Sampoornesh babu | నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై హైప్‌ను పెంచగా, తాజాగా చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర గురించి దర్శకుడు సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి రాజేష్ మాట్లాడుతూ, ‘ది ప్యారడైజ్’ సినిమాలో సంపూర్ణేష్ బాబు కోసం ప్రత్యేకంగా ఓ మంచి పాత్ర రాయాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను తానే కోరినట్లు వెల్లడించారు.
సంపూర్ణేష్ బాబు కోసం మంచి క్యారెక్టర్ రాయమని నేను శ్రీకాంత్‌ను రిక్వెస్ట్ చేశాను. హీరోగా చేసిన తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయరని చాలామంది అనుకున్నారు. కానీ సంపూ మాత్రం మంచి పాత్ర అయితే ఏదైనా చేస్తానని నిర్ణయించుకున్నాడు. నేను చెప్పిన తర్వాత శ్రీకాంత్ అతనికి అద్భుతమైన పాత్రను రూపొందించాడు. ఈ సినిమా పూర్తయ్యాక సంపూర్ణేష్ బాబుతో మరో కథ కూడా చేయాలని అనుకుంటున్నాను అని సాయి రాజేష్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. కథలో హీరోకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఆయన పాత్ర సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో సంపూర్ణేష్ బాబు పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భుజంపై భారీ కత్తి, చేతిలో బీడీ, నుదుటిపై పచ్చబొట్టు, గుబురు జుట్టు, కోర మీసంతో మాస్ అవతారంలో కనిపించిన ఆయన లుక్కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దర్శకుడు సాయి రాజేష్, సంపూర్ణేష్ బాబు అనుబంధం కొత్తది కాదు. ‘హృదయం కాలేయం’ సినిమాతో సంపూర్ణేష్ బాబును హీరోగా పరిచయం చేసిన వ్యక్తి కూడా సాయి రాజేష్‌నే. 2014లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ కామెడీగా గుర్తింపు పొందింది. ఆ సమయంలో సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయనను కొత్త తరహాలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, దర్శకుడు కూడా తన పేరును స్టీవెన్ శంకర్‌గా ప్రచారం చేశారు. సినిమా విడుదలైన కొంతకాలం తర్వాత ఇద్దరూ తమ అసలు పేర్లను వెల్లడించారు. అనంతరం వీరి కాంబినేషన్లో వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కూడా ప్రేక్షకులను అలరించింది.