ముచ్చటైన వినాయకుడి మూర్తిని అందంగా కొలువుదీరుస్తున్నాం. నవరాత్రులూ ఘనంగా పూజిస్తున్నాం. ఆపై.. అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడికి సాగనంపుతున్నాం! గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి.. ప్రకృతి, పురుషుల ముద్దుల పట్టిని… కృతకంగా స్వాగతిస్తున్నాం! కిరాతకంగా సాగనంపుతున్నాం! మనం కాలుమోపడానికే జంకే చెరువులో.. మహాగణపతిని నిండుగా ముంచేస్తున్నాం!! చవితి సంబురం అసలు కథ.. నిమజ్జనం వెనుక తత్వం అవగతమైతే.. ఇలా ఎన్నటికీ చేయం!
భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకొంటాం. ఆ రోజు నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వినాయక నవరాత్రులను ఇండ్లల్లో, దేవాలయాల్లోనే కాకుండా సామూహికంగా పల్లె నుంచి పట్నం వరకు దేశమంతా జరుపుకొంటారు. వీధివీధినా వినాయకుడిని ప్రతిష్ఠించి, నవరాత్రి పూజలు నిర్వహించి భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే.. అనంత చతుర్దశి రోజున నీటిలో నిమజ్జనం చేస్తారు.
వినాయక నిమజ్జనం ప్రకృతితో మమేకమయ్యే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంరంభం. ప్రకృతి ఆకృతే గణపతి. ‘ప్రకృతీ పురుష అభేదాత్మకః గణేశః’ అని గణేశ పురాణం చెబుతుంది. గణపతి మూలాధార క్షేత్రానికి అధిపతి అని పతంజలి యోగ శాస్త్రం పేర్కొన్నది. మూలాధారం పృథ్వీతత్వానికి సంబంధించినది. కావున గణపతిని పృథ్వీ తత్వంగా ఆరాధించి, జలతత్వంలో లయం చేస్తారు. తద్వారా వినాయకుడు గణేశ గీతలో చెప్పినట్లు సమస్త లోకానికి ఆధార శక్తిగా విశ్వవ్యాపకుడు అవుతాడు. రూపం నుంచి అరూపంలోకి మారే ప్రక్రియ నిమజ్జనం.
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు మట్టితో చేసిన వినాయకుడు కేవలం మట్టిబొమ్మే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృత్తికా ప్రతిమ. హిందూ ధర్మంలో నీటిని నారాయణుడిగా భావిస్తారు. వినాయకుణ్ని నీటిలో నిమజ్జనం చేయడం అంటే పరమాత్మను పరమాత్మలోనే లీనం చేయడం అని భావించాలి. తొమ్మిది రోజులపాటు వినాయకుణ్ని భక్తితో కొలిచి సంతోషంగా నిమజ్జనం చేస్తాం. ఈ ప్రక్రియ ద్వారా లౌకిక బంధాలపై అతి వ్యామోహం పనికిరాదనే సందేశాన్ని గ్రహించాలి.

వినాయక నిమజ్జనానికి సంబంధించి పౌరాణిక కథనం ఒకటి కనిపిస్తుంది. వేదవ్యాసుడు మహాభారతాన్ని నిరాఘాటంగా చెబుతుండగా వినాయకుడు అవిశ్రాంతంగా పది రోజులపాటు రాశాడట. అలా రాయడం వల్ల వినాయకుడి శరీరం వేడెక్కిందట. ఆ వేడిని తగ్గించడానికి గణేశునికి చల్లని నీటితో స్నానం చేయించారట. దానికి గుర్తుగానే నవరాత్రి ఉత్సవాల తర్వాత గణేశుడి ప్రతిమల్ని నిమజ్జనం చేసే ఆచారం వచ్చిందనే పౌరాణిక కథనం వ్యవహారంలో ఉంది.
అలాగే స్వాతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ కృషి ఫలితంగా కూడా గణేష్ ఉత్సవాలకు విశేషమైన ప్రాచుర్యం కలిగింది. ప్రజల సమైక్యతకు గుర్తుగా, సామాజిక పండుగగా వినాయక ఉత్సవాలు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తికి, దేశభక్తికీ, ఆధ్యాత్మిక చైతన్యానికీ నాంది పలికాయి. మట్టి వినాయకులను పూజించి, నీటిలో నిమజ్జనం చేయడాన్ని చూసినప్పుడు మనం జరుపుకొనే పండుగల్లో అంతర్లీనంగా ఉన్న శాస్త్రీయ దృక్పథం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తులసి, జమ్మి, మర్రి, వాకుడు లాంటి ఔషధ పత్రాలను వినాయకుడితో పాటు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు క్రిమిరహితమై శుద్ధి అవుతుంది. నదీ జల వనరులను శుద్ధి చేయడం ఈ నిమజ్జనం ప్రధాన అంతరార్థం. అంతేకాదు ఎండిన చెరువుల్లో నుంచి తెచ్చిన మట్టితో విగ్రహాలు చేసి పూజించి, నవరాత్రుల అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువులోని మట్టి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
అయితే ఇలాంటి శాస్త్రీయ విషయాలకు తిలోదకాలిచ్చేశారు. మట్టి విగ్రహాల కంటే కాలుష్య కారకాలైన కృత్రిమ రంగులు వాడి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలనే అధికంగా పూజిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ప్రకృతి మాత కోపానికి కారకులవుతున్నారు. కృత్రిమ రంగులు, పదార్థాలు వాడి తయారు చేసిన విగ్రహాలను పూజించి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యంతోపాటు జలచరాల ఉనికికే ప్రమాదం కలుగుతున్నది. తద్వారా భస్మాసుర హస్తంలా మానవుడు తన ఉనికికి తానే ప్రశ్నార్థకమవుతున్నాడు.

