‘కార్మికులకు తీపికబురు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన 4 కార్మిక కోడ్ల లోగుట్టు అంతా శ్రామిక వ్యతిరేకతనే నిండి ఉన్నది. కాలం చెల్లిన పాత చట్టాలు మారుతున్న పారిశ్రామిక విధానాలకు, కొత్తతరహా ఉద్యోగులకు వర్తించేలా లేవని చెప్తూ కేంద్రం వీటిని ప్రవేశపెట్టింది. అయితే, ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను తొలగించి ఈ కోడ్లను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించడం జరిగింది. పారిశ్రామిక వర్గాలు సంతోషంగా స్వాగతిస్తుండగా కార్మిక సంఘాలు వ్యతిరేకించడంలోనే వీటి అసలు రంగు బయటపడుతున్నది. మన దేశంలో కార్మిక అంశం కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాకు చెందినది. స్థానిక అవసరాలు, శ్రామిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాలు సొంత కార్మిక చట్టాలు రూపొందించుకుంటాయి. ప్రభుత్వం, కార్మికసంఘాలు, యాజమాన్యం కలిసి చర్చించి త్రైపాక్షిక ఒప్పందం ద్వారానే చట్టం ఆకారాన్ని పొందుతుంది.
దేశంలో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్‌ను ఏర్పాటుచేసింది. లేబర్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఐఎల్సీ ప్రమేయాన్ని కూడా ఈ విషయంలో కేంద్రం ఖాతరు చేయలేదు. జూలైలో ఏర్పాటుచేసిన ఐఎల్సీ సమావేశంలో ప్రధాన కార్మిక సంఘాలు ఈ కొత్త కోడ్లపై తమ వ్యతిరేకతను తెలియజేశాయి. అదేదీ పట్టించుకోకుండా, రాష్ర్టాలను కూడా సంప్రదించకుండా కేంద్రం వీటి అమలు తేదీ ప్రకటించింది. వెంటనే వీటిపై డ్రాఫ్ట్ పాలసీ సిద్ధం చేసుకొమ్మని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.
సెప్టెంబర్ 2020 నాటికే సిద్ధంగా ఉన్న ఈ కోడ్లను అదను చూసుకొని బీహార్ ఎన్నికల్లో విజయం ఊపులో బీజేపీ ప్రభుత్వం అమలుకు సిద్ధపడింది. వీటికి వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపర భద్రతా-ఆరోగ్యం -పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఇవి పనిచేస్తాయి. 4 వేతన చట్టాలు, 9 సామాజిక భద్రతా చట్టాలు, 9 వృత్తిపర భద్రతా, ఆరోగ్యం, పని చోట వసతుల చట్టాలు, 3 పారిశ్రామిక సంబంధాల చట్టాలు కలిపి 4 కోడ్లుగా మార్చారు. అయితే, పాత చట్టాల స్థానంలో వచ్చిన కొత్త కోడ్లు ఏ విధంగా కార్మిక ప్రయోజనాలను కాలరాస్తాయో తెలుపుతూ కార్మిక సంఘాల నేతలు, విషయ నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. వీటిని కార్మిక వ్యతిరేక, యాజమాన్యాల అనుకూల చట్టాలుగా వారు పేర్కొంటున్నారు.
ఉద్యోగులను విధుల్లోంచి తొలగించడానికి అనుకూలంగా, యాజమాన్యాలతో చర్చలకు, సమ్మెలకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. యజమాని బానిస సంబంధాలను తిరిగి తెస్తున్నాయని, పారిశ్రామిక రక్షణను తొలగిస్తూ సంఘాల ఏర్పాటు, సామూహిక ఆందోళనలను అడ్డుకుంటాయని, ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు నిరుపయోగమవుతాయని అంటున్నారు. వీటి అసలు ఉద్దేశం సంస్కరణ కాదు. ఉన్న హక్కులను, రక్షణను కార్పొరేట్ సంస్థలకు దాసోహం చేయడమే. ఏకపక్షంగా, అప్రజాస్వామ్యంగా ఉన్న ఈ క్రూరమైన చట్టాలను అమలుచేయవద్దని వారు కోరుతున్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని, పని ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించాలని కార్మిక సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి.
కేంద్రం తెచ్చిన ఈ కోడ్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయి. ఉద్యోగ తొలగింపు సమయంలో చెల్లించే సొమ్ము విషయంలో 100 బదులు 300 ఉద్యోగులున్న పరిశ్రమలకు కూడా ఉపశమనం లభిస్తున్నది. కొన్ని రాష్ర్టాల్లో మహిళలను రాత్రి వేళ పనికి అనుమతించాలని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఓవర్ టైమ్ లిమిట్‌ను 50 గంటల నుంచి 125 గంటలకు పెంచారు. విశాలమైన ఫెడరల్ వ్యవస్థలో ఇలాంటి ఏకరూప కార్మిక చట్టాలు ఉపయోగపడవు. స్థానిక అవసరాలు, కార్మికుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాలు చట్టాలను ఏర్పాటుచేసుకుంటాయి. పాత్రికేయుల వేతన సంబంధ ప్రత్యేక చట్టం వేతన కోడ్‌లో లుప్తమైందని జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎవరెవరి చట్టాలు ఈ సుడిగుండాల్లో ఎలా చిక్కుపడ్డాయో బయటపడాల్సి ఉన్నది. సెప్టెంబర్ 2020లో మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల 2021 నవంబర్‌లో వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ మోదీ జాతికి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఈ ఉత్పాతం కార్మికులపై పడింది. వారు ఏ స్థాయిలో తమ నిరసనను ప్రదర్శించి హక్కులు కాపాడుకుంటారో చూడాలి.
-బద్రి నర్సన్