ఊర్మిళాదేవి నిద్ర…అనుబంధాలపై అద్వితీయ గేయం
రామాయణం అనగానే రాముడి ధర్మనిరతి, సీతమ్మ పాతివ్రత్యం, లక్ష్మణుడిసేవానిష్ఠ, హనుమంతుడి భక్తి మనకు గుర్తుకొస్తాయి. కానీ ఈ మహాకావ్యంలోని ప్రధాన పాత్రల వెనుక కనిపించకుండా మిగిలిపోయిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి త్యాగానికి ప్రతిరూపమే ఊర్మిళ. వాల్మీకి రామాయణంలో ఊర్మిళ పాత్రకు పరిమిత ప్రస్తావన మాత్రమే ఉన్నప్పటికీ, తెలుగు జానపద సాహిత్యం ఆమె జీవితాన్ని తనదైన ఊహాశక్తితో విస్తరించింది. ఆ సృజనాత్మక విస్తరణకు అద్దం పట్టే అద్భుతమైన గేయం ‘ఊర్మిళాదేవి నిద్ర’.
లక్ష్మణుడు శ్రీరాముడితో పాటు సీతమ్మను అనుసరించి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, ఊర్మిళ కూడా తన భర్తతో వెళ్లాలని కోరుకుంటుంది. కానీ అన్నా, వదినల సేవే తన ధర్మమని భావించిన లక్ష్మణుడు ఆమెను అయోధ్యలోనే ఉండమంటాడు. భర్త ఎడబాటును భరించలేని ఊర్మిళ తన పద్నాలుగు సంవత్సరాల మెలుకువ సమయాన్ని లక్ష్మణుడికి ఇచ్చి, అతని నిద్రను తాను స్వీకరించిందనే జానపద కల్పన ఈ కింది గేయానికి మూలాధారం. లక్ష్మణుడు సీతారాములకు నిద్ర లేకుండా సేవ చేయగలిగితే, ఊర్మిళ తన విరహాన్ని నిద్రలో గడపగలదనే ఈ ఊహ జానపద కవి సృజనాత్మకతకు నిదర్శనం. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు. ఆ సమయంలో సీతాదేవి ఊర్మిళ నిద్ర గురించి రాముడికి తెలియజేస్తుంది. లక్ష్మణుడి సేవలను గుర్తు చేస్తూ, ఊర్మిళ చేసిన త్యాగాన్ని వివరిస్తుంది.
ముందు మన మడవులకునుపోగాను ముద్దుమరదీ వెంటనూ
పయనమైరాగ జూచి తన
చెలియ పయనమాయెను ఊర్మిళా
వద్దు నీవుండుమనుచూ
సౌమిత్రి మనల సేవింపవచ్చే
నాడు మొదలు శయ్యపై
కనుమూసి నాతి పవళించున్నదీ
ఈ పద్య పాదాల్లో ఊర్మిళ మనసులోని కోరిక, భర్త వెంట వెళ్లాలనే ఆరాటం, తనను అయోధ్యలో ఉండమని అతను చెప్పినప్పుడు కలిగిన విరహం వ్యక్తమవుతాయి. ఊర్మిళ నిద్రపోవడం సాధారణ నిద్ర కాదు. తన భర్త ధర్మ నిర్వహణకు అడ్డంకి కాకుండా, తన బాధను తానే స్వీకరించిన త్యాగం. సీతాదేవి ఊర్మిళ త్యాగాన్ని గుర్తించడం కూడా స్త్రీ హృదయాన్ని స్త్రీ అర్థం చేసుకున్న భావోద్వేగ సందర్భం.
రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు ఊర్మిళ మందిరానికి చేరుకుంటాడు. పద్నాలుగేండ్లుగా నిద్రిస్తున్న భార్యను చూసి ఆమెను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిద్ర నుంచి పూర్తిగా మేలుకోని ఊర్మిళ తన ఎదుట ఉన్న వ్యక్తిని భర్తగా గుర్తించలేకపోతుంది. తన గదిలోకి వచ్చిన అపరిచితుడిని చూసి భయపడుతుంది. ఈ సన్నివేశంలో జానపద కవి హాస్యాన్ని, నాటకీయతను అద్భుతంగా మేళవించాడు.
అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడమ్మున కొస్తిరీ
సందు గొందులు వెదుకుచూ మీరింత తప్పుశాయగ వస్తిరీ
యెవ్వరూ లేని వేళా మీరిపుడు యేకాంతమున కొస్తిరీ
మాతండ్రి జానకరాజు వింటె మిము ఆజ్ఞసేయక మానరూ
ఊర్మిళ మాటల్లోని అమాయకత్వం, ఆగ్రహం, అప్రమత్తత పాఠకుడికి నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో తన గదిలోకి అనుమతి లేకుండా వచ్చిన వ్యక్తిని ప్రశ్నించే ఆమె ధైర్యం, ఆత్మగౌరవం కనిపిస్తాయి. జానపద గేయంలో స్త్రీ పాత్రను కేవలం ఎదురుచూసే భార్యగా కాకుండా, తన గౌరవాన్ని కాపాడుకునే వ్యక్తిగా చిత్రించడం విశేషం. అపరిచితుడిగా భావించిన లక్ష్మణుడిని ఊర్మిళ హెచ్చరిస్తూ పరస్త్రీ వ్యామోహం వల్ల నాశనమైన పురాణ పాత్రలను ఉదాహరణలుగా చెప్తుంది.
ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి
ఒడలెల్ల హీనమాయె
పరసతిని కోరిగాదా రావణుడు మూలముతొ హతమాయెను
ఒకడాలి కోరిగాదా కీచకుడు
ప్రాణములు గోలుపోయె
ఇట్టి ద్రోహముల మీరూ
యెరుగుండి యింతద్రోహము కొస్తిరా
ఇక్కడ ఇంద్రుడు, రావణుడు, కీచకుడు వంటి పాత్రలను ప్రస్తావిస్తూ ఊర్మిళ ధర్మాన్ని బోధిస్తుంది. ఈ పద్యాల్లో పౌరాణిక కథల ద్వారా స్త్రీ గౌరవం, నైతికత, కుటుంబ మర్యాదలను తెలియజేసే జానపద కవి ఉద్దేశం స్పష్టమవుతుంది. కథలో హాస్యాన్ని పండిస్తూనే ధర్మబోధ చేయడం జానపద సాహిత్యంలోని ప్రత్యేకత. లక్ష్మణుడు తన పరిచయాన్ని చెప్పినా ఊర్మిళ నమ్మదు. చివరకు తన భార్యను గుర్తించలేని పరిస్థితిని చూసి లక్ష్మణుడు ఆవేదనతో పలుకుతాడు.
నిన్ను బాసినది మొదలు
ప్రాణసఖి నిద్రహారము లెరుగనే
నీవులేక యున్ననూ ఓ సఖి
ప్రాణములు నిలుపలేనే
ఈ మాటల్లో పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసపు అలసట కంటే భార్యకు దూరంగా ఉన్న బాధ ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. ఊర్మిళ నిద్రతో విరహాన్ని దాటితే, లక్ష్మణుడు మెలకువతో తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఇద్దరూ త్యాగమూర్తులే. ఒకరి త్యాగం మరొకరి త్యాగానికి అద్దంలా నిలుస్తుంది. చివరకు ఊర్మిళ తన భర్తను గుర్తించి అతని పాదాలపై పడుతుంది. లక్ష్మణుడు ఆమెను ప్రేమగా లేవనెత్తి కన్నీళ్లు తుడుస్తాడు. ఆ క్షణంలో పద్నాలుగేండ్ల విరహం, అలక, ప్రేమ అన్నీ ఒక భావోద్వేగ కలయికగా మారుతాయి.
కౌసల్య, సుమిత్ర వచ్చి ఆ దంపతులను ఆశీర్వదించడం, సీత, శాంత, మాండవీ, శ్రుతకీర్తులు చేరి పరిహాసాలతో ఆనందాన్ని పంచుకోవడం ఈ గేయానికి కుటుంబ సౌహార్దాన్ని జోడిస్తుంది. దేవతా స్వరూపులైన రామాయణ పాత్రలను సాధారణ కుటుంబ సభ్యులుగా చూపించడం జానపద కవుల సహజమైన కథన శైలి. వారి పలకరింపులు, అలకలు, నవ్వులు మన ఇంటి అనుబంధాలను గుర్తుచేస్తాయి. చివరగా లక్ష్మణుడు ఊర్మిళకు అరణ్యవాసం నుంచి రావణ సంహారం వరకు జరిగిన కథను వివరిస్తాడు. పాటలోని ఫలశ్రుతి భక్తిభావాన్ని మరింత బలపరుస్తుంది.
ఊర్మిళా విరహమ్ములూ యివి యెవరు పాడినా విన్నగానీ
శ్రీవిష్ణు కైవల్యమూ సౌమిత్రి
విష్ణులోకమునిచ్చు
ఈ ఫలశ్రుతి పాటను పాడేవారికి, వినేవారికి లక్ష్మణస్వామి అనుగ్రహం లభిస్తుందనే జానపద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ‘ఊర్మిళాదేవి నిద్ర’ కేవలం రామాయణంలోని ఒక పాత్రకు కల్పించిన కథ కాదు. కనిపించని స్త్రీ త్యాగానికి సాహిత్యం కల్పించిన స్వరం. భర్త ధర్మానికి తోడ్పడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన ఊర్మిళ, మౌనంగా ఉన్నా ఆమె త్యాగం గొప్పదే అని ఈ గేయం గుర్తుచేస్తుంది. గేయంలోని హాస్యం, ధర్మబోధ, విరహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలు తెలుగు జానపద సాహిత్య వైభవాన్ని చాటుతాయి. ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రించినా, ఆమె త్యాగం మాత్రం తరతరాల తెలుగు ప్రజల హృదయాల్లో మేల్కొనే ఉంటుంది.
-కర్నె మల్లికార్జున్.6303744239
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

