ముంబై, మార్చి 13 : పశ్చిమాసియా సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో భారతీయ ఈక్విటీలు కూడా కుదేలవుతున్నాయి. గత 14 రోజులుగా ఈ వార్ జరుగుతుండగా.. అప్పట్నుంచి ఇప్పటిదాకా జరిగిన 9 ట్రేడింగ్ సెషన్లలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 6,723.27 పాయింట్లు లేదా 8.27 శాతం క్షీణించింది. దీంతో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద కరిగిపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.33,68,419 కోట్లు హరించుకుపోయి రూ.4,29,82,252. 27 కోట్లకు పరిమితమైంది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఆ రెండు దేశాలు సైనిక దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సైతం చంపేశాయి. దీంతో సమరం తీవ్రరూపం దాల్చింది. దాదాపు అన్ని దేశాల్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయింది. అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్నది మరి. ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఇరాక్ తదితర దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తున్నది. అంతేగాక ఆయా దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలనూ టార్గెట్ చేస్తున్నది. మరోవైపు తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఫలితంగా ఆ మార్గం గుండా ఆయిల్ సహా యావత్తు సరుకు రవాణా నిలిచిపోయినైట్టెంది. ఈ పరిణామం మదుపరుల సెంటిమెంట్‌ను గట్టిగా దెబ్బతీసింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, దేశీయంగా ద్రవ్యోల్బణ సంకేతాలు.. ఇన్వెస్టర్లను పెట్టుబడుల ఉపసంహరణలకు ఉసిగొల్పుతున్నాయి. ఈ అమ్మకాల ఒత్తిడి షేర్ మార్కెట్‌ను బేర్ గుప్పిట్లోకి నెట్టింది.
మెటల్ సూచీ 4.83 శాతం నష్టాలను చూసింది. ఇండస్ట్రియల్స్, కమోడిటీస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లూ నిరాశపర్చాయి. ఎల్అండ్టీ షేర్ విలువ అత్యధికంగా 7.52 శాతం పడిపోయింది. టాటా స్టీల్, ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లూ నష్టాలకే పరిమితమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 2.87 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 2.48 శాతం చొప్పున పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఐరోపా, అమెరికా మార్కెట్లూ ఈ దిశగానే పయనిస్తున్నాయి.
శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం పడిపోయి 74,563.92 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,579.82 పాయింట్లు లేదా 2 శాతం క్షీణించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 488.05 పాయింట్లు లేదా 2.06 శాతం దిగజారింది. 23,151.10 పాయింట్ల వద్ద నిలిచింది. మిడిల్ ఈస్ట్ సంఘర్షణలు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలను ఎగదోస్తుండటం సెల్లింగ్ ప్రెషర్‌కు దారితీస్తున్నట్టు మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఉదయం ఆరంభం నుంచే భారీ నష్టాలకు లోనైన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. కాగా, స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజులపాటు నష్టాలకే పరిమితమైన నేపథ్యంలో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.10,24,181.74 కోట్లు తగ్గిపోయింది.
గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ రేటు మళ్లీ 100 డాలర్ల మార్కును చేరడం దెబ్బతీసిందని విశ్లేషకులు చెప్తున్నారు. దేశీయ ఇంధన అవసరాలు సుమారు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే భారత్‌కు ముడి చమురు, గ్యాస్ వస్తున్నది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన సంగతి విదితమే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లూ పెరిగితే.. రవాణా ఖర్చులు ఎగబాకి అన్నింటి ధరలూ పెరుగుతాయన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో కనిపిస్తున్నాయంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రాబోయే ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచితే మార్కెట్లు ఇంకా దిద్దుబాటుకు లోనవుతాయన్న అభిప్రాయాలు సైతం వినిపిస్తుండటం గమనార్హం.