. కృష్ణుడిలా ప్రత్యర్థుల ఊహకందని వ్యూహాలను రూపొందించింది కేసీఆర్. అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించింది కేసీఆరే. తెలంగాణ కురుక్షేత్రంలో రథం నడిపింది.. రణం చేసిందీ కేసీఆరే..
900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతిపెడుదాం
శిశుపాలుడి తప్పులు వంద అయినట్టు కాంగ్రెసోనియి కూడా దగ్గరవడ్డయ్.. కాంగ్రెస్ తల నరికేతందుకు ప్రజలు సుదర్శన చక్రం పట్టుకొని సిద్ధంగా ఉన్నరు. ముఖ్యమంత్రి నరుకుతున్నడు.. 90 సీట్లు వస్తయట.. 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతిపెడుదాం. యాది పెట్టుకోండి.. 500 రోజుల్లోనే తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నడు. కౌంట్‌డౌన్ హ్యాస్ బిగిన్.
ఇదీ తెలంగాణ కథ
పాముల కోరలు పీకిన చీమలదండు కథ మనది. మదపుటేనుగులను బంధించిన గడ్డిపోచల కథ మనది. గద్దల నెత్తులు నరికిన కాకుల కథ మనది.. ఒక బక్క పలుచని యోధుడు.. తన జాతి బానిస సంకెళ్లు తెంచిన కథ మనది..
దటీజ్ కేసీఆర్
మీకోసమే మీరు కలగని ఆ కలను నిజం చేసుకుంటే మిమ్మల్ని విజేత అంటరు. కానీ నీ మట్టి కోసం.. నీ జాతి కోసం.. నీ దేశం కోసం.. నిన్ము నమ్ముకున్న మనుషుల కోసం కలగని ఆ కల సాకారం కావడానికి సావుకు కూడా సిద్ధపడితే ఏమనాలె ఆ నాయకుడిని? వివిధ దేశాల్లో మహాత్ముడు అంటరు.. మార్టిన్ లూథర్ కింగ్ అంటరు.. నెల్సన్ మండేలా అంటరు.. అదే తెలంగాణలో అయితే ఒక కే..సీ..ఆర్ అంటరు. దటీజ్ కేసీఆర్!
కేసీఆర్ పేరు.. కోటిసార్లు తలిచిండు!
రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ఒక మాట అనకపోయినా, ఆయన పేరు తీయకపోయినా.. ప్రతి మీటింగ్‌లో ఆయన పేరు తలుస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ మూడేండ్ల్లలో కేసీఆర్ పేరును ఓ కోటి సార్లు తలుచుకొని ఉంటాడని చెప్పారు. ‘పేరుకేమో హైదరాబాద్‌లో ఉన్నయి అసెంబ్లీ.. సెక్రటేరియట్. కానీ, రాష్ట్ర రాజకీయం మొత్తం ఎర్రవల్లి చుట్టూ, కేసీఆర్ ఇంటి చుట్టే తిరుగుతున్నది. అది కేసీఆర్ అంటే. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే’ అని చెప్పారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కమిట్మెంట్, ఆయన స్టేట్మెంట్లు అలాంటివని పేర్కొన్నారు. కేసీఆర్ దాదాపు మూడేండ్ల నుంచి ఎకువగా బయటికి రాలేదని కేటీఆర్ చెప్పారు. ఆయన ఓట్లప్పుడే ఆలోచించుకోమని, మోసపోతే గోసపడతరని చెప్పిండని గుర్తుచేశారు. ఈ కొత్త ప్రభుత్వం ఏమన్నా చేస్తదా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటదా? అని నాటినుంచీ కేసీఆర్ ఎంతో ఓపికతో ఎదురుచూస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
దీక్షా దివస్ స్ఫూర్తిగా.. అమరుల త్యాగాల సాక్షిగా..తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకుందాం.. జల దోపిడీపై జంగ్ సైరన్ మోగిద్దాం.. ప్రగతి నిరోధకులను ప్రతిఘటిద్దాం..తెలంగాణను తెర్లు చేస్తున్న ద్రోహులను, విచ్ఛిన్నకారులను తరిమికొడుదాం..
