ఆఫీసు టెన్షన్లు, ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? లోలోపల ఏదో తెలియని ఆందోళన, ఆవేశం పొంగి వస్తున్నాయా? సాధారణంగా అయితే మనం ఆ కోపాన్ని అణచుకుంటాం, లేదా ఎవరి మీదో చూపిస్తాం. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘స్క్రీమ్ క్లబ్స్’ (Scream Clubs). అందరూ ఒకచోట చేరి.. ఆకాశం వైపు చూస్తూ.. ఊపిరి బిగబట్టి.. గట్టిగా అరవడమే ఈ క్లబ్ పని. మీరు నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా చూశారా? అందులో నాని రైల్వే స్టేషన్లో రైలు స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు అరుస్తాడు చూశారా? ఇంచుమించు అలాంటిదే ఈ ‘స్క్రీమ్ క్లబ్స్’ అప్రోచ్ కూడా. వినడానికి వింతగా ఉన్నా, ఇది మానసిక ప్రశాంతతకు ఒక అద్భుత మైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.
మన సంస్కృతిలో ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడాన్ని ఒక నిలకడైన అలవాటుగా చూస్తాం! కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా ‘శాంతంగా ఉండాలి’ అని చెబుతాం. కానీ ఈ ఎమోషన్స్‌ని లోపల దాచుకుంటే.. అవి యాైంగ్జెటీ, డిప్రెషన్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌గా మారతాయి! అందుకే స్క్రీమ్ క్లబ్స్‌లో జరుగుతున్నది ఏంటంటే.. అందరూ కలిసి ఓ సేఫ్ స్పేస్‌లో ఏ జడ్జ్మెంట్ లేకుండా.. ఆ ఎమోషన్స్‌ని రిలీజ్ చేసుకుంటారు! లోపల పేరుకుపోయిన ఫ్రస్ట్రేషన్‌ను బయటికి పంపడానికి స్వేచ్ఛగా గొంతెత్తి అరిచే ‘అరుపు’ ఒక వాల్వ్‌లా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు చాలామంది ఒంటరిగా కాకుండా, ఒక గ్రూపుగా ఏర్పడి ఇలా చేస్తున్నారు. ఇలా నలుగురితో కలిసి అరవడం వల్ల ‘నేను ఒక్కడినే కాదు, నాలాగే అందరికీ ఒత్తిడి ఉంది’ అనే ఓ ‘కమ్యూనిటీ సపోర్ట్’ భావన కలుగుతుంది. మౌనం కొన్నిసార్లు భారం కావచ్చు.. అరుపు ఆ భారాన్ని దించే ఆయుధంగా మారొచ్చు.
స్క్రీమ్ క్లబ్స్‌ని కేవలం కమ్యూనిటీలా చూడొద్దు. వీటి వెనక కొన్ని సీరియస్ సొసైటల్ రియాలిటీస్ ఉన్నాయి. కొవిడ్ ఉత్పాతం తర్వాత మనం అందరం కొన్ని సంవత్సరాలుగా అనిశ్చితి, భయం, ఐసోలేషన్ ఎదుర్కొంటున్నాం. ఆ ఎమోషన్స్ ఇంకా మనలోనే ఉన్నాయి.. పూర్తిగా ప్రాసెస్ అవ్వలేదు. రోజువారీ పనులు, పర్ఫెక్ట్ ప్రొడక్టివిటీ.. లాంటి బర్న్ అవుట్ కల్చర్‌తో ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో విశ్రాంతి తీసుకోవడానికి కూడా టైమ్ లేదనే గిల్ట్ ఫీలింగ్! మరోవైపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ‘పర్ఫెక్ట్ లైఫ్’ ప్రెజెంట్ చేయాల్సిన సోషల్ మీడియా ప్రెషర్ ఎక్కువైంది. దీంతో ఎమోషన్స్ ఉన్నా.. బయట ‘హ్యాపీ’గా కనిపించాలి! ఇంకా మన సొసైటీలో థెరపీ తీసుకోవడం అంటే మన వంక వింతగా చూస్తుంటారు.
ఈ నేపథ్యంలో అరవడం ద్వారా ఒత్తిడి రిలీజ్ చేసుకోవడం మరింత సులభంగా మారింది! ‘స్క్రీమ్ క్లబ్స్ పాపులర్ అవ్వడం అంటే.. మనం అందరం ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా లేమని అర్థం! ఇదో వార్నింగ్ సిగ్నల్!! ఇది అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని పేరెంట్స్, ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. అరవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది కానీ, ఒత్తిడికి కారణమైన అసలు సమస్య అలాగే ఉంటుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి థెరపీ లేదా కౌన్సెలింగ్ అవసరమని మరోవైపు సైకాలజిస్ట్‌లు చెబుతున్న మాట.
మన దగ్గర స్క్రీమ్ క్లబ్స్ లేకపోయినా.. ఒకవేళ ఉండి వెళ్లలేకపోయినా.. ఇంకా చాలా మార్గాల్లో మన ఎమోషన్స్‌ని హెల్తీగా రిలీజ్ చేసుకోవచ్చు. వ్యాయామం, యోగా, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ సాధన చేయొచ్చు. ఇవన్నీ ఎమోషనల్ రిలీజ్‌కి గ్రేట్ ఔట్లెట్స్! శరీరం కదిలినప్పుడు.. మనసుపై ఒత్తిడికి కూడా రిలీఫ్ ఇస్తుంది. రాయడం, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్ ప్లే చేయడం లాంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎమోషన్స్‌ని బయటపెట్టవచ్చు.
మెడిటేషన్, బ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్స్ లాంటి మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసుల ద్వారా ఎమోషన్స్‌ని గమనించొచ్చు. వాటిలో చిక్కుకోకుండా ఉండటం నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఓపెన్‌గా మాట్లాడటం.. సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేయడం చాలా ముఖ్యం. ‘నేను బాగా లేను’ అని చెప్పడం బలహీనత కాదు.. ధైర్యం! థెరపీ, కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవడం.. సిగ్గుతో చేయాల్సిన విషయాలు కాదు! మీ ఫిజికల్ హెల్త్ లాగే.. మీ మెంటల్ హెల్త్ కూడా ముఖ్యం అనే విషయాన్ని మరిపోవద్దు.
ప్రైవసీ ప్లేస్: ఒకవేళ క్లబ్స్ అందుబాటులో లేకపోతే, కారులో కూర్చుని అద్దాలు మూసేసి గట్టిగా
అరవొచ్చు.
దిండు సాయం: ఇంట్లో అయితే ముఖానికి దిండు అడ్డు పెట్టుకుని అరవడం వల్ల శబ్దం బయటికి రాదు.. మీకూ ఉపశమనం దొరుకుతుంది.
బ్రీథింగ్: అరిచిన తర్వాత కచ్చితంగా ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
‘స్క్రీమ్ క్లబ్స్’ అనేవి మనం ఎంతటి ఒత్తిడితో కూడిన సమాజంలో బతుకుతున్నామో చెప్పడానికి ఒక నిదర్శనం. భావోద్వేగాలను దాచుకోకుండా ఏదో ఒక రూపంలో బయటికి పంపడం ఆరోగ్యకరం. అయితే, అరుపు ఒక్కటే మార్గం కాదు.. యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి కూడా అంతే ముఖ్యం. ఏది ఏమైనా.. మనసులోని భారాన్ని మోస్తూ కుంగిపోయే కంటే, ఒక్కసారి గట్టిగా అరిచి దాన్ని వదిలేయడం మేలే కదా!