కపిలవాయి లింగమూర్తి విలక్షణ విద్వన్మణి
కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను అధ్యయనం చేసిన గొప్ప ప్రతిభావంతుడిగా తెలంగాణ సాహితీకారుల్లో లబ్ధప్రతిష్ఠుడైన గొప్ప మహాకవి డా.కపిలవాయి లింగమూర్తి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా) బల్మూరు మండలం జినుకుంటలో మాణిక్యమ్మ, వేంకటాచలం దంపతులకు 1928 మార్చి 31న ఆయన జన్మించారు. మధ్యతరగతి స్వర్ణకార కుటుంబానికి చెందిన కపిలవాయి చిన్నప్పటి నుంచే సాహిత్యంపై అభినివేశం పెంచుకున్నారు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి అమ్రాబాద్‌లో తన మేనమామ, గొప్ప పండితుడైన చేవూరు పెద్ద లక్ష్మయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ తమ కులవృత్తితో పాటు సంస్కృత, తెలుగు సాహిత్య గ్రంథాలను కపిలవాయి ఔపోసన పట్టారు. విద్యాభ్యాసం తర్వాత 1954 జూలై 11న నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఆయన చేరారు.
కావ్యం, శతకం, గేయం, హరికథ, కథ, నవల, చరిత్ర రచన, జీవితచరిత్ర, ఆత్మకథ, యాత్రాచరిత్ర, సంకీర్తనలు వంటి ఎన్నో ప్రక్రియల్ని పరిపుష్టం చేసిన విద్వన్మణి కపిలవాయి. అంతేకాకుండా పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశాస్త్ర గ్రంథాలు చాలా లోతుగా అధ్యయనం చేసిన ఆయన అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విశేషమైన రచనలు చేసి తన కలం ముద్రను పదిలపరుచుకున్నారు.
పండరినాథ శతకం, దుర్గాభర్గ శతకం, ప్రబోధ పటాహము, భాగవత కథాతత్వము, సుబ్రహ్మణ్యోదాహరణము, గీతాచతుష్పథం, పాలమూరు జిల్లా దేవాలయాలు, కుటుంబ గీత, జీవుడు-దేవుడు, స్వర్ణశకలాలు, ఉత్తరగీత, ఉద్భవగీత, హనుమచ్చహస్రము, సాలగ్రామ శాస్త్రం, కావ్యగణపతి అష్టోత్తరం, ఆవంచ (చారిత్రక నవల), కపిలవాయి వచన ఖండికలు, మూడు తరాల ముచ్చట వంటి 150కి పైగా రచనలు చేశారు. ఇటు పద్యం, అటు గేయంలో ఆయన శైలి మధురాతిమధురంగా, నవ్యాతినవ్యంగా ఉంటుంది. మచ్చుకు…
‘తల్లియు దండ్రియు గురువును
యెల్లరకును సమమె వీరికెల్లరకంటెన్
తెల్లముగ హెచ్చు దైవము
ముల్లోకములందునైన పోల్చగనార్యా!’
తల్లి, తండ్రి, గురువు-ఈ మూడు కూడా మూడు మాత్రలే కాబట్టి ఈ ముగ్గురూ అందరికీ సమానమైన దేవతలే. అయితే..దైవం నాలుగు మాత్రలు కాబట్టి ఈ ముగ్గురు కంటే కొంచెం ఎక్కువే అవుతారన్న పరమసత్యాన్ని ఆయన గొప్పగా చెప్పారు. అలతి అలతి పదాల్లో గొప్ప సత్యాన్ని, తత్త్వాన్ని చెప్పగలిగిన కవి కపిలవాయి లింగమూర్తి అనడానికి ఈ పద్యమే ఉదాహరణ.
‘అక్షరజ్యోతిని వెలిగించు
నిరక్షరాస్యతను తొలగించు
భిక్షపు బ్రతుకు ఎంతవరకు సు
శిక్షితుండవై జీవించు
అజ్ఞానంలో జిజ్ఞాసువుగా
అన్నా ఎన్నాళ్లుంటావు
చిన్నచిన్నగా ఓనమాల్ దిద్దిన
తిన్నగ నిన్నవి దిద్దునురా’
అక్షరం అనేది మన ఎదలను, మన బతుకులను వెలిగించే దీపమని, దాన్ని వెలిగిస్తే ఈ ప్రపంచాన్నే వెలిగిస్తుందనే సందేశాన్ని కపిలవాయి లింగమూర్తి తెలియజెప్పారు. భిక్షపు బతుకు ఎంతకాలం బతకడం? నిత్య విద్యార్థిగా కలకాలం జీవించమంటున్నారు. అజ్ఞానంలో పడి ఎన్నాళ్లు ఉంటావు? ఓనమాలు దిద్దితే అవి నీ బతుకును దిద్దుతాయని గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
‘విత్తొకటే చెట్టగుచు
విస్తరించి వేలాదిగ
విత్తనాలు సృష్టించుట
విశ్వరూపమే గద అది’
విత్తనం చెట్టయి, విస్తరించి విశ్వరూపంగా సహస్ర ముఖాలుగా దర్శనమిచ్చిన తాత్త్విక సందేశాన్ని పై పంక్తుల్లో ఆయన తెలిపారు. శబ్ద సౌకుమార్యం, భావాభివ్యక్తి, గొప్ప తాత్త్వికత, రసాత్మకత, నిండైన కవితా చైతన్యం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. కపిలవాయి కవితా ప్రతిభను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం 2014లో గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నుంచి విశిష్ట పురస్కారాన్ని అందుకున్న తొలి కవి కపిలవాయి లింగమూర్తి. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలెన్నో ఆయన అందుకున్నారు. ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఆయన రచనల్ని పాఠ్యపుస్తకాల్లో నేటికీ విద్యార్థులు చదువుకుంటున్నారు. పరిశోధక పంచానన, వేదాంత విశారద, గురుశిరోమణి వంటి బిరుదులు పొందిన కపిలవాయి లింగమూర్తి 2018 నవంబర్ 6న పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి ,9440369939
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

