Traffic Challan | సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి.. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్లిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడి క్యూఆర్‌కోడ్ స్కాన్‌కు బదులుగా దుకాణదారుడిని ఏమార్చి తన అకౌంట్‌కు చెందిన స్కానర్ కోడ్‌ను పెట్టి డబ్బు చెల్లిస్తాడు. దుకాణదారుడిని మోసం చేసినట్టు చూపించే ఈ రీల్స్ సరదాగానే ఉన్నా.. దీనినుంచే స్ఫూర్తి పొందారో ఏమో.. నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కార్ ఖజానాకు రూ.2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైన క్యూఆర్ కోడ్‌కు బదులుగా తమ సొంత బ్యాంకు ఖాతాల క్యూఆర్ కోడ్‌ను పెట్టిన ఉదంతం పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది. చలాన్లు కట్టినప్పటికీ.. ఇంకా పెండింగ్ ఉన్నట్టుగానే వెబ్సైట్లో కనిపిస్తున్నది. దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా, ‘ఇంకా అప్డేట్ కాలేదేమో’ అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలామంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఏకంగా రూ.2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లిందని తెలిసి అంతా అవాక్కయ్యారు. ఈ గుట్టు బయటపడితే ఖాకీల పరువు పోతుందనుకున్నారో ఏమో.. ఓ హోంగార్డుపై వేటువేసి స్కానర్ స్కామ్‌ను తొక్కి పెట్టారు. కానీ ఒక్క హోంగార్డు ఇంత భారీస్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బయటపడిన కుంభకోణం ఒక్క జోన్‌కు సంబంధించింది మాత్రమే! మరి ఇతర జోన్లలో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సికింద్రాబాద్ జోన్లో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండి.. ఇటీవల ఓ సినిమా స్టార్ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఓ ప్రధాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఇక్కడి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చలాన్లు వసూలు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికే ఈ దందా జోరుగా సాగుతున్నట్టు వెల్లడైంది. సాధారణంగా రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు రూ.1000కి పైగా చలాన్లు పడుతుంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికి కూడా రూ.135 నుంచి రూ.1000కి వరకు చలాన్లు వేస్తుంటారు. ఇలా రూ.5000 వరకు చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులు ఉన్నారు.
ఇటువంటి వారు ట్రాఫిక్ తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు.. అక్కడి కానిస్టేబుల్ లేదా హోంగార్డు వంటి కిందిస్థాయి సిబ్బంది, పర్యవేక్షణలో ఉన్న అధికారి సమ్మతితో ఎంతో కొంత తీసుకొని వారిని అప్పటికి వదిలేయడం జరిగేది. చలాన్ల మొత్తం ఎక్కువగా ఉన్న వారిని ఎంతోకొంత కట్టి వెళ్లాల్సిందేనని బలవంత పెట్టిన సందర్భాలు కూడా అనేకం. ఈ క్రమంలోనే చలాన్ల పేరుతో తమ జేబులు నింపుకోవడానికి ఓ కొత్త పథకం వేశారు. పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు తాము ఉపయోగించే ట్యాబ్‌ల్లో ప్రభుత్వపరమైన క్యూఆర్‌కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కొందరు యూపీఐ ఏజెంట్లతో మాట్లాడుకున్నారు. ఆ కోడ్‌లో ట్రాఫిక్ చెల్లింపులు వెళ్లే బ్యాంకు ఖాతా పేరు కనిపిస్తుంది.. కానీ ఆ డబ్బులు మాత్రం తమ ఖాతాలోకి వెళ్లేలా స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్‌లో పెద్ద అధికారులు ఎవరూ చిక్కకుండా ఓ హోంగార్డును ముందుపెట్టి తతంగం నడిపించారు. రోజువారీ చలాన్ల వసూళ్లలో కొన్నింటికి మాత్రమే ప్రభుత్వ క్యూఆర్‌కోడ్‌ను వాడి మిగిలిన వాటికి తమ ఫేక్ కోడ్‌ను వాడినట్టు పోలీసులు గుర్తించారు.
