సంకీర్ణ సర్కార్‌తోనే నిజమైన ప్రజాస్వామ్యం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటమే నిజమైన ప్రజాస్వామ్యమని, అప్పుడే దేశంలో సమతుల్యత ఉంటుందని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే ఆయా రాష్ర్టాలకు, ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం భారీగా పెరుగుతుందని, కేంద్రంలో ఇకపై సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలకు, తెలంగాణకు ఏమైనా నష్టం ఉంటుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలకు, తెలంగాణకు కూడా ఎలాంటి నష్టం ఉండదు. సీట్ల సంఖ్య తగ్గుతుందనే వాదన అర్థరహితం. 2026-27 జనాభా లెక్కల ప్రకారం చేపడితే మాత్రం తీవ్ర నష్టం తప్పదు. పాత జనాభా లెక్కల ప్రకారం, మొత్తం సీట్లలో ప్రస్తుతం ఉన్న రేషియో మారకుండా ఉంటే ఎలాంటి నష్టం ఉండదు. ఇప్పుడు రేషియో మారడంలేదు కాబట్టి సీట్ల పెరుగుదలలో నష్టం ఉండదు. ఇది ఎప్పుడైనా చేయాల్సిందే.
ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్లు పెరుగుతున్నాయనే వాదన ఎంతవరకు నిజం..?
సీట్లు పెరుగుతున్నమాట నిజమే కానీ పాత రేషియో మారనంత వరకు దక్షిణాది రాష్ర్టాలకు ఇబ్బందిలేదు. ఉత్తరాది రాష్ర్టాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉండడం వల్ల సహజంగానే సీట్లు ఎక్కువగా పెరుగుతాయి. దాన్ని మనం వ్యతిరేకించలేం. ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఎక్కువ సీట్లు పెరుగుతాయి.
అలాంటప్పుడు తక్కువ సీట్లు పెరిగే మిగిలిన జిల్లాలు దీన్ని వ్యతిరేకించాలంటే ఎలా? కాబట్టి రేషియో మారకుండా పునర్విభజన చేయడం వల్ల ఉత్తరాదిలో సీట్లు పెరిగినా దక్షిణాది రాష్ర్టాలకు ఇబ్బందిలేదు. ఈ వాదన చేస్తున్న కాంగ్రెస్ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఇలాగే చేస్తుంది. ఇంతకన్నా దారుణంగా ఉంటుందే తప్ప మేలుగా ఉండదు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు చేసిన గందరగోళమే ఉదాహరణ.
డీలిమిటేషన్ వల్ల కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం ఎక్కువ అంటున్నారు.. నిజమేనా..?
డీలిమిటేషన్ కారణంగా ఎంపీ సీట్లు 543 నుంచి 850 వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రాష్ర్టాల్లో భారీగా ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీలు ఏకపక్షంగా మెజార్టీకి అవసరమయ్యే సీట్లు గెలుచుకోవడం కొంత కష్టమే. కాబట్టి ఆయా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు తమ బలం చూపించి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోగలిగితే కేంద్రంలో వాటి ప్రాబల్యం పెరుగుతుంది.
వాటి మద్దతుతోనే ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంపీ సీట్లు పెరగడం ప్రాంతీయ పార్టీలకు కలిసొచ్చే అంశం. అయితే దీన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాయనేది ఆయా పార్టీల వ్యవహారశైలి, విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఏ కూటమిలో లేనటువంటి బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే పార్టీలకు కేంద్రంలో డిమాండ్ పెరుగుతుంది. జాతీయ పార్టీలు ఈ మూడు పార్టీలపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి వస్తుంది.
డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడానికి కారణం ఏమిటి?
డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడానికి ఏకైక కారణం స్వలాభం, భయం. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదు. ఎలాగైనా ఇప్పుడు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. తర్వాత వాళ్లు(కాంగ్రెస్) అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలనే ఆలోచనలో ఉన్నది. అలా అయితే వాళ్లకు అనుకూలంగా ప్రక్రియను చేపట్టవచ్చనే ఆలోచన.
బీజేపీకి లాభమనే వాదనలో నిజమెంత?
బీజేపీకి కొంత మేర లాభం జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అది కూడా కష్టంగానే ఉన్నది. సీట్ల పెంపుతో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ లాభం జరుగుతుంది.
- ప్రాంతీయ పార్టీలు బలపడితేనే ప్రజలకు మేలు చేకూరుతుంది
- డీలిమిటేషన్‌తో సంకీర్ణ ప్రభుత్వాలకే ఎక్కువ అవకాశం
- కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది కాబట్టి వద్దంటున్నది
- పాత జనాభా లెక్కలు, పాత రేషియో సీట్లు వస్తే నష్టంలేదు
- తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షుడు శ్రీనివాస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

