SIR In Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుండి కూడా బూత్ లెవల్ అధికారులు (BLOs), బూత్ లెవల్ ఏజెంట్ (BLAs) నియమించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈ అంశంపై ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఈఓకు గులాబీ పార్టీ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కార్యాలయంలో రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్, లీగల్ సెల్ నేత లలితా రెడ్డితో పాటు ఇతర పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తరఫున బూత్ లెవల్ అధికారులను సరైన విధంగా నియమించకపోవడం వల్ల కలిగే సమస్యలను బీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో రాజకీయ పార్టీల నుండి BLO, BLAలు లేకపోతే అనేక పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశముందని వారు వివరించారు.
బీఆర్ఎస్ నాయకులు వివరించిన అంశాలపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రతి వార్డులో ప్రధాన రాజకీయ పార్టీల నుండి BLO, BLAలను నియమించే అంశంపై ప్రత్యేకంగా అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.