గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సర్వం సిద్ధమైంది. గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. గణపతి బప్పా..మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గణేశ్‌లు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. కాలనీలు, వీధులు లంబోదరుడి నామస్మరణతో మార్మోగనున్నాయి. ప్రత్యేక టెక్నాలజీతో తక్కువ వ్యవధిలో జరిగేలా బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు దాదాపు 303.30 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుందని, నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభాయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, ఐడీఎల్, శామీర్‌పేట, సున్నం చెరువు వద్ద నిమజ్జన ప్రక్రియకు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు.
తొలుత ఖైరతాబాద్ భారీ గణనాథుడు శుక్రవారం ఉదయం 7 గంటలకే పూజలందుకుని శోభాయాత్రకు సిద్ధమై మధ్యాహ్నం 12.30 గంటల్లోగా హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను ముగించనున్నారు. బాలాపూర్ గణనాథుడు ఉదయం 5.30 గంటలకు పూజలందుకుని ఉదయం 9 గంటలకు లడ్డూ వేలం ప్రక్రియను నిర్వాహకులు పూర్తి చేయనున్నారు. ఉదయం 10 గంటలకు శోభాయాత్ర నుంచి బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మోహింజాహీ మార్కెట్, నాంపల్లి, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్‌కు రానుంది. రాత్రి 10 గంటల్లోపే బాలాపూర్ గణనాథుడు నిమజ్జనం అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
– సిటీబ్యూరో, సెప్టెంబరు 24 (నమస్తే తెలంగాణ)
ఖైరతాబాద్, సెప్టెంబర్ 24 : పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనోత్సవ ఘట్టం నేడు జరుగనున్నది. 72 సంవత్సరాల సందర్భంగా ఈ ఏడాది మహాగణపతిని 69 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వినాయకచవితి మొదలు మంగళవారం రాత్రి 11వరకు సుమారు 40 లక్షల మంది భక్తులు దర్శించుకొని ఉంటారని అధికారుల అంచనా.
ఖైరతాబాద్ మహాగణపతి బరువు 50 టన్నులకు పైగా ఉంటుంది. పైగా మట్టి విగ్రహం కావడంతో విగ్రహానికి రెట్టింపు బరువు మోసే వాహనం అవసరం పడుతుంది. ఈ ఏడాది విజయవాడకు చెందిన ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని సమకూర్చింది. 65 టన్నుల బరువు లాగే సామర్థ్యం కలిగి ఉన్న ఈ వాహనం పొడువు 75 అడుగులు, వెడల్పు 15, 26 టన్నుల బరువు ఉంటుంది. ఈ భారీ వాహనానికి 26 చక్రాలు ఉంటాయి. వాల్వో కంపెనీకి చెందిన ఈ ట్రాలీ ఆధునిక సౌకర్యాలు కలిగి ఉందని డ్రైవర్ వెంకట్ రెడ్డి తెలిపారు.
గురువారం రాత్రి 8గంటలకు కలశపూజతో నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. రాత్రి 10గంటలకు మహాహారనతి, 11గంటల తర్వాత భారీ విగ్రహాన్ని వాహనంపై పెట్టే పనులు ప్రారంభమవుతాయి. అంతకు ముందు ఖైరతాబాద్ మహాగణపతికి ఉప మండపాల్లో ప్రతిష్ఠించిన సోమనాథ జ్యోతిర్లింగం, కాలికా మాత విగ్రహాలను లక్ష్మి నరసింహట్రాన్స్పోర్టు సమకూర్చిన వాహనాల్లో పెట్టారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. లక్డీకాపూల్ రాజ్‌దూత్ చౌరస్తా, బీఎస్ఎన్ఎల్ భవన్, పాత సచివాలయం గేటు, తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్, లుంబినీపార్కు మీదుగా క్రేన్ నం.4 వరకు 11గంటలకు చేరుకుంటుంది. తుది పూజలు, వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1.30గంటల వరకు నిమజ్జనం ఘట్టం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 ( నమస్తే తెలంగాణ ) : గణేశ్ ఉత్సవాలకు ఆర్టీఓ కార్యాలయాల వారీగా వాహనాలను రెడీ చేశారు. మండపాల నిర్వాహకులు ఉత్సవ కమిటీ నాయకులతో సమన్వయం చేసుకొని వాహనాలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలా వాహనాలు మండపాల వద్దకు చేర్చినట్టు వివరించారు. సుమారు 60వేల వాహనాలు సమకూర్చారు. ఆర్టీఏ టారిఫ్‌ల ప్రకారం ఇంధనం, బత్తాతో సహా ట్రైలర్ల చార్జీలను రూ. 33,000గా ఉంది. 12 టైర్లు గల భారీ సరుకు రవాణా వాహనాల ధర ఇంధనం మినహాయించి రూ. 4,500 కాగా, ఇందులో రూ. 500 డ్రైవర్,క్లీనర్ బత్తా కూడా కలిపి ఉంది.
భారీ గూడ్స్ వాహనాలు (6 టైర్లు)కు రూ.3000, మీడియం గూడ్స్ వాహనాలు రూ.2వేలు, లైట్ గూడ్స్ వాహనాలు రూ.1500, టాటా ఏసీ లేదా చిన్న వాహనాలు రూ.వెయ్యిగా ఉన్నాయి. నగరంలో వాహనాల తరలింపు సజావుగా, క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకురవాణా శాఖ, స్థానిక పోలీసులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఉత్సవ నిర్వాహకులు తమ ప్రాంత పరిధిలోని ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేసిన పూలింగ్ పాయింట్ల ద్వారా ఈ వాహనాలను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
నిమజ్జనం చేసే చెరువుల వద్దకు సాఫీగా విగ్రహాలు వెళ్లేలా ఆయా విభాగాలతో సమన్వయం చేసుకున్న పోలీసులు ఎక్కడ ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయా రూట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని స్థానిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు మెయిల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. మొరాయించిన వాహనాలను తొలగించేందుకు ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు తదితర నిమజ్జన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా రూట్లతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘాను సాగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, షీ టీమ్స్, ఇంటెలిజెన్స్, ఎస్బీవిభాగాలతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తదితర విభాగాలు బందోబస్తులో ఉండనున్నాయని అధికారులు తెలిపారు.