లండన్ : అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ తీవ్రమవుతున్నది. అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్టు ఇటీవల అమెరికా అంగీకరించగా.. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను బ్లాక్ చేస్తున్నట్టు తాజాగా బ్రిటన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ తెలిపింది. అయితే ఇదంతా తమ ఆత్మరక్షణ కోసమేనని వెల్లడించింది. బ్రిటన్కు చెందిన అణు నిల్వలు, అణు జలాంతర్గాముల కదలికలు, దేశ రక్షణకు సంబంధించిన ప్రాంతాల చెందిన సమాచారాన్ని శత్రు దేశాల ఉపగ్రహాలకు చిక్కకుండా భూమి మీద నుంచే ప్రత్యేక టెక్నాలజీతో బ్లాక్ చేస్తున్నట్టు పేర్కొన్నది.
ది రాయల్ ఎయిర్ఫోర్స్ (యూకే వాయుసేన) తాజాగా స్పేస్ స్వాడ్రన్ను ఏర్పాటు చేసింది. అంతరిక్షంలో శత్రు దేశాల నుంచి తీవ్ర ముప్పు ఉన్నదని, స్పేస్ స్వాడ్రన్ బ్రిటన్ ఉపగ్రహాలకు రక్షణ ఇస్తుందని రాఫ్ అధిపతి చెప్పారు. ఇప్పటికే అనేక దేశాలు ఇలా భూమి నుంచే ఇతర దేశాల ఉపగ్రహాలను బ్లాక్ చేస్తున్నాయని, ఇదంతా దేశ పరిరక్షణ కోసమేనని రాఫ్ వెల్లడించింది. ఇటీవల రష్యా తమ ఉపగ్రహాలను పదేపదే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.