‘నాకు బీఆర్ఎస్లో “మా నాయన” కేసీఆర్ నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరితోనూ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవు (my love on KCR is unconditional)’… అంటూ ఒక అమ్మాయి (ఇద్దరు పిల్లల తల్లి) రాసిన వ్యాసం చూశాక నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. (ఇవి ఆనందభాష్పాలా! బాధతో వచ్చినవా? అనేది మీరే నిర్ణయించుకోండి). ఆ వ్యాసాన్ని ఎన్నిసార్లు చదివానో, ఎంతగా సంతోషపడ్డానో నాకే తెలుసు. తదుపరి ఆ భగవంతునికే తెలుసు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం. దీన్ని మళ్లీ, మళ్లీ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, ఆ విషయాలు ఇప్పటి యువతరానికి తెలియదు.
నష్టపోయిన తెలంగాణీయులలో నేనొకడిని కాబట్టి, పదేండ్ల తర్వాత మార్పును కోరిన సమాజానికి, నేడు అనుభవిస్తున్న పరిస్థితులకు కారణాలు చెప్తూ, జరిగిన అన్యాయాల్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తున్నది. కొంతకాలంగా తెలంగాణ యువతను చూస్తే భయమేస్తున్నది. ఎందుకంటే, తెలంగాణను వీళ్లు రక్షించుకుంటారా? మళ్లీ నక్కల, కుక్కల పాలు చెయ్యరు కదా అని అనుమానం, ఆవేదన. యువతది తప్పు కాదు, ఎందుకంటే ఆ చీకటి కాలాన్ని వారు అనుభవించలేదు. కొంతమంది చూసి ఉంటారు కానీ, అనుభవంలోకి రాలేదు. సగటు తెలంగాణ అనుభవించిన అవమానాలు, దోపిడీలు వారికి తెలియవు.
‘ఏంటండి చొక్కారావు గారు, తెలంగాణకు వచ్చే “కోట్లా”. ఏం కోట్లండి పాత కోట్లా? కొత్త కోట్లా చెప్పండి తెప్పిస్తాను’ ఇలాంటి అవమానాలు. ఇది మాజీ ముఖ్యమంత్రి ఒకాయన మన నాయకులతో మాట్లాడిన ఎకసెక్కపు మాటలు. మరొక ద్రోహపు ముఖ్యమంత్రి.. ‘తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వను! ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దుర్మార్గపు మాటలు. ఈ మాటలు మాట్లాడినవారు ఇంకా హైదరాబాద్ వస్తూ అక్కడక్కడ కనబడుతుంటే, నాకప్పుడు ఎంత మండుతుందో నాకే తెలుసు. ఈ మాటలు ఎలా మరుపునకు వస్తాయి. గమ్మతు ఏమంటే.. ఉద్యమంలో పాల్గొన్నవారు కూడా వాటిని మరిచిపోయారు. వాటిని అనుభవించివాళ్లు, నాలాంటివాళ్లు ఏ కొద్దిమందో జీవించి ఉన్నారు. ద్రోహులు బతికే ఉన్నారు. తెలంగాణ ప్రజలు జరిగిన అవమానాల్ని, నష్టాల్ని మరిచిపోతున్నారు. ఇదీ మా బాధ.
ఇక కేసీఆర్ లాంటివారు రాష్ర్టాన్ని ఎలా పునర్నిర్మాణం చేయాలో రాత్రి పగలు ఒక్కొక్క అనుభవశాలితో చర్చిస్తుంటే.. ‘నన్ను కలువలేదు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కబుర్లు చెప్పలేదు’ అని కొందరి అవస్థ. కలవకపోతే దొరలపాలన, గడీల పాలన అంటూ కులం పేరుతో, మతం పేరుతో తిట్లు. ఇదా తెలంగాణ అంటే ప్రేమ. పెంటలపై కాగితాలు ఏరుకునేవాళ్లు కూడా నాయకులై రాష్ట్రమంటే ఏ మాత్రం ప్రేమ, అభివృద్ధి ధ్యాస లేకుండా పిచ్చి వదుర్లు వదురుతుంటే మాలాంటివారికి ఎలా ఉంటుంది. వాళ్లనోరు ఎలా మూయించగలం. ఆ మాటల మాయలో పడి ఎవరు ద్రోహులు? ఎవరు శ్రేయోభిలాషులు? అని అర్థం చేసుకోక తనకున్న పవర్‌ను వ్యర్థపరుచుకుంటే సగటు తెలంగాణ వాసి రేపెట్లా పైకొస్తాడు. సరైన ఆలోచన లేకుండా తికమకపడితే ఎలా? వీటిని చూస్తుంటే మావంటి వయసు మళ్లిన వారికి కలిగిన బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇదిగో ఇలా ఈ పత్రిక ద్వారా చెప్పుకొంటున్నాం.
ఇలాంటి సమయంలో మొన్నటి వ్యాసం మండుటెండలో పన్నీటి చిలకరింపులా హాయి కలిగించింది. ఆ అమ్మాయి ఎంతబాగా విశ్లేషణ చేసింది. ఎంతబాగా వివరణ ఇచ్చింది. నీ వివరణతో మా కడుపు నిండిందమ్మా! ఏం పర్వాలేదు నా తెలంగాణను కాపాడుకునే యువత మేల్కొనే ఉంది. సమయం వచ్చినప్పుడు రుద్రుడై, రుద్రమలై విజృంభిస్తారనే నమ్మకం కలిగింది.
పక్కనున్న రాష్ట్ర ప్రజలు చాలా మంది మంచివారే. వారిలో అత్యాశలు ఏం కనిపించవు. కొందరికి మాత్రమే తెలంగాణకు వచ్చి దోచుకొని, తమవారికి పెట్టుకోవాలనే దురాశ. ఇందులో కొందరు ‘నాదిర్షా’లు, కొంతమంది ‘ఘోరీ’లు ఇంకా బతికే ఉన్నారు. వారి ఓ కన్ను తెలంగాణపై ఉంచారనే అనుమానం విచారించాల్సిన విషయం. వారికి కొందరు తెలంగాణవాళ్లే సహాయం, సహకారం చేస్తున్నారని అనుమానం. తెలంగాణవాళ్లే వారికి సహాయ పడుతుంటారు. అందుకే వారు కనుమరుగయ్యే వరకు మాలాంటివాళ్లు భయపడుతూనే ఉంటాం అమ్మాయి. వ్యాసం చాలా బాగుంది. నీ బహిరంగ లేఖ యువతకు కనువిప్పు, మేల్కొలుపు కావాలి. ఇంటాబయట ఉన్న తెలంగాణ ద్రోహులకు సింహస్వప్నం కావాలి. మాలాంటివారు ఈ తెలంగాణ భూమిని శాశ్వతంగా విడిచే వేళ తృప్తిగా వెళ్లిపోవాలి.
(వ్యాసకర్త: పూర్వ రిజిస్ట్రార్, తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి)
– చెన్నమనేని హన్మంతరావు