(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (సర్-2026) సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనుకూల ఓట్లే లక్ష్యంగా ‘సర్’ ఏరివేత ప్రక్రియ కొనసాగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకొన్న స్థానాల్లోనే అత్యధికంగా ఓటర్ల తొలగింపులు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు కోల్కతాకు చెందిన సబర్ ఇన్స్టిట్యూట్ ప్రాథమికంగా విడుదల చేసిన ఓ విశ్లేషణాత్మక నివేదికను ఉటంకిస్తూ డెక్కన్ హెరాల్డ్ తదితర జాతీయ పత్రికలు పలు కథనాల్లో పేర్కొన్నాయి. ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఓట్ల తొలగింపులు తక్కువగా నమోదవుతున్నట్టు తేలడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 64 సీట్లు, బీజేపీ, ఎంఐఎం చెరో ఏడు స్థానాలు సాధించాయి. అయితే, బీఆర్ఎస్ గెలిచిన 39 నియోజకవర్గాల్లోని ఓటర్లలో ఏకంగా 27.7 శాతం (30,26,510) మందిని ‘సర్’లో భాగంగా ఏఎస్డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికెట్) జాబితాలో చేర్చినట్టు సబర్ నివేదికను ఉటంకిస్తూ డెక్కన్ హెరాల్డ్ ఓ కథనంలో వెల్లడించింది.
అంతేకాదు, ఈ నియోజకవర్గాల్లో చనిపోయిన ముస్లిం ఓటర్లతో పోలిస్తే అన్ట్రేసబుల్ క్యాటగిరీలోకి చేరిన ముస్లిం ఓటర్ల సంఖ్య 1.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు సబర్ ఇన్స్టిట్యూట్ ప్రధాన ప్రతినిధి సబీర్ అహ్మద్ తెలిపారు. ఇక, హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో సబర్ ప్రతినిధులు ‘సర్’ ప్రక్రియను లోతుగా విశ్లేషించారు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 19.41 లక్షల మంది ఓటర్లను ఏఎస్డీడీ క్యాటగిరీలో పెట్టినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ గెలుచుకొన్న పలు నియోజకవర్గాల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేశారు. అయితే, ఇవన్నీ ప్రాథమిక అంచనాలేనని, అధికారికంగా నిర్ధారించలేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

బెంగాల్లో మమత కంచుకోట బీటలువారడానికి ‘సర్’లో భారీగా టీఎంసీ అనుకూల ఓట్లను తొలగించడమే కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది ఓట్ల తేడాతో టీఎంసీ భారీగా సిట్టింగ్ స్థానాలను కోల్పోవడాన్ని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. బెంగాల్లో అత్యధికంగా ముర్షీదాబాద్ జిల్లాలో 4.55 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 2021 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తొమ్మిది స్థానాలకే పరిమితమయ్యింది. మైనారిటీ ఓట్లను భారీగా తొలగించడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 3.25 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇటీవల జాబితా నుంచి తొలగించారు.
గతంలో ఈ జిల్లాలోని మొత్తం 33 స్థానాల్లో 28 సీట్లను గెలిచిన టీఎంసీ.. ఈసారి కేవలం 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. మాల్దా జిల్లాలో 2.39 లక్షల ఓట్లను తొలగించగా.. అక్కడ గతంలో టీఎంసీ 8 స్థానాలను గెలుచుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. టీఎంసీ చేజార్చుకొన్న ఈ అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ‘సర్’ ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడమే టీఎంసీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బెంగాల్ ‘సర్’లో తొలగించిన ఓట్ల శాతం 11.88 ఉండగా.. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 5.04 శాతంగా ఉండటం గమనార్హం. తమిళనాడులోనూ ‘సర్’ పేరిట 97.3 లక్షల ఓట్లను ఇటీవల తొలగించారు. ఇది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయావకాశాలకు ప్రధానంగా గండి కొట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 39 నియోజకవర్గాల్లో 30,26,510 మంది ఓటర్లను ఏఎస్డీడీ పేరిట తొలగింపు క్యాటగిరీలో ఉంచగా, కాంగ్రెస్ పార్టీ గెలిచిన 64 నియోజకవర్గాల్లో తొలగింపు క్యాటగిరీలో 20,37,959 మంది ఓటర్లు ఉన్నారు. ఇక బీజేపీ గెలుచుకొన్న ఏడు నియోజకవర్గాల్లో 2,97,891 మంది ఓట్లు తొలగింపు క్యాటగిరీలో ఉన్నట్టు సబర్ నివేదికను ఉటంకిస్తూ డెక్కన్ హెరాల్డ్ వెల్లడించింది. బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో ముఖ్యంగా ముస్లింల ఓట్లు ఎక్కువగా గల్లంతయినట్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో తొలగించిన ప్రతి మూడు ఓట్లలో ఒకటి ముస్లిం ఓటేనని నివేదిక అంచనా వేసింది.
