Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల సందర్భంగా అప్పుడు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాలికి గాయం కావడంతో వీల్చైర్పైనుంచే మమత ప్రచారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఈ అంశంపై బెంగాల్ తాజా సీఎం సువేందు అధికారి స్పందించారు. మమత కాలికి గాయం కావడం అబద్ధం అని, అదొక తప్పుడు ప్రచారం అని ఆరోపించారు. దీనిపై శనివారం విచారణకు ఆదేశించారు. 2021లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అప్పుడు నందిగ్రామ్ నియోజకవర్గంలోని బిరులియాలోని రేయపార ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను తోసేశారని, ఈ ఘటనలో కారు డోర్‌కు తగలడం వల్ల తన కాలికి గాయమైందని మమత అన్నారు. అనంతరం ఆమె ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమె కాలి ఎముక, మోకాలికి గాయమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అప్పటినుంచి మమత వీల్‌చైర్‌లోనే ప్రచారం నిర్వహించారు. దీంతో మమతా బెనర్జీపై సానుభూతి వెల్లువెత్తింది.
ఈ ఎన్నికల్లో మమత బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ 210 సీట్లతో ఘన విజయం సాధించింది. మూడోసారి మమత అధికారం దక్కించుకుంది. బీజేపీకి 77 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ఈ సమయంలో మమత కాలికి గాయం కాలేదని, సానుభూతి కోసమే అలా చేసిందని సీఎం సువేందు అధికారి ఆరోపించారు. ఆమె కాలు విరిగినట్లు లేదా ఎముకకు గాయమైనట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మమత తన కాలి గాయంపై తప్పుడు ప్రచారంతో లబ్ధిపొంది, జనాన్ని మోసం చేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం అయిన నందిగ్రాం ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అందువల్ల ఈ అంశంపై ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలమేని సీఎం అన్నారు. అయితే, సీఎం సువేందు చేసిన ఆరోపణలను టీఎంసీ ఖండించింది. మమత కాలికి గాయం కాలేదని సీఎం ఎలా చెబుతారని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు.