KTR | రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్‌రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నడు. ఆ కుర్చీలో ఐదేండ్లు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలె. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు, భూములు అర్రాసు పెడుతున్నడు. పేదల ఇండ్లు కూలగొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నడు. అన్నదాతలకు నాలుగు విడతలుగా రైతుభరోసా ఎగ్గొట్టి, కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి వెయ్యికోట్లు పంపుతున్నడు.
-కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతుబంధు లేదుగానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాహుల్ బంధు పథకం అంటే రాహుల్ గాంధీకి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇచ్చే పథకమని దెప్పిపొడిచారు. రైతుబంధు పథకాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడుసార్లు ఎగ్గొట్టాడని మండిపడ్డారు. సీఎం సీటు కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నాడని విమర్శించారు. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడని, ఆ కుర్చీలో ఐదేండ్లు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలని, ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు, భూములు అర్రాసు పెడుతున్నాడని, పేదల ఇండ్లు కూలగొట్టి కప్పం కడుతున్నాడని నిప్పులు చెరిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ సోమవారం పర్యటించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గీత కార్మికుడు సాయిలి కిషన్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌లో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని పలువురు సర్పంచ్‌లు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీల నేతలు చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లను ఆత్మీయంగా సత్కరించారు. సాయంత్రం బీవైనగర్‌లోని షాదీఖానలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంతకు ముందు చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు.
‘ఈరోజు రాష్ట్రంలో రైతులు దుఃఖంలో ఉన్నరు. రైతు బంధు రాదు.. కరెంట్ రాదు.. బోనస్ రాదు.. పంటలు కొనరు.. రైతాంగ పరిస్థితి ఆగమైపోయింది’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మూడో పంటకు రైతుబంధు ఇయ్యరా? అని నాడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మూడో పంటకు కాదు కదా, రెండో పంట నాటేసి మూడు నెలలైనా ఇంతవరకు రైతుబంధు వెయ్యలే’ అని మండిపడ్డారు. ‘ఆనాడు ఎన్నికల ముందు నవంబర్‌లో తీసుకుంటే రైతు బంధు రూ. పదివేలు వస్తది.. డిసెంబర్లో మేం అధికారంలోకి రాగానే 15 వేలు ఇస్తమని రేవంత్‌రెడ్డి చెప్పిండు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఇందిరాగాంధీ, చివరికి దేవుండ్ల మీద కూడా ఒట్లుపెట్టి డబ్బాలో ఓట్లు వేయించుకొని పత్తాలేకుండా పోయిండు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేస్తానని ఫిబ్రవరిలో రేవంత్ చెప్పిండు. ఎన్నికలై నెల రోజులైనా ఎందుకు వేయలేదు?’ అని తూర్పారబట్టారు. పంట పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, బోనస్ లేదు, రుణమాఫీ లేదని, ఈ నాయకులకు సిగ్గు కూడా లేదని దుయ్యబట్టారు. ‘ఇంకా సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నడు. ‘నేను రుణమాఫీ చేసిన అనుకుంటున్నా, రైతు బంధు వేసిన అనుకుంటున్నా.. పడ్డదో లేదో నాకు తెల్వది’ అంటున్నడు. మరి నువ్వెందుకున్నట్టు?’ అని నిలదీశారు. ‘ముఖ్యమంత్రి అయిన నీకే తెలియకుంటే ఎవరికి తెలుస్తయ్?’ అని ప్రశ్నించారు. ‘నీలా ఢిల్లీకి కప్పం కట్టే శక్తి, దోపిడీ చేసే శక్తి మీ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి నీకే ఉన్న ది. ఆ దోపిడీ చేసే ఆర్ట్ నీకే ఉన్నది.. నీ సీటు మంచిగనే ఉంటది. ఇకనైనా రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై దృష్టి పెట్టు’ అని హితవుపలికారు.

ఖమ్మంలోని వెలుగుమట్లలో పన్నెండేండ్ల కిందట పైసా పైసా కూడగట్టుకొని పేదలు కట్టుకున్న వెయ్యి ఇండ్లను సీఎం రేవంత్‌రెడ్డి రాత్రికి రాత్రే 3 వేల మంది పోలీసులను, బుల్డోజర్లను పెట్టి కూల్చేశాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శత్రుదేశంపై దండెత్తినట్టు వేల మంది పోలీసులతో వెయ్యి ఇండ్లపైకి బుల్డోజర్లతో దండెత్తి నేలమట్టం చేశాడని, ఒక్క బాంబు వేస్తే ఏ విధంగా విధ్వంసం జరుగుతదో అలానే ఆ ప్రాంతాన్ని ఛిన్నాభిన్నం చేసి పేదలను రోడ్డున పడేశాడని నిప్పులు చెరిగారు. ‘ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్‌నగర్‌లో దివ్యాంగులు కట్టుకున్న 150కి పైగా ఇండ్లను కూడా రేవంత్‌రెడ్డి కూలగొట్టిండు. ఇంకా సిగ్గులేకుండా బఫర్‌జోన్ అంటూ ‘చెరువులో ఉన్న బిల్డింగ్‌లను బ్లాక్ చేశాను.. వాటి రిజిస్ట్రేషన్లు బంద్ చేశాను.. వాటి విలువ ఇప్పుడు జీరో అయ్యింది’ అని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. జీరో వ్యాల్యూ అయ్యింది బిల్డింగ్‌లకు, అపార్ట్మెంట్లకు కాదు. ముఖ్యమంత్రి మాటకు. ముఖానికి జీరో వ్యాల్యూ అయింది’ అంటూ ఎద్దేవాచేశారు. ‘హైదరాబాద్‌లో దోమలు బాగా పెరిగినయ్ అంటున్నవు కదా.. మున్సిపల్ మంత్రివి నువ్వే కదా.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఇది మాట్లాడవచ్చునా? నీ నోట్లో నుంచి వచ్చే ఒక్క మాటకైనా విలువ ఉన్నదా?’ అని నిలదీశారు.
‘ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూలగొట్టుడా? గరీబోని మెడలుపట్టి నూకుడేనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘బఫర్ జోన్లో ఉన్న మీ ఇండ్లను ఎవరూ ముట్టుకోరు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి గ్రామంలో ఇల్లు కట్టుకున్నడు. అయన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది. చెరువు లోపల్నే కట్టుకున్నడు. ఆయన ఇల్లు కూలగొట్టొద్దు. ముఖ్యమంత్రి కదా అధికారులు ఎవరూ ముట్టకోరు. ముట్టుకుంటే ఉద్యోగాలు ఊడిపోతయి. ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి హైదరాబాద్ దుర్గం చెరువులో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని ముట్టరు. బఫర్ జోన్, శిఖం అనేది వీళ్లకు వర్తించదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు కూడా శిఖంలోనే ఉన్నది. ఉస్మాన్‌సాగర్‌లో కట్టుకున్నడు. మంత్రి వివేక్ ఇల్లు కూడా శిఖంలోనే ఉన్నది. ఆ ఇంటిని కూడా ఎవరూ ముట్టరు. పట్నం మహేందర్‌రెడ్డి చెరువు మధ్యలో కట్టిన గెస్ట్‌హౌస్‌ను కూడా ఎవరూ ముట్టరు. కానీ, గరీబోని ఇల్లు కొద్దిగా అటు ఇటు ఉన్నా బుల్డోజర్తో కూల్చేస్తరు. ‘ఎవనికి చెప్పుకుంటవో చెప్పుకోపో’ అని మెడలుపట్టి నూకుతరు’ అని దుయ్యబట్టారు. ప్రజలు ఇవన్నీ ఆలోచించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ హితవు పలికారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి, ఏడాదికి రూ.25 వేల కోట్లు బడ్జెట్లో పెడుతానని చెప్పారని, ఈ మూడో బడ్జెట్లోనైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లోనైనా రూ.25 వేల కోట్ల బడ్జెట్ పెడుతరా? లేదా? అని బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ‘దళితబంధు పేరిట కేసీఆర్ హయాంలో రూ. పది లక్షలిస్తే, అవేం సరిపోతయి.. మేము అంబేద్కర్ అభయహస్తం పేరిట రూ.12 లక్షలు ఇస్తమని చెప్పి 12 పైసలు కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. రాష్ట్రం లో దళిత, గిరిజన బిడ్డలు అంబేద్కర్ అభయహస్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ హామీలేవీ అమలు చేయడం లేదని విమర్శించారు. ‘రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవు. మీరు చెప్పిన హామీలన్నీ బడ్జెట్లో పెట్టి ఇప్పటికైనా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