ప్రజల నుంచి చలాన్ల పేరుతో వసూలు చేసిన సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న ట్రాఫిక్ పోలీసుల బాగోతంపై పోలీసుల వర్గాల్లో పెద్దత్తున చర్చ జరుగుతున్నది. ఆ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అడ్డా వేసి చలాన్లు వసూలు చేశారో ఆ ప్రాంతాల్లో వాహనదారులు పెద్ద మొత్తంలో కట్టిన చలాన్ల సొమ్ము ఫేక్ స్కానర్‌కు సంబంధించిన ఖాతాలోకి చేరినట్టు తెలిసింది. దాదాపు రెండుకోట్ల రూపాయల వరకు దారిమళ్లినట్టు పోలీసులే చెప్పుకుంటున్నారు. చలాన్లు కట్టినప్పటికీ అవి ఇంకా పెండింగ్ ఉన్నట్టు తెలిసి వాహనదారులు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇది రచ్చ కాకుండా సైలెంట్‌గా ముగించాలనుకున్న ఆ స్టేషన్ పోలీసులు ఓ హోంగార్డును బాధ్యుడిని చేశారు. ఇంతపెద్ద స్థాయిలో ఫేక్ దందాను పై అధికారుల ప్రమేయం లేకుండా ఒక్క హోంగార్డు ఎలా నడిపిస్తారంటూ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏదైనా ఒకచోట తనిఖీలు, చలాన్లు వసూలు చేసే బృందంలో హోంగార్డుతోపాటు ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది కూడా ఉంటారు. చలాన్ల వసూళ్లలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే వీరెవరికీ తెలియదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేను రోజుల క్రితం హోంగార్డుపై వేటువేసిన ఉన్నతాధికారులు ఆ డబ్బు ఏయే ఖాతాల్లోకి వెళ్లిందనే అంశంపై ఆరా తీశారు. ఆ హోంగార్డుతోపాటు ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఫేక్ స్కానర్‌తో చలాన్ల సొమ్ము వసూలు చేసి సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు తెలిసింది.
ట్రాఫిక్ చలాన్లు విధించడం, వసూలు చేసే వ్యవహారంలో పోలీసుల తీరు పట్ల ప్రజల్లో ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. హైకోర్టు తీర్పు అనంతరం కొంత ఊరట లభించింది తప్ప అంతకుముందు ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి మరీ చలాన్లు వసూలు చేసేవారు. ఒకవేళ కట్టకపోతే అక్కడికక్కడే వాహనాల తాళాలు గుంజుకుని స్టేషన్‌కు తరలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్జెంటుగా వెళ్లాల్సి ఉండి, ఎంతో కొంత డబ్బులు కట్టి అక్కడినుంచి వెళ్లిపోయే క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు చూపించిన స్కానర్‌కు డబ్బులు స్కాన్ చేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు అది ఫేక్ స్కానర్ అని తెలిసి తాము కట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుందంటూ ఆందోళన చెందుతున్నారు. ఫేక్ స్కానర్‌తో వసూలు చేసింది ఎంత అన్నది పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్న అధికారులకు ఇప్పుడు వాటిని ఎలా తిరిగి వాహనదారుల ఖాతాల్లోకి మళ్లించాలన్నది తలనొప్పిగా మారిందంటూ పోలీస్‌స్టేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫేక్ స్కానర్‌కు డబ్బు చెల్లించినవారు ఎవరైనా తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపిస్తే వారి చలాన్లకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ప్రజల సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడంపై పోలీసు కమిషనర్ వరకు ఈ బాగోతం తెలియకుండానే జరిగిందా.. ఇంత జరిగినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే మరి స్కామర్లు ఇంకా ఎలాంటి పనులకు తెగబడుతారోనంటూ నగరవాసుల్లో చర్చ జరుగుతున్నది.