Tamil Nadu : తమిళనాడులోని ఒక గ్రామంలో ఎల్పీజీ సిలిండర్ పేలడంతో 10 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఒక ఇంట్లో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లోని సిలిండర్ పేలింది. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా, తిరువోనం సమీపంలోని చిన్న అమ్మన్కూడి వద్ద గురువారం అర్ధరాత్రి 02.00 గంటలకు జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన మురుగాయన్ అనే రైతుకు చెందిన పూరి గుడిసెకు నిప్పు అంటుకుంది. ఈ సమయంలో ఆ గుడిసెలాంటి ఇంట్లోనే కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు.
అయితే, ఈ పూరి గుడిసెకు నిప్పంటుకోవడంతో బయటినుంచి స్థానికులు గమనించి ముందుగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపారు. మంటలు అంటుకున్న ఇంట్లోంచి వారిని, అందరూ కలిసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ ఇంట్లో మంటలను ఆర్పేందుకు చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించారు. బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, మంటలతో నిండిన ఆ ఇంట్లో ఒక ఎల్పీజీ సిలిండర్ ఉంది. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పుతున్న సమయంలో లోపల ఉన్న సిలిండర్ ఉన్నట్లుండి పేలింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు వారిని తంజావూరులోని మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
గాయపడ్డవారిలో 15 ఏళ్ల అభినయ అనే ఒక బాలిక కూడా ఉంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండగా.. మొత్తం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు ఒళ్లంతా కాలిన గాయాలయ్యాయి. కొందరికి చాలా వరకు శరీరం కాలిపోయింది. వీరికి ఐసీయూలో చికిత్స అందుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్పత్రి వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.