పాలకవీడు,మార్చి 9 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో గల డెక్కన్ సిమెం ట్స్ పరిశ్రమలో అటవీ భూముల ఆక్రమణపై కేంద్ర సాధికారత కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఫారెస్ట్ అధికారి సతీశ్‌కుమార్ సోమవారం పరిశ్రమ, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఫ్యాక్టరీపై ఫిర్యాదు చేసిన పసుపులేటి సురేశ్ సమక్షంలో జిల్లా అటవీశాఖ అధికారులు తనిఖీలో పాల్గొన్నారు. ఈ తనిఖీలకు స్థానిక మీడియాను అనుమతించలేదు. డెక్కన్ ఫ్యాక్టరీ అవకతవకలపై జిల్లా ఫారెస్ట్ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపారని ఫిర్యాదుదారు పసుపులేటి సురేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. విచారణ అనంతరం ఫ్యాక్టరీ ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డెక్కన్ ఫ్యాక్టరీ అటవీ భూములను ఆక్రమించిందని తాను కేంద్ర సాధికారత కమిటీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు విచారణ జరిగిందని తెలిపారు. ఆక్రమణను పట్టించుకోవడంలేదని అటవీశాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తే వారితోనే విచారణ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఫ్యాక్టరీకి ప్రభుత్వం కేటాయించిన రెవెన్యూ, అటవీ భూములకు అధికారులు ఎలాంటి హద్దులు నిర్ధారించలేదని తెలిపారు.