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ మూడేండ్లకెళ్లి ఎక్కువ బయటలకు రాలే.. ఆయన ముందే చెప్పిండు.. ఓటేసేటప్పుడే ఆలోచించుకోండ్రి.. మోసపోతే గోస పడుతరని చెప్పిండు. ఆయన ఓపికగా చూస్తున్నరు. ఈ కొత్త ప్రభుత్వం ఏమన్నజేస్తదా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటదా అని ఎదురుచూస్తున్నడు.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొస్తడన్నట్టు.. కేసీఆర్ ఎప్పుడైతే గులాబీ జెండా ఎగరేసిండో.. ఎప్పుడైతే ముందటికొచ్చిండో.. ఎప్పుడైతే సరైనవాడు సమరాన్ని నడిపిస్తడో.. ఎప్పుడైతే దమ్మున్నోడు దళపతి అయితడో.. గోల్ కొడుతం అని చూపెట్టిండు.. 14 ఏండ్లలోపల్నే తెలంగాణ సాధించి మీకు అప్పజెప్పిండు.
-కేటీఆర్
రాహుల్.. ఉద్యోగాలేవీ?
హామీ ఇచ్చి మూడేండ్లయింది.. మరి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయ ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రెండు ఉద్యోగా లు మీరు ఊడగొట్టండి.. మొదటి సంవత్సరమే నేను మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా’ అని చెప్పిన రాహుల్.. ఎక్కడ పోయారని నిలదీశారు. యువత మళ్లీ గర్జించే టైమ్ వచ్చిందని, దీక్షా దివస్ స్ఫూర్తితో కదం తొకి కాంగ్రెస్‌ను ఖతం చేయాలని పిలుపునిచ్చారు.
చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా?
‘మనం గట్టిగా మాట్లాడితే కేసీఆర్‌ను బూతులు తిడతాడు, శునకానందం పొందుతాడు’ అని కేటీఆర్ చెప్పారు. అ టువంటి వారిని ఉద్దేశించే.. నాడు వేమ న ‘అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చినా దొడ్డవారి నెల్ల తొలగజేయు. చెప్పు తినె డి కుక చెరుకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినురవేమ’ అన్నారని గుర్తుచేశా రు. చెప్పు తినే కుకకు అవకాశం, అధికారం ఇస్తే, సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారుతదా? కుక తోక ఎప్పటికీ వంకరగానే ఉంటది’ అ ని నాడు వేమన చెప్పారని గుర్తుచేశారు.
మళ్లా కేసీఆర్ సార్ రావాలె..
రాష్ట్రం కోసం చావుఅంచులకు వెళ్లి తెలంగాణ సాధించిండు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెట్టి ఎవుసాన్ని లాభసాటిగా మార్చిండు. రేవంత్‌రెడ్డి ముసలోల్లకు రూ.4వేలు పింఛన్ ఇస్తానని మాయమాటలు చెప్పి గెలిచిండు. గెలిచినంక అన్ని ఎగ్గొట్టిండు. మళ్లా కేసీఆర్ సారు వస్తేనే మా అసొంటోల్లకు న్యాయం జరుగుతది. చాతకాకున్న కట్టె పట్టుకుని కేసీఆర్ సారు కొడుకు కేటీఆర్ సారును చూద్దామని మీటింగ్‌కు పోతున్న.
– తొంటి కొమురయ్య, మంగళపల్లి (చొప్పదండి)
తెలంగాణ చరిత్రలో నిలిచేరోజు
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కేసీఆర్ చేపట్టిన దీక్షే కారణం. కేసీఆర్ అన్నివర్గాలను కలుపుకొని చేపట్టిన పోరాటాన్ని నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాటి దీక్ష ఫలితమే నేటి మన రాష్ట్ర ఆవిర్భావానికి నాంది. ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఉన్న ఈ రోజున దీక్షా దివస్ పేరిట సభ ఏర్పాటు చేసి ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం అభినందనీయం. భావితరాలకు ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుంది. గ్రామస్తులతో కలిసి సభకు వెళ్తుంటే ఆ రోజులు మళ్లీ గుర్తుకువస్తున్నయి.
– లంక శంకర్ మల్కాపూర్-కొత్తపల్లి మండలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

