శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే
- తెలంగాణ ఎంపీలకుసోయిలేక అడుగలే
- అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో
- 1810లోనే ఏర్పడిన నిజామియా టిబ్బీ కాలేజీ
- ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దవాఖాన దారుల్షిఫా
- సిద్ధ వైద్య విజ్ఞాన సంస్థనుతన్నుకుపోయిన తమిళనాడు
(నాగవర్ధన్ రాయల)అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్నట్టు గూగులమ్మ కూడా ఇదేమిటని అడుగకపోతే అ బద్ధమే చెప్తుంది! ‘which is the oldest medical school in india’ అని సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి చూడండి. ‘కలకత్తా మెడికల్ కాలేజ్’ అని చూపిస్తుంది. ఆ కలకత్తా మెడికల్ కాలేజ్‌ను ఎప్పుడు స్థాపించారనుకున్నారు? 28 జనవరి 1835లో. ‘ఇదేమిటి మా చార్మినా ర్ ఎదురుగా ఉన్న యునాని హాస్పిటల్, దానికి అనుబంధంగా టిబ్బి కళాశాలను అంతకుముందే కట్టారుగా?’ అనడిగితే అప్పుడు చె ప్తుంది గూగుల్ అసలు నిజం. గవర్నమెంట్ ని జామియా టిబ్బి కళాశాలను 1810లోనే ఏర్పాటుచేసింది. అంటే కలకత్తా మెడికల్ కాలేజ్ కంటే రెండు దశాబ్దాల ముందే ఆఫ్ఘనిస్థాన్ పండితుడు సాజిదా బేగం మాజిద్ స్థాపించిండు! నిజామియా టిబ్బి కళాశాలకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. నిజాం పాలన ముగిసిన తర్వాత ఏర్పడ్డ హైదరాబాద్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలూ దీనిని నిర్వహించినయి. ఈ దవాఖాన రోగులకు సేవ చేస్తనే ఉన్నది. ఇంత గొప్ప కళాశాల చరిత్రను మరచిపోవుట్లో గూగుల్ తప్పేమీ లేదు. దీని పేరెందుకు మరుగున పడిందో అడుగుతూ పోతే గూగుల్ చానా దస్తావేజులు వెతికి పెట్టిస్తుంది. అవన్నీ చూస్తే తిండికి తిమ్మరాజు పనికి పోతరాజులా పోజులు కొడుతున్న మన ఎంపీల తప్పే ఉందనిపిస్తది.
తమిళులెట్ల తన్నుకు పోతుండ్రు?
కాంగ్రెస్ పార్టీ చీలిక అనంతరం తమిళనాడులో ప్రాబల్యం ఉన్న ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే)తో ఆల్ ఇండియా కాంగ్రెస్ (ఇందిర) పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ (ఐ), డీఎంకేల మధ్య 1971లో పొడిచిన పొత్తు ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఆ తర్వాత నాలుగోసారి ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ మద్దతు ఇందిరకు అవసరం లేకున్నా డీఎంకేకు ఆ రోజుల్లో ప్రత్యేక ప్రాధా న్యం ఉండేది. అదే అదనుగా ఢిల్లీతో కావాల్సినది సాధించుకోనీకి తమిళ ఎంపీలు లాబీ మొదలుపెట్టినరు. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో ఏడో పంచ వర్ష ప్రణాళిక (1985-1990) జరిగింది. సంప్రదాయ భారతీయ వైద్యవిధానాలను ప్రోత్సహించాలని, ప్రాచుర్యం కల్పించాలని ప్రణాళికా సంఘం నిర్ణయించింది. ఆయా సంప్రదాయ వైద్య విధానాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనా సంస్థలను స్థాపించదలిచింది. ఆ సమయంలో తమిళులు తెలివిగ సిద్ధ వైద్య విజ్ఞాన పరిశోధన సంస్థను తమ రాష్ర్టానికి తరలించుకుపోయినరు. ఇందిరను ఎంపీని చేసిన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఇలాంటి కేంద్ర సంస్థను తీసుకరాలేకపోయినరు.
