నల్లగొండ: ప్రజాపాలనలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైతం అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు అందజేసే కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎండీ సలీం, ఔటరవీందర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ పోలీసులు బలవంతంగా నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Nalgonda Cpm
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అర్హులను తొలగించి తమ అనుచరులకు ఇళ్లు కేటాయిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే తమ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అరెస్టులను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నామని చెబుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.