Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మంది మరణించారు. వీరిలో చారియదేవ్లో ఏడుగురు, శివసాగర్‌లో ఆరుగురు, జోర్హాట్లో ఒకరు ఉన్నారు. దీంతో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 66కు చేరినట్లు అధికారులు తెలిపారు.
బ్రహ్మపుత్ర నదితో పాటు దిఖౌ, దిసాంగ్, ధన్సిరి వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి పైగా ప్రవహిస్తూనే ఉండటంతో అప్పర్ అసోంలో వరద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇంకా వదరు ముంపులో 6.55 లక్షల మంది ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వరద పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అవసరమైతే కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు.