Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా నటుడు ధనుష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల తన 43వ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్, తన చిన్ననాటి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. కొందరు అభిమానులు ఆయన నిజాయితీని మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇదే తరహా భావోద్వేగ కథలను పదేపదే చెబుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడిన ధనుష్.. జూలై 28 అనేది తనకు ఇప్పుడు ప్రత్యేకమైన రోజు అయినప్పటికీ, చిన్నప్పుడు మాత్రం తన పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదని చెప్పారు. నాలుగో తరగతి వరకు తన జన్మదినం గురించి తనకు అవగాహన లేదని, ఒకసారి స్కూల్లో ఇతర విద్యార్థులు రంగురంగుల దుస్తులు వేసుకుని చాక్లెట్లు పంచుతుండటం చూసి తానూ అలానే చేయాలనిపించిందని వివరించారు.అప్పుడు తన అక్కను అడగగా, ఆమె తల్లిదండ్రులను అడిగి జూలై 28 తన పుట్టినరోజు అని చెప్పిందని తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక కలర్ డ్రెస్, కొన్ని చాక్లెట్లు కొనిపించమని ఇంట్లో ఒప్పించి స్కూల్‌కు తీసుకెళ్లి పంచానని ధనుష్ చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో దీపావళి, పొంగల్ వంటి పండుగలకు మాత్రమే కొత్త బట్టలు కొనేవారని, అలాంటి పరిస్థితుల్లో చిన్న కోరిక కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపించేదని పేర్కొన్నారు.
ధనుష్ వ్యాఖ్యలపై నెటిజన్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. ‘ఇడ్లీ కడై’ సినిమా ప్రమోషన్ల సమయంలో తాము చిన్నప్పుడు ఇడ్లీ కొనడానికి కూడా డబ్బులు లేక పువ్వులు అమ్మేవాళ్లమని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు మరోసారి పేదరికం గురించి మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సినిమా ప్రమోషన్‌కి ఒక కొత్త ఎమోషనల్ స్టోరీ చెప్పడం అవసరమా?, ప్రేక్షకుల సానుభూతి కోసం ఇలాంటి కథలు చెబుతున్నారా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడైన ధనుష్ తరచూ పేదరికం గురించి మాట్లాడటంపై కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.