చుంచుపల్లి, సెప్టెంబర్ 29 : హైకోర్టు స్టే, స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగించడంపై జిల్లా పంచాయతీ అధికారి అనూష ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విద్యానగర్ కాలనీలో అక్రమ భవన నిర్మాణాలను ఆమె పరిశీలించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం–ఖమ్మం ప్రధాన రహదారి పక్కన చిమ్మని రామకృష్ణ చేపడుతున్న భవన నిర్మాణంపై కొండల్, భూక్య హరి గ్రీవెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ, స్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో నిర్మాణ పనులు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన డీపీఓ అనూష మంగళవారం సంబంధిత నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు అక్కడ ఉన్న నిర్మాణ సామగ్రిని సైతం తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. నిర్మాణదారులకు సంబంధిత నోటీసులు అందజేయాలని ఆదేశించారు.
ప్రధాన రహదారి ఇరువైపులా అనుమతులు లేకుండా చేపడుతున్న ఇతర నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను కూడా డీపీఓ పరిశీలించారు. పంచాయతీ పరిధిలో భవన నిర్మాణాలకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగడంపై పంచాయతీ అధికారులను డీపీఓ వివరణ కోరారు. కోర్టు ఉత్తర్వులు, పంచాయతీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. డీపీఓ అనూష వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

కోర్టు స్టే ఉన్న భవన నిర్మాణ పనులు.. నిలిపివేయించిన డీపీఓ అనూష