‘ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. కేసీఆర్ ఎప్పుడు వస్తరు? ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతరు? మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తయి? అని ప్రతి రైతూ ఎదురుచూస్తున్నాడు’ అని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికీ మళ్లీ కేసీఆర్ రావాలనే మాట అర్థమైందని, అలా అర్థమైనవాళ్లంతా తమతో కలిసి రావాలని, ఈ దుర్మార్గ, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నిలదీద్దామని, కలిసికట్టుగా కొట్లాడుదామని పిలుపునిచ్చారు. రాబోయే సంవత్సరం, ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వానికి ఊపిరి సలుపకుండా చేద్దామని, కార్యాచరణ రూపొందించి సర్కార్ మెడలు వంచే దిశగా ముందుకు పోదామని చెప్పారు. కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వెయ్యి రోజులకైనా ఒక్క హామీ అమలు చేసిండా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క ఫ్రీ బస్ అమలు చేసిండని, దాని కథ ప్రజలకు తెలిసిందేనని చెప్పారు. ఆడోళ్లకు ఫ్రీ ఇచ్చి మొగోళ్లకు డబుల్ చార్జీలు వేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు గతంలో సీటు ఇచ్చి గౌరవించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఫ్రీబస్కు తాము వ్యతిరేకం కాదని, ఈ రకంగా ప్రజలను మోసం చేయడం సరికాదని హితవు పలికారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి 25 నెలలైనా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కోడళ్లకు రూ.2500, అత్తకు రూ.4 వేలు.. ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికీ కలిపి రూ.8 వేలు పింఛన్ ఇస్తా అని చెప్పి ఒక్కరికైనా ఇచ్చాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 19 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పైసలిస్తలేడని తెలిపారు. యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని, విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల కెడ్రిట్ కార్డు ఇస్తామని, చదువుకుంటున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్తే అందరూ నమ్మారని, నమ్మినందుకు ప్రజలను నిండా ముంచారని మండిపడ్డారు. ‘అర్థిక కష్టాలు ఉన్నాయని చెప్తూనే మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె పెట్టుకున్న చందంగా లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయాలని ఎవరు అడిగారు’ అని నిలదీశారు.
ఆరు గ్యారెంటీలకు మొట్టమొదటి క్యాబినెట్లో చట్ట భద్రత కల్పిస్తామని, చట్టం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండు. ఇప్పటి వరకు చట్టం లేదు.. చట్టబద్ధత కల్పించేలా వచ్చే శాసనసభ సమావేశాల్లో మేమే ప్రైవేట్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచుతం. రాహూల్‌గాంధీ చెప్పిండు కాబట్టి కాంగ్రెసోళ్లు ఆ బిల్లుకు ఓటు వేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రజల చేతుల్లో తన్నులు తినాల్సి ఉంటుంది.
– కేటీఆర్
ఆడబిడ్డ పెండ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే దాని మీదికెళ్లి తులం బంగారమిస్త్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిండు. మేము ఆ రోజే చెప్పినం. వీళ్లు బంగారం ఇచ్చేటోళ్లు కాదు, మెడలో పుస్తెలతాడు తాడు ఎత్తుకపోయే దొంగలు.. వాళ్లను నమ్మవద్దని చెప్పినం. ఇప్పటి వరకు తులం బంగారం కాదు కదా ఇనుప ముక్క కూడా ఇయ్యలే..
– కేటీఆర్