హైదరాబాద్‌కు యునానీ వైద్య సేవలో శతాబ్దాల చరిత్ర, పేరున్న సంస్థలు ఉన్నా వాటిని ప్రోత్సహించాలని ఆనాటి రాజీవ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కోరలే. ఒత్తిడి చేయలే. జాతీయస్థాయి సిద్ధ వైద్య పరిశోధన సంస్థను డీఎంకే నేతలు తమిళనాడుకు తన్నుకుపోయినరు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా థర్డ్ ఫ్రంట్, ఎన్డీఏ ప్రభుత్వాల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు చక్రం తిప్పుతూనే ఉన్నయి. యూపీఏ-1 ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ డీఏంకే పార్టీకి దక్కడం, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాస్ కేంద్ర ఆరోగ్య మంత్రి కావడంతో ఇక సిద్ధ వైద్య పరిశోధనా సంస్థ పనులు వేగం పుంజుకున్నయి. తొలి ఏడాది నాటికి పనులన్నీ పూర్తి చేసి మన్మోహన్‌సింగ్‌తో ప్రారంభించిండు. వడ్డించేవాడే వాళ్లోడైనంక తమిళులకు తక్కువేమిటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ తమిళనాడులోని తాంబరం పట్టణంలో ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ (వైఎస్) ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ (మన్మోహన్సింగ్) ప్రభుత్వం ఉండి కూడా అలాంటి పరిశోధనా కేంద్రాన్ని తీసుకురావడంలో మన ఎంపీలు విఫలమైనరు. డీఎంకే ఎంపీలు తమిళనాడుకు గొప్ప అవకాశాన్ని అందుకుని జాతీయ పరిశోధనా కేంద్రాన్ని తెచ్చినమని ఘనంగా చెప్పుకుంటున్నరు. వీళ్ల అసమర్థతకు ఘనమైన చరిత్రకు సాక్ష్యంగా ఉన్న శిథిల భవానాలే మనకు మిగిలినయి.
అయిదు వందల ఏళ్ల నాటి మెడికల్ సిటీ!
హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాల్లో దారుషిఫా ఒకటి. దారుష్-షిఫా నుంచి జన వ్యవహారంలో అట్ల మారింది. ‘దారుల్-షిఫా’ అంటే ‘స్వస్థపరిచే ఇల్లు’ అని అర్థం. రోగాల బారినపడ్డ ప్రజలను స్వస్థ పరిచేందుకు గోల్కొండను పాలించిన అయిదో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీకుతుబ్ షా దీన్ని నిర్మించిండు. రెండు అంతస్తుల భవనం, ప్రతి అంతస్తులో విశాలమైన పన్నెండు గదులు ఉండేటివి. ఇరాన్ నుంచి పేరున్న వైద్యులను రప్పించి దవాఖాన నడిపిండు. ఓ దిక్కు ఔట్ పేషెంట్ (ఓపీ) కోసం, ఇంకో దిక్కు ఇన్‌పేషెంట్ (ఐపీ) కోసం వార్డులు పెట్టి అప్పట్లో వైద్యం చేసేటోళ్లు. మందులన్నీ ఫ్రీ. నాలుగు వందల మంది రోగులకు ఇన్‌పేషెంట్ సర్వీస్ చేసేందుకు కావాల్సిన సిబ్బంది, సౌలత్లు ఉండేటియి. ఈ దవాఖాన దగ్గర కట్టిన జమా మజీద్ ఇప్పటికీ ఉన్నది.
వీటన్నిటినీ హైదరాబాద్ నిర్మాణం ప్రారంభమైన తొలి అయిదేండ్లలోనే కట్టినరు. యునానీ వైద్య విధానంలో ఇక్కడ సకల రోగాలకు ఆనాడు వైద్య సేవలు అందించినరు. అంతేకాదు ఇక్కడే వైద్య కళాశాలను నిర్వహించినరు. దేశ విదేశాల నుంచి వైద్య విద్యార్థులు ఇక్కడికి చేరుకుని యునానీ వైద్య విద్యను అభ్యసించినరు. నాలుగు శతాబ్దాల పూర్వం ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన నాలుగు దవాఖానల్లో దారుల్ షిఫా ఒకటి! రెసిడెన్షియల్ మెడికల్ కాలేజ్‌ని అయిదు వందల ఏండ్ల కిందనే నడిపిన ఘనత మన హైదరాబాద్‌కు ఉంది! కుతుబ్‌షాహీల పాలనలో దీనికి ఆటంకం లేకుండా ఆదరణ లభించింది. కుతుబ్‌షాహీ పాలకులు సమకూర్చిన నిధులతో ఈ దవాఖాన ప్రజలకు ఉచితంగా సేవలందించింది. కుతుబ్‌షాహీల పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన మొదటి నిజాం కూడా దీనిని ఆదరించాడు. రెండో నిజాం కాలంలో ఇది మూతపడింది. ఇప్పుడిది నిజాం చారిటబుల్ ట్రస్ట్ పరిధిలో ఉన్నది. ఉన్నా లేనట్టే అయిపోయిన ఈ దవాఖానను పునరుద్ధరించేందుకు పాలకులు పూనుకోలే. మన ఎంపీలే తెలంగాణకు పట్టిన శని.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

