డీలిమిటేషన్‌తో మేలున్నందునే మద్దతు
- చట్టసభల స్థానాల పెంపుతో లాభం
- 24 శాతం కోటా కొనసాగిస్తున్న కారణంగానే స్వాగతిస్తున్నం
- జనాభా ప్రాతిపదికన అని చెప్పినందుకే నాడు కాదన్నం
- 4 ఏండ్లుగా బీఆర్ఎస్ది ఒకటే స్టాండ్
- కాంగ్రెస్ నేతలది గుడ్డి వ్యతిరేకత
- బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే దిగొచ్చిన కేంద్ర సర్కార్
- ఇది ముమ్మాటికీ తెలంగాణతోపాటు, దక్షిణాది అన్ని రాష్ట్రాల విజయం
- మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): లోక్‌సభలో తెలంగాణ, దక్షిణాది రాష్ర్టాల 24 శాతం ప్రాతినిధ్యం కొనసాగిస్తుండటం.. రాష్ర్టానికి మేలు జరుగుతున్నందునే కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గతంలో జనాభా ఆధారం గా లోక్‌సభ స్థానాలను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పినందునే నిర్దంద్వంగా వ్యతిరేకించామని చెప్పారు. నిరుడు చన్నైలో నిర్వహించిన సమావేశంలోనూ తమ వైఖరిని విస్పష్టంగా చెప్పామని తెలిపారు. జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ర్టాలకు శిక్షవేస్తే ఊరుకోబోమని హెచ్చరించామని గుర్తుచేశారు.
నాలుగేండ్లుగా బీఆర్ఎస్ ఒకే విధానంతో ముందుకెళ్తున్నదని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చి డీలిమిటేషన్లో మన రాష్ట్రంతో పాటు దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని సరిదిద్దిందని, స్వతంత్ర భారత చరిత్రలో జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టసభల స్థానాలను పునర్వ్యవస్థీకరించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ, దక్షిణాది రాష్ర్టాల ప్రజల విజయమని అభివర్ణించారు.
రాష్ర్టానికి లాభం జరిగే డీలిమిటేషన్‌కు మద్దతిస్తున్న బీఆర్ఎస్పై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. అవగాహనలేకుండా అభాండాలు వేయడం సరికాదని హితవుపలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్‌తో తెలంగాణకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.
మొదట గొంతు విప్పింది గులాబీ పార్టేయే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుందని కేటీఆర్ వివరించారు. ఇందులో భాగంగా 1951లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకరవర్గాలను పునర్వ్యవస్థీకరించి లోక్‌సభ స్థానాలను 498కి పెంచిందని గుర్తుచేశారు. ఆ తర్వాత 1961లో 522 స్థానాలకు, 1971లో పెరిగిన జనాభాను పరిగణనలోకి తీసుకొని 543 స్థానాలకు పెంచిందని పేర్కొన్నారు. జనాభా విస్ఫోటనం జరుగుతున్నందున 1976లో మరో 25 ఏండ్లపాటు డీలిమిటేషన్ ఉండదని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు చెక్ పెట్టిందని తెలిపారు. 2001లో వాజ్‌పేయ్ సర్కార్ సైతం మరో 20 ఏండ్లు యథాతథాస్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు.
కొవిడ్ కారణంగా 2021లో జనగణన చేపట్టలేదని, ప్రస్తుతం పెరిగిన జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే జనాభాను నియంత్రించిన తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లాంటి రాష్ర్టాలకు తీవ్రనష్టం జరిగే పరిస్థితి ఉన్నందున బీఆర్ఎస్ వ్యతిరేకించిందని పునరుద్ఘాటించారు. 2022లోనే బీఆర్ఎస్ మొదటిసారి గొంతువిప్పిందని స్పష్టంచేశారు. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఊరుకోబోమని గట్టిగా వాదించింది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ‘జనాభాను త గ్గించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? జనాభాను పెంచిన ఉత్తరాది రాష్ర్టాలకు న్యా యం చేసి దక్షిణాదికి అన్యాయం చేస్తారా?’ అని గట్టిగా ప్రశ్నిస్తూవచ్చామని తెలిపారు.
నిరుడు చన్నైలో స్టాలిన్ నిర్వహించిన మీటింగ్‌లోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పామని, దక్షిణాది రాష్ర్టాల గొంతుకొస్తే ఊరుకోబోమని, కేసీఆర్ నాయకత్వంలో యుద్ధం చేస్తామని ప్రకటించిన పార్టీ బీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీఆర్ఎస్తోపాటు దక్షిణాది పార్టీల ఐక్య పోరాటానికి కేంద్రం దిగివచ్చి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత తొలిసారి జనాభాలెక్కల ఆధారంగా కాకుం డా గతంలోని 24 శాతం దామాషా ప్రాతిపదికన డీలిమిటేషన్ బిల్లు తెస్తున్నామని ప్రకటించిందని గుర్తుచేశారు.
ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ బిల్లును సమర్థిస్తుందని తేల్చిచెప్పారు. కేంద్రం బుద్ధి తెచ్చుకొని దక్షిణాది రాష్ట్రాల, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే డీలిమిటేషన్ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ర్టాల ఆందోళనలను గుర్తించి, వాటి ప్రాతినిధ్యం తగ్గకుండా చర్య లు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం అర్థం చేసుకోవడం శుభ పరిణామమన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడబోం
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను పెంచాలని 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం చేసిందని కేటీఆర్ చెప్పా రు. పదేండ్లుగా బీజేపీ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. డీలిమిటేషన్‌తో తెలంగాణకు అసెంబ్లీ స్థానాలు 180, లోక్‌సభ స్థానా లు 26కు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.
తెలంగాణకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అవసరమన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగడంతో ప్రజలకు మరింత దగ్గరగా ప్రజాప్రతినిధులు పనిచేసే అవకాశం ఉంటుందని పేరొన్నారు. లోక్‌సభ స్థానాలు పెరిగితే తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. డీలిమిటేషన్ రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే కీలకమైన ప్రక్రియని పేరొన్నారు.
బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చి డీలిమిటేషన్లో మన రాష్ట్రంతో పాటు దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని సరిదిద్దింది. స్వతంత్ర భారత చరిత్రలో జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టసభల స్థానాలను పునర్వ్యవస్థీకరించడం ఇదే మొదటిసారి. ఇది ముమ్మాటికీ తెలంగాణ, దక్షిణాది రాష్ర్టాల ప్రజల విజయం.
-కేటీఆర్
కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
‘తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ర్టాలకు మేలు జరిగే డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?’ అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ‘జనాభాను పరిగణనలోకి తీసుకొని లోక్‌సభలో 24 శాతం ఉన్న దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యాన్ని 19కి తగ్గించాలని కోరుతున్నదా? తెలంగాణ, దక్షిణాదికి లాభం జరుగుతున్నందునే వ్యతిరేకిస్తున్నాదా?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఏవైనా అనుమానాలుంటే డీలిమిటేషన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని, నష్టం జరిగే పరిస్థితి వస్తే కోర్టులకు వెళ్లవచ్చని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలిగానీ గుడ్డిగా వ్యతిరేకించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల భాగస్వామ్యంతో డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరుగాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 180కి, లోక్‌సభ సీట్లు 26కు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

