Mayookha | పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మయూఖ’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశిధర్ నల్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. అక్టోబర్ 9న తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఓ షాకింగ్ సన్నివేశాన్ని చూపించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేలాడదీశారని కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుంటారు. చెత్తను పడేసే నల్లటి కవర్లలో మనిషి శరీర భాగాలు కనిపించడంతో కేసు మరింత సీరియస్‌గా మారుతుంది.
ఆ తర్వాత పాయల్ చెంగప్ప పాత్రను పరిచయం చేశారు. ఆమె ఇంటి తలుపులను ఎవరో పదేపదే కొడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. గతంలