నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ) : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఖర్చుల వివరాలు నిర్ధేశిత గడువులోగా సమర్పించకుంటే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల మేరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారనే దానిపై కచ్ఛితత్వంతో కూడిన లెక్కలు చూపాలని, పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఈ లెక్కలు చూపాలి. ఈ మేరకు ఈ నెల 29వ తేదీ చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. అప్పటి వరకు లెక్కలు చూపించని అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 80 కౌన్సిలర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 355 మంది పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థి నిబంధనల మేరకు లక్ష రూపాయల లోపు ఖర్చు చేయాలి.
ఈ నిధులతో ఎన్నికల సమయంలో టీ, టిఫిన్, నమూనా బ్యాలెట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రకటనలు, ప్రచార పత్రాలు, భోజనం, మైక్‌సెట్, డ్రైవర్లకు ఇచ్చే బత్తా వంటి వాటికి ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చుల వివరాలు సకాలంలో అందజేయకపోతే గెలిచిన అభ్యర్థులపై వేటు పడే అవకాశం ఉంది. అలాగే ఓటమి చెందిన అభ్యర్థులు లెక్కలు చూపించాలి. ఓడిన వారు లెక్కలు చూపకపోతే భవిష్యత్‌లో జరగబోయే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులవుతారని అధికారుల చెబుతున్నారు. జిల్లాలో 355 మంది పోటీ చేయగా, ఇప్పటి వరకు కేవలం 45 మంది మాత్రమే లెక్కలు సమర్పించినట్లు చెబుతున్నారు. కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు రూ.లక్ష లోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో వెచ్చించినట్లు చర్చించుకుంటున్నారు. కొన్ని కీలక వార్డుల్లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అధికారులకు సమర్పించే లెక్కలు మాత్రం రోజుకు రూ.5 వేలు మించకుండా చూపించేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
మూడు మున్సిపాలిటీల్లో 355 మంది
నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల పరిధిలో 80 కౌన్సిలర్ స్థానాలకు 355 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నిర్మల్‌లో 42 వార్డులు ఉండగా, వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు 184 మంది బరిలో నిలిచారు. అలాగే ఖానాపూర్‌లో 12 వార్డులు ఉండగా, 56 మంది పోటీ చేశారు. భైంసాలో 26 వార్డులు ఉండగా, ఇక్కడ 115 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కల వివరాలు అందజేయలేదు. గెలుపొందిన అభ్యర్థులు గడువులోగా లెక్కలు సమర్పించకపోతే వారిని కౌన్సిలర్ పదవికి అనర్హులుగా గుర్తించి, అదే వార్డులో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని కౌన్సిలర్ పదవికి ఎంపిక చేస్తారు. గతంలో జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో 10 మంది వార్డు సభ్యులు సకాలంలో లెక్కలు సమర్పించకపోవడంతో వారిపై అనర్హత వేటు పడ్డ విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అలాగే ఓడిన వారు లెక్కలు చూపాలని కోరుతున్నారు.