Congress | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఆశనిపాతంలా మారనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఆ పార్టీకి గుదిబండగా మారబోతున్నాయా? రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 12 తమకే వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి క్షేత్రస్థాయి పరిస్థితులు. గత డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలుచేసింది. మిగతా హామీలు అలాగే అమలవుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. గృహజ్యోతి పథకంలో భాగంగా గత నెల నుంచి అమలుచేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకంపై ప్రజల్లో కొంతమేర సానుకూల దృక్పథం ఏర్పడినప్పటికీ అది ఒక నెల ముచ్చటే అయింది. మొదటి నెల లబ్ధిదారులకు రెండో నెలలో ఉచిత బిల్లు రాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని నిలిపివేయొచ్చని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులందరూ చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని విమర్శిస్తున్నది. 420 హామీలు ఇవేనంటూ రైతుభరోసా, యువవికాసం, మహిళా వికాసం, ఇందిరమ్మ ఇండ్లు తదితర గ్యారెంటీలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు సంపూర్ణంగా అమలవుతున్నాయనే చెప్పాలి. అదే సమయంలో రూ. 500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇందులో ఎంతమంది లబ్ధిదారులు? ఏయే నియోజకవర్గాల్లో ఎంతమంది? అన్న వివరాలను వెల్లడించకపోవడం రాష్ట్ర సర్కారుపై విశ్వాసాన్ని మరింత సన్నగిల్లేలా చేస్తున్నదంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి క్యాడరే వాపోతున్నది.
హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్న విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. నిన్నమొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండం అన్న రేవంత్ ఇప్పుడా మాటే మాట్లాడడం లేదు. ఆగస్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రమాణాలను రైతులు నమ్మడం లేదు. అసలు అది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్వింటాలుకు రూ. 500 బోనస్‌ను కూడా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామని, సెప్టెంబర్ 17 నాటికి నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని ఎన్నికల్లో రేవంత్ చేస్తున్న ప్రమాణాలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించినప్పుడు పెట్టని షరతులను పథకాల అమలు సమయంలో విధించడం వల్ల ప్రజల్లో వ్యతిరేక పెల్లుబుకుతున్నది. ‘మా ఓట్లు అవసరమైనప్పుడు ఏమీలేకున్నా అన్నీ ఇస్తామని చెప్పిన్రు. ఇప్పుడేమో తెల్లకారటు ఉన్నదా?’ అడుగుతాన్రు. ఇదే ముచ్చట ముందు చెప్తే ఎట్లుండునో’ అని జోగులాంబగద్వాల జిల్లాకు చెందిన నాగమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గతనెల నుంచి అమలు చేస్తున్న గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి) తెల్లరేషన్‌కార్డు ఉన్నా తమకు అమలు కావడంలేదని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన యాదమ్మ అనే గృహిణి వాపోయారు. మాది నాగర్‌కర్నూల్ జిల్లా. మాకు కారటు (తెల్లరేషన్‌కార్డు) ఉన్నది. మేం ఉండేది హైదరాబాదుల. అందరు పెట్టినట్టే సర్కారుకు మేం దరఖాస్తుపెట్టుకున్నం. మాకైతే కరెంట్ మాఫీ కాలేదు. బిల్లు ఈడొచ్చింది (హైదరాబాద్). ఆడొచ్చింది’ అని వాపోయారు. ఇచ్చుడు శాతగానప్పుడు ఎందుకు చెప్పాలె అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మి పథకానికి రూ. లక్షతోపాటు తులం బంగారు ఇస్తామన్నరు. తులం మాట దేవుడెరుగు ఉన్న లక్ష కూడా ఇత్తలేరు అని పెద్దపల్లి జిల్లాకు చెందిన సరోజన ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారో, లేదోననే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. రేవంత్‌రెడ్డి మొదలు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. రైతుభరోసా కింద రైతుబంధు పథకాన్ని రూ. 10వేల నుంచి రూ. 15వేలకు పెంచుతామని, ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీని చేస్తామని, క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలు ఇచ్చింది. వాటి అమలు విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘రైతుబంధు లేకమునుపు షావుకారో (వడ్డీ వ్యాపారస్థులు), శేటో (అడ్తిదారు లేదా కమీషన్ ఏజెంట్) అప్పులిచ్చేది. వాళ్లదగ్గరే తెచ్చుకునేది. కానీ, ఇప్పుడు రైతుబంధు పడక మళ్లా వాళ్ల దగ్గరికే అప్పులకు పోతున్నం’ అని ఆదిలాబాద్‌కు చెందిన ఆత్రం బాబురావు అనే రైతు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రైతు పోతరాజు సమ్మయ్య ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘పెడ్తా అంటే ఆశ ఉంట ది. కొడ్తా అంటే భయం ఉంటది. ఆశపెట్టుడెందుకు. అక్కెర తీరంగనే అవుతల పడేసుడెందుకు. మేమేమన్నా బతిలాడినమా?’ అని సూర్యాపేట జిల్లాకు చెందిన ఏకాంబ్రం అనే రైతు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
నిరుడు డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంపై ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రహసనంగా మారిందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర సమగ్రమైన వివరాలున్నా (తెల్లరేషన్‌కార్డు మొదలైన ఆధారాలను) ఆరు గ్యారెంటీల అమలు కోసం అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి 1.28 కోట్ల దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. వీరిలో ఎవరెవరు ఏపథకానికి అర్హులు? వారికి ఎప్పటిలోగా ఏ పథకం అమలు అవుతుంది? అన్న స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వకపోవడం అతిపెద్దలోటుగా ప్రజలు భావిస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతే ఎదురవుతున్నది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచినా, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు అవుతున్నా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ఎంత చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ప్రతికూల వాతావరణమే ఎదురవుతున్నదని, దీన్ని ఆ పార్టీ ఎలా అధిగమిస్తుంది అనేది ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.