KCR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపిస్తారని చెప్పారు. శుక్రవారం ప్రముఖ జాతీయ చానల్ ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులు, బీఆర్ఎస్ ప్రచారం, తన ఆరోగ్యం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ శక్తికి మించిన హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదు. ఈ విషయం వాళ్లకు కూడా తెలుసు. ఐదు నెలల పాలన తర్వాత ప్రజలు వాస్తవాలను గ్రహించారు. కాంగ్రెస్ తమను మోసం చేసిందని వారికి అర్థమైంది. అందుకే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించబోతున్నది.
గోబెల్స్ ప్రచారం చేయడంలో బీజేపీ ప్రపంచ చాంపియన్. వాస్తవాలను పరిశీలిస్తే 2014లో 119 నియోజకవర్గాలకు గానూ 117 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టం అవుతున్నది.
2014లో మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆ సమయంలో మాకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఎంతో అవసరం. రాజ్యాంగపరంగా చూసినా కూడా కేంద్ర, రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఈ మేరకు కేంద్రంతో సానుకూలంగా ఉన్నాం. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎలాగూ వాళ్లు గెలుస్తారు, పైగా వాళ్లు మా మద్దతు కోరారు కాబట్టి మద్దతిచ్చాం. బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు. పూర్తిగా వ్యతిరేకించాం, నల్లచట్టాలపై జాతీయ స్థాయిలో పోరాటాలు చేశాం.
వాస్తవానికి ఇప్పుడు ఇండియా కూటమి అనేదే లేదు. అదొక భ్రమ మాత్రమే. మమతా బెనర్జీతోపాటు చాలా మంది కూటమి నుంచి బయటికి వచ్చేశారు. నేను, అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్రెడ్డి వంటివాళ్లు ఏ కూటమిలోనూ లేము. కాంగ్రెస్ అనుకూల పార్టీలు మాత్రమే ఇండియా కూటమితో ఉంటే, చాలా తక్కువ పార్టీలు మాత్రమే ఎన్డీయేలో ఉన్నాయి. ఈ రెండు కూటముల మధ్యే పోటీ అనే భావన సరికాదు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే బలమైన శక్తిగా మారి, రాజ్యమేలబోతున్నాయి.
జవాబు: ఎన్నికలు పూర్తికాగానే అనుకోకుండా తుంటి ఎముక విరిగింది. దాదాపు రెండు నెలలు బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నడువగలుగుతున్నా. బస్సుయాత్ర నిర్వహించడం, ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు.
ఈ కుంభకోణం మొత్తం ప్రధాని మోదీ సృష్టించిన ఒక రాజకీయ కుట్ర. లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశించి, లేని కుంభకోణాన్ని జరిగినట్టుగా చిత్రీకరించింది. వాస్తవానికి ఇది బీజేపీ సృష్టించిన రాజకీయ కుంభకోణం మాత్రమే. అది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం. ప్రభుత్వం తెచ్చిన పాలసీని కుంభకోణం అని ఎవరైనా అంటారా? మోదీ సృష్టించిన కట్టుకథలు కాకపోతే.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? రెండున్నరేండ్లుగా వాళ్లు అరుస్తూనే ఉన్నారు తప్ప ఆధారాలేవి? కవిత, అరవింద్ కేజ్రీవాల్ వంటి అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు.