సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) దడ పుట్టిస్తున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటైతే.. అందులో నుంచి వెలువడే విషవాయువులు, రసాయనాలతో గాలి, నీరు కలుషితం కావడంతోపాటు ఆరోగ్యాలకూ ముప్పు ఉన్నది. పచ్చని పంట పొలాలు శాశ్వతంగా బీడు భూములు మారే ప్రమాదమున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే హుజూరాబాద్‌కు ఉరి బిగిసే ముప్పు ఉండగా, ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డును వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే పట్టణంలో దీక్ష చేస్తుండగా, అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం డంప్‌యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో గురువారం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డంప్‌యార్డు స్థలాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం హుజూరాబాద్‌తోపాటు మండలం మొత్తం బంద్‌కు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్, ఏప్రిల్ 2 : హుజూరాబాద్ మండలం సిర్సపల్లి పరిధిలోని 265, 496 సర్వే నంబర్లలోని 25 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పనులను ముమ్మరం చేసింది. వరంగల్, కరీంనగర్ రెండు కార్పొరేషన్లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, చొప్పదండి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల చెత్తను ఈ డంప్ యార్డ్కే తరలించనున్నారు. దాదాపు 7 లక్షల కుటుంబాల నుంచి వచ్చే చెత్తనంతా సేకరించి తెచ్చి, కుప్పలు కుప్పలుగా నిల్వ చేయనున్నారు. ఆ వ్యర్థ పదార్థాలు కుళ్లి, దాని నుంచి వెలువడే హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు గాలిలో కలిసి మనుషులతోపాటు పశుపక్ష్యాధులకు రోగాల వచ్చే ముప్పు ఉన్నది. రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల సేకరించే చెత్త నిత్యం 800 టన్నుల అంచనా కాగా, ఈ మొత్తాన్ని ఇక్కడే నిల్వ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ గతేడాది మే 27న నోటీసులు జారీ చేసింది.
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం డంప్‌యార్డును 25 ఎకరాలో నెలకొల్పుతుండగా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం 250 ఎకరాలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఈ వాయువుల ప్రభావం 25 కిలోమీటర్ల వరకు ఉండే ప్రమాదముంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే హుజూరాబాద్ మండలంతోపాటు కేశవపట్నం, ఎలతుర్తి, కమలాపూర్, జమ్మికుంట, సైదాపూర్ మండలాల్లోని అనేక గ్రామాలపై ప్రభావం పడే ముప్పు ఉంటుంది. వేస్ట్ టూ ఎనర్జీతో ఉత్పన్నమయ్యే వాయువులను పీల్చడం ద్వారా ఆయా మండలాల ప్రజలు శ్వాస కోశ సమస్యలు, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుంది. హైదరాబాద్ సమీపంలోని జవహర్‌నగర్‌లో నెలకొల్పిన ఇదే రకం ప్లాంటుతో అక్కడి ప్రజలకు వింత వ్యాధులు వస్తున్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిని ఎత్తివేయాలని కొద్ది రోజులుగా ఆందోళనలు కూడా చేస్తున్నారు.
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌తో అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు వెలువడుతాయి. విద్యదుత్పత్తి కోసం ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను కాల్చినప్పుడు డయాక్సిన్, ప్యూరాన్లు విడుదలవుతాయి. అవి రక్తం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లో చేరి క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. అంతే కాకుండా పునరుత్పత్తి సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతే కాకుండా రోగ కారకాలైన ఈగలు, దోమలు విజృంభిస్తాయి. ఎలుకలు, పందులు, కుకలు ఆవాసం ఏర్పరచుకొని స్వైరవిహారం చేస్తాయి. కలరా, డెంగీ, టైఫాయిడ్, మెదడువాపు, మలేరియా వంటి రోగాలు ప్రబలుతాయి. పొగ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి సీసం, కాడ్మియం, పాదరసం, లిథియం వంటి లోహాలు.. అమ్మోనియా, మీథేన్ వంటి విషవాయువులు, రసాయనాల ప్రభావం వల్ల భూములు విషతౌల్యమవుతాయి. ఆ భూముల్లో పండించిన ఉత్పత్తుల్లో చేరిపోయి, ఆ ఆహార పదార్థాలను మనం తినడం వల్ల మనలో చేరుతాయి. వర్షాలు పడినప్పుడు డంప్‌యార్డ్ వద్ద నీరు భూమిలో ఇంకడంతో భూగర్భజలాలు కలుషితంగా మారుతాయి. ఆ నీటిని తాగే మూగజీవులు మృత్యువాత పడడంతోపాటు పచ్చని పొలాలు నిస్సారంగా మారనున్నాయి.
డంప్‌యార్డు వ్యతిరేకంగా హుజూరాబాద్ ప్రాంత ప్రజలు ఏకమవుతున్నారు. ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. ఇటు హుజూరాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని 20 గ్రామ పంచాయితీలల్లో డంప్ యార్డు వద్దని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. పార్టీలకతీతంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సర్సంచులు, ఉప సర్పంచులు తీర్మానంలో పాల్గొన్నారు. గత నెల 23వ తేదీ నుంచి అఖిల పక్ష కమిటీ కో ఆర్డినేటర్ పల్కల ఈశ్వర్‌రెడ్డి ఆద్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. సిర్సపల్లితో సహా సింగాపూర్, తుమ్మనపల్లి తదితర గ్రామాల ప్రజలు నిరసన దీక్షలో భాగస్వామ్యులు అవుతున్నారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు కూడా మద్దతు ఇవ్వడంతోపాటు దీక్షలో కూర్చుంటున్నారు. వేలాది మంది విద్యార్థులతో చౌరస్తా వద్ద మానవహారం చేపట్టి డంప్‌యార్డు నిర్మాణం చేపట్టవద్దంటూ నినదించారు.
హుజురాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : తాను బతికుండగా డంప్‌యార్డ్‌ను పెట్టనిచ్చే ప్రసక్తే లేదని, రద్దు చేసేందుకు ఎంతవరకైనా వెళ్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో గళం వినిపించానని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డంప్‌యార్డు రద్దకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, శుక్రవారం హుజూరాబాద్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్తక, వాణిజ్యా రంగాలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డంప్‌యార్డ్ ఎత్తివేత ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఈ నెల 7 నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు నిరసన దీక్షలో కూర్చుంటానని తెలిపారు. హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా డంప్‌యార్డ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన అనుమతి పత్రాలను మీడియా ముందు ఆయన చూపెట్టారు. అనంతరం మాట్లాడారు.
డంప్ యార్డ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఇది ప్రజల జీవిత సమస్య అని, ఇకడ డంప్ యార్డ్ ఏర్పాటైతే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని, హుజూరాబాద్‌తోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని వాపోయారు. ప్రజలు ముక్తకంఠంతో డంప్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని అన్నారు. డంప్ యార్డ్ వద్దని అసెంబ్లీలో గళం వినిపించానని, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని దండం పెట్టి చెప్పానని గుర్తు చేశారు. తనపై కోపం ఉంటే తనపై చూపాలని, కానీ, నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేశారు. రద్దుపై తాను ముఖ్యమంత్రితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు లేఖలు రాశానని చెప్పారు. ఆయన వెంట కౌన్సిలర్లు రవీందర్రావు, గందె శ్రీనివాస్, నాయకులు ఎడ్ల విజయ్‌కుమార్, కెసిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎనర్జీ ప్లాంట్ నుంచి వెలువడే విషవాయువులతో మానవజాతి మనుగడకే ప్రమాదం ఉంటుంది. సమీప ప్రాంతంలో గాలి, నీరు కాలుష్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలోనే సీడ్ హబ్‌గా పేరుగాంచిన హుజూరాబాద్‌లో చెత్తతో తయారు చేసే విద్యుత్ ప్లాంటు నిర్మాణంతో కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది. వ్యవసాయం కూడా దెబ్బతింటుంది. వేలాది మంది రైతులు, ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఈ నిర్మాణాన్ని నిలిపి వేసి వేల ఎకరాల్లో సాగులో ఉన్న పంట భూములను కాపాడాలి. ప్రజలు, రైతులు చైతన్యం కావాలి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ఉద్యమించాలి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39సి, 42, 47 ప్రకారం ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే హకును పొందుపరచింది. కానీ, ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. పట్టణాల కంపునంతా తెచ్చి, పల్లెలపై కుమ్మరించడం హకుల ఉల్లంఘనే అవుతుంది. తొమ్మిది పట్టణాల నుంచి నిరంతరం డంప్ యార్డుకు చేరే వ్యర్థాలతో చుట్ట పక్కల గ్రామాల్లోని ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నది. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే హకును హరిస్తామనడం ప్రభుత్వాలకు న్యాయం కాదు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి చెత్త ప్లాంటును రద్దు చేయాలి.