న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశీయ ఫార్మా రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా సంస్థల ఆదాయంలో వృద్ధి 11 శాతం నుంచి 13 శాతం మధ్యలో ఉండనున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. కిందటేడాది సింగిల్ డిజిట్ 8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ఫార్మా రంగం..ఈసారి రెండంకెల వృద్ధికి చేరుకోనున్నదని తెలిపింది. ప్రధానంగా ఎగుమతులు పుంజుకోవడంతోపాటు దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని విశ్లేషించింది.
అయితే, ముడి సరుకులు, ఇంధన, రవాణా ఖర్చులు పెరుగడం వల్ల నిర్వహణ లాభాల మార్జిన్లు 150-200 బేసిస్ పాయింట్లు తగ్గి 21-21.5 శాతానికి పరిమితం కావచ్చునని అంచనావేస్తున్నది. దీంతో అధిక ఆదాయ వృద్ధి పూర్తిగా నికర లాభాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కూడా మెండుగావున్నాయని పేర్కొంది. కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ, బలమైన నగదు ఉత్పత్తి, ద్రవ్య లభ్యత, పటిష్టమైన బ్యాలెన్స్ షీట్ల కారణంగా ఈ రంగం రుణ పరపతి స్థాయిలు దృఢంగానే ఉంటాయని అంచనావేస్తున్నది. అత్యధికంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న దేశీయ ఔషధ ఎగుమతుల్లో 83 శాతం ఫార్ములేషన్ వాటా ఉన్నది.