న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి కేసులో మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా తప్పుపట్టారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండడం కాదు అని, అది పరిత్యాగం చేసినట్లుగా ఉందని సోనియా ఆరోపించారు. భారతీయ విదేశాంగ విధానంపై విశ్వసం కోల్పోయినట్లుగా ఉందని ఆమె అన్నారు. విదేశీ విధానం అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే రెండో దఫా బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ప్రారంభమైనప్పుడు.. భారత్ తీసుకున్న తన నిర్ణయం పట్ల చర్చ చేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు.
ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో సోనియా తన వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసంలో ఆమె ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖమనీ మృతిచెందినట్లు మార్చి ఒకటో తేదీన ఇరాన్ ద్రువీకరించిందని, వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారని, ఒకవైపు చర్చలు నిర్వహిస్తూనే మరో వైపు దేశ అధినేతను చంపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇలాంటి షాకింగ్ ఘటన జరిగినప్పుడు భారత్ వ్యవహరించిన తీరు మరింత షాకింగ్‌గా ఉందని ఆమె అన్నారు. ఖమేనీ హత్య గురించి కానీ, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశం గురించి కానీ భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా ఖండించారు.