సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : అధికార దాహంతో రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు లాకున్న రేవంత్‌రెడ్డి మార్ కుటిల రాజకీయాలకు దేశ అత్యున్నత నాయస్థానంలో భారీ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును గురువారం సుప్రీంకోర్టు సమర్థించింది.
దానం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ అనర్హతను ఖరారు చేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక దానం నాగేందర్‌పై అనర్హత వేటుపడటంతో మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి)తో పాటు ఇతర ఫిరాయింపుదారుల్లో తీవ్ర అయోమయం, భయం నెలకొంది. ఈ తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడినైట్లెయింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఖైరతాబాద్ ప్రజల ఆశీస్సులతో దానం నాగేందర్ గెలిచాడు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, ప్రజా తీర్పును తుంగలో తొకి రేవంత్‌రెడ్డి కండువా కప్పేసుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయాడు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. మరో పార్టీ తరఫున బీ-ఫామ్ తీసుకుని పోటీ చేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపు నిరోధక చట్టం) ఉల్లంఘనేనని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసింది. స్పీకర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాలయాపన చేయాలని కాంగ్రెస్ చూసినా, బీఆర్ఎస్ పట్టువదలకుండా న్యాయస్థానాలను ఆశ్రయించింది. నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దానం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యున్నత ధర్మాసనం హైకోర్టు తీర్పు సరైనదేనని స్పష్టం చేసి పిటిషన్‌ను తిరసరించింది.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): దానం నాగేందర్ కేసులో న్యాయస్థానం అనుసరించిన కఠిన వైఖరినే తమ పిటిషన్ల విషయంలోనూ వర్తింపజేస్తే తమ సీట్లకు కూడా ఎసరు రావడం ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాదు ఎప్పుడేం జరుగుతుందోనని వారి అనుచరులు, శ్రేణులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దానం కేసునే ప్రామాణికంగా తీసుకుని, పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేలందరిపైనా వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. గులాబీ పార్టీ గుర్తుపై గెలిచి ప్రజలను, పార్టీని మోసం చేసిన ప్రతి ఒకరికీ న్యాయస్థానాల్లోనూ, ప్రజా కోర్టులోనూ శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని హేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడకు ఈ తీర్పుతో చెక్ పడిందని తెలంగాణ ప్రజానీకం, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కుటిల రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ సాగించిన అనైతిక రాజకీయాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని, దానం నాగేందర్ ఒకడితోనే ఇది ఆగదని, గులాబీ పార్టీ బీ-ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ ఇదే గతి పడుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్‌రావు మండిపడ్డారు. కాగా, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా మారబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.