రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మాడ్గుల మండలంలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో మండలంలోని పలు చెరువుల్లో శిఖం పట్టాలను కొనుగోలు వాటి ఉనికినే కనుమరుగు చేస్తున్నది. చెరువులకు నీరొచ్చే ప్రధాన కాల్వలను మూసేయడంతోపాటు తూములనూ ధ్వంసం చేస్తున్నది. మరోవైపు అలుగులనూ ఎక్కడికక్కడ తవ్వి చెరువుల్లోకి నీరు రాకుండా అడ్డు పడుతున్నది. మాడ్గుల మండలం గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉండగా.. జిల్లాల పునర్విభజన తర్వాత రంగారెడ్డి జిల్లాలో కలిసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారులు మండల అధికార పార్టీ నాయకుల అండదండలతో చెరువులను లక్ష్యంగా చేసుకుని.. చెరువుల్లోని శిఖం పట్టాలను కొనుగోలు చేసి నడి చెరువుల్లో హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన చెరువుల అలుగులు, తూములు, కట్టలు ధ్వంసమవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాడ్గుల మండలంలో రియల్ మాఫియా చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నది. గిరికొత్తపల్లి గ్రామంలోని రంగసముద్రం, తుమ్మలకుంట చెరువుల అలుగులు, తూములను ధ్వంసం చేయటమే కాకుండా చెరువు మధ్యలో ఉన్న శిఖం భూములను కొని అక్కడ మట్టి తో నింపేస్తున్నారని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ చెరువులను కాపాడాలంటూ గ్రామానికి చెందిన కొందరు ఆందోళనకు దిగగా..రియల్ వ్యాపారులు ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదటమే కాకుండా అతడిపైనే పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టించినట్టు సమాచారం. అలాగే, నాగిళ్ల, ఇర్విన్, అన్నెబోయినపల్లి గ్రామాల్లోనూ చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపణలున్నాయి.
మాడ్గుల మండలంలో కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులు, కుంటల్లోని శిఖం పట్టాలను కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిలోకి నీరు రాకుండా తూములను ధ్వంసం చేసి.. చెరువులను మట్టితో పూడ్చివేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు అటువైపు వెళ్లడంలేదని ఆరోపణలున్నాయి.
మాడ్గుల మండలం, అప్పారెడ్డిపల్లిలోని కొత్తచెరువు కబ్జాకు గురవుతున్నదని.. దానిని రియల్టర్ల చెర నుంచి కాపాడాలని గురువారం పలువురు రైతులు, రైతుసంఘం నాయకులు మాడ్గుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా రు. ఈ చెరువు కొన్నేండ్లుగా స్థానికులకు తాగునీటితోపాటు సాగునీటిని అందించిందన్నారు. కొందరు ఈ చెరువును కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని, ఇప్పటికే చెరువు తూము, అలుగును ధ్వంసం చేశారని ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని ధర్నాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రియల్టర్లపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
అప్పారెడ్డిపల్లిలోని కొత్తచెరువు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదు. ఇప్పటికే రియల్టర్లు చెరువు శిఖం పట్టాలను కొనుగోలుచేసి తూములు, అలుగులను ధ్వంసం చేశారు. మరోవైపు చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వలను మూసేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.