Crime News : రాజస్థాన్ (Rajasthan) లో దారుణం జరిగింది. షాబాజ్ (Shahbaz) అనే వ్యక్తి ముస్కాన్ (Mushkan) అనే మహిళను హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని అడవి మృగాలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహమ్మద్ సాగర్ అలీ అలియాస్ షాబాజ్ ఖాన్‌ను రాజస్థాన్ పోలీసులు సుమారు ఏడు వేల కిలోమీటర్లు వెంబడించి బీహార్ (Bihar) లో అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 19న ముస్కాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జూన్ 22న ఆమె దారుణహత్యకు గురైంది. షాబాజ్ ఖాన్, అతని సహచరుడు కలిసి ముస్కాన్‌ను రాంపుర కొండ ప్రాంతంలో హత్యచేశారు. అక్కడ ఆమె తలపై రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని క్రూర మృగాలు తినివేస్తే ఆనవాళ్లు కూడా మిగలవనే దురాలోచనతో.. సమీపంలోని ఒక జంతువుల గుహ వద్ద పడేశారు.
అయితే మృతదేహం పూర్తిగా ధ్వంసం కాకముందే పోలీసులు దానిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే మిస్సింగ్ కేసు పెట్టిన కుటుంబసభ్యులు అది ముస్కాన్ మృతదేహంగా నిర్ధారించారు. బివాడి ఎస్పీ బ్రజేష్ ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. నిందితుడి కోసం పోలీసులు రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గాలించారు. దాదాపు 250 సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి, 325 ప్రాంతాలను జల్లెడ పట్టారు.
అయితే నిందితుడు నిరంతరం తన ఫోన్లు, లొకేషన్లు మారుస్తూ తప్పించుకు తిరుగుతుండటంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. దాంతో పోలీసులు కొన్నిసార్లు స్థానికుల వేషధారణలో అండర్ కవర్ ఆపరేషన్లు కూడా నిర్వహించారు. ఎట్టకేలకు 7,000 కిలోమీటర్ల దూరం వెంబడించిన తర్వాత బీహార్‌లోని సహర్సా జిల్లాలో షాబాజ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో షాబాజ్ నేరాన్ని అంగీకరించాడు. తన కుటుంబ రహస్యాలను బయటపెడుతుందనే భయంతోనే హత్యచేసినట్లు చెప్పాడు. అయితే ఈ హత్యలో ప్రధాని నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.