వీధి వీధినా వినాయక మంటపాలు వెలియడం, అందరూ సమైక్యంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనందించదగిన విషయం. అయితే మంటపాల నిర్వహణకు వెచ్చించే డబ్బు, చేస్తున్న ఆర్భాటాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరో ముఖ్య విషయం ఏమంటే వీధుల్లో గణేష్ మంటపాలు ఏర్పాటు చేయడానికి చిన్నపిల్లలను చందాల వసూలుకు పంపడం. పిల్లలు చిన్న వయసులోనే డబ్బును వసూలు చేయడం, వాటి ద్వారా అంతర్గత కలహాలు పెంచుకోవడం, అబద్ధాలు, దొంగబుద్ధివంటి దుర్గుణాలు అలవాడే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. మంటపాల వద్ద హోరెత్తించే డీజే సౌండ్ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. చిన్నపిల్లలకు, గుండె జబ్బులు ఉన్నవారికి, వృద్ధులకు ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇలాంటి విపరీత ధోరణులకు ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిందే. ఇక మంటపాల వద్ద ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి భూతాపానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా ప్లాస్టిక్ భూతం పంచభూతాలకు విఘాతం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత కంటే ఆడంబరాలకే ప్రాధాన్యం పెరగడం విచారకరం.
కన్నుల పండువగా జరగాల్సిన నిమజ్జనోత్సవం కంటికి నీరు తెప్పించే విధంగా జరుగుతున్న తీరు ఇప్పటికైనా మారకపోతే మరెప్పటికీ మారదేమో. వినాయక నిమజ్జనం రోజున జరిగే ఊరేగింపు చూస్తుంటే భయానక వాతావరణం కనిపిస్తుంది. గణేశ నిమజ్జనం సమయంలో మానవ తప్పిదాల వల్ల అపశ్రుతులు చోటు చేసుకోవడం విచారించదగిన విషయం. గుండెదడ పుట్టించే విధంగా భయంకర శబ్దాలతో, వికృతమైన నృత్యాలతో, తాగకూడనివి తాగుతూ, ఊగుతూ ఉద్రేకంతో ఒళ్లుమరచి ఏం చేస్తున్నారో తెలియని విపరీత ధోరణుల పర్యవసానం మన సంస్కృతికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. అసలు నిమజ్జనం ఉద్దేశం ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? అని ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణమిది.

మనిషికి కుటుంబమే తొలి సమాజం. కాబట్టి మంచి మార్పు అనేది కుటుంబం నుంచే మొదలవ్వాలి. ప్రతి ఇంటిలో విధిగా మట్టి గణపతులనే పూజించాలనే ప్రతిజ్ఞ చేయాలి. తద్వారా స్థానికంగా ఎందరికో ఉపాధి కల్పించిన వారమవుతాం. అంతేకాకుండా దేశ తలసరి ఆదాయం పెరుగుతుంది. అలాగే వీధుల్లోని గణేశ మంటపాలకు మట్టి గణపతులను పెట్టినట్లయితేనే అనుమతులు ఇవ్వాలి. డీజే సౌండ్‌కు అనుమతులు ఇవ్వకూడదు. సంప్రదాయ వేషధారణతో, మన సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలతో భక్త బృందాన్ని అలరించాలి. భక్తిభావనలో ఓలలాడించాలి.
మట్టి వినాయకులు వాడటం వల్ల కలిగే పర్యావరణహితాన్ని ప్రజలకు సన్నిహితంగా వెళ్లి తెలియజేయాలి. అవగాహన కల్పించాలి. వినాయకుల తయారీలో సహజసిద్ధమైన రంగులని వాడేటట్లుగా చూడాలి. కావలసిన ముడి సరుకును తయారీదారులకు అందించాలి. మట్టివినాయక ప్రతిమలను తయారు చేసేవారిని ప్రోత్సహించాలి.
వినాయక నిమజ్జన ఊరేగింపులో కఠిన నియమాలను ప్రవేశపెట్టాలి. మద్యపానం చేసిన వారిని నిమజ్జనం ఊరేగింపులో పాల్గొనకుండా చూడాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలి. సంప్రదాయ వేషధారణతో, భక్తిపాటలు, భజనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాడవీధులుగా నిమజ్జనాన్ని నిర్వహించాలి. గణేశ విగ్రహం ఎంత పెద్దదిగా ఉంది? ఎంత పెద్ద మంటపం నిర్మించారు? ఎంత సౌండ్ పెట్టారు? అనే విషయాల కంటే ఏ మంటపం ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది? పవిత్రతకు మారుపేరుగా నిలుస్తున్నది ఏది? అని తెలుసుకోగలగాలి. అలాంటి నిర్వాహకులను ప్రోత్సహించాలి. ఇలాంటి నిమజ్జన మహోత్సవాన్ని కనులారా చూసే రోజు త్వరలో రావాలని కోరుకుంటూ.. ప్రకృతిని గౌరవించు- ప్రకృతితో మమేకమవ్వు- ప్రకృతిని పరిరక్షించు అనే నినాదమే వినాయక నిమజ్జన సందేశంగా భావించాలి. ప్రస్తుతం జరుగుతున్న నిమజ్జన దశ, దిశ మార్చి మన దేశ సంస్కృతిని సమున్నతంగా, సగౌరవంగా దశదిశలా చాటాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది.
-డా॥ నమిలకొండ సునీత కామారెడ్డి, 9908468171