న్యూయార్క్: ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికా ఆ దేశ ప్రతినిధులతో చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ వద్ద సుమారు 11 అణు బాంబులు తయారు చేసేంత శుద్దీకరించిన యురేనియం(Enriched Uranium) ఉన్నట్లు వెల్లడైంది. ఇరాన్ అధికారులే ఈ విషయాన్ని అంగీకరించినట్లు అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల తెలిపారు. ఇరాన్‌తో తొలిసారి మీటింగ్ జరిగిన సమయంలో.. ఆ దేశ ప్రతినిధులు ఎటువంటి సిగ్గులేకుఒండానే తమ వద్ద శుద్దీకరించిన యురేనియం ఉన్నట్లు చెప్పారని ఆయన వెల్లడించారు. 460 కిలోల యురేనియం ఉందని, దాంట్లో 60 శాతం శుద్దీకరించిన యురేనియం ఉన్నట్లు ఇరాన్ ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఆ యురేనియంతో సుమారు 11 న్యూక్లియర్ బాంబులను తయారు చేయవచ్చు అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విట్కాఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు క్షేత్రాలను ధ్వంసం చేసినట్లు అమెరికా చెప్పింది. శుద్దీకరించిన యురేనియంతో అణుబాంబును తయారు చేయడాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో గతంలో దాడులు చేపట్టినట్లు తెలిపారు. అణు ఇంధనాన్ని శుద్ధీకరించే ప్రయత్నాలను ఆపబోమని కూడా గతంలో ఇరాన్ ప్రతినిధులు చెప్పినట్లు విట్కాఫ్ పేర్కొన్నారు.
ఇరాన్ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేయంతో కేవలం పది రోజుల్లోనే అణు బాంబును తయారు చేయవచ్చు అని ఆయన తెలిపారు. అయితే అటువంటి పదార్ధాలను ఇరాన్ స్టాక్ పెట్టుకోవడం ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనతో పాటు జేర్డ్ కుష్నర్ కూడా యురేనియం అంశంలో ఇరాన్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశామని, కానీ ఆ దేశం పట్టించుకోలేదని విట్కాఫ్ అన్నారు. మూడో సారి చర్చల్లో కూడా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో.. దాడి అనివార్యమైనట్లు తెలుస్తోంది.