న్యూఢిల్లీ: పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్ఠంభన మంగళవారం తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై అన్ని పార్టీలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ ఓం బిర్లా ద్వారా తెలిసింది. అయితే అన్ని పార్టీలను ఆయన ఒప్పించినట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజీ నిరోధక సవరణ బిల్లును మంగళవారం చర్చించేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని, స్పీకర్ ఓం బిర్లా చేపట్టిన చర్యలు వల్ల ఫ్లోర్ లీడర్లు ఆ చర్చకు ఒప్పుకున్నారని పార్లమెంటరీ వర్గాల ద్వారా తెలిసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రకారం లీకేజీకి పాల్పడి నిందితులకు పదేళ్ల జైలుశిక్ష, 50 లక్షల ఫైన్ విధించనున్నారు. వాస్తవానికి ఇవాళ 5 గంటలకు ఆ బిల్లుపై చర్చ చేపట్టాలని భావించారు. కానీ విద్యార్థులపై లాఠీఛార్జ్ను ఖండిస్తూ విపక్షలు సభలో నినాదాలు చేశాయి. దీంతో గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేశారు. సుమారు 6 గంటల పాటు బిల్లుపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.