Funky | మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతి రత్నాలు’ ఫేం దర్శకుడు అనుదీప్ కె.వి. కాంబినేషన్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ . ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రధానంగా వినోదం నేపథ్యంలో రూపొందింది. సినిమా విడుదలకు ముందు నుంచే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కథ, లాజిక్ వంటి అంశాలను పట్టించుకోకుండా కేవలం నవ్వుకోడానికి మాత్రమే థియేటర్లకు రావాలని ప్రమోషన్స్‌లో పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలో విశ్వక్ సేన్ మార్క్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, హీరోయిన్ కయాదు లోహర్ గ్లామర్, అనుదీప్ స్టైల్ డైలాగులు హైలెట్‌గా నిలిచాయి. పెద్దగా కథ ఆకట్టుకోకపోయిన, ఎంటర్టైన్మెంట్ విషయంలో సినిమా ఓ మోస్తరు స్పందన సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.14.5 కోట్ల గ్రాస్ వసూళ్లు, దాదాపు రూ.8 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ.20 కోట్ల షేర్ అవసరమై ఉండగా, ఆ స్థాయికి చేరకపోవడంతో నష్టాలు నమోదయ్యాయి. థియేటర్లలో పరుగు ముగించిన ‘ఫంకీ’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మార్చి 12 లేదా 13 తేదీల్లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇదిలా ఉండగా, ‘ఫంకీ’ తర్వాత విశ్వక్ సేన్ కల్ట్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా విశ్వక్ సేనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో మోస్తరు విజయాన్ని అందుకున్న ‘ఫంకీ’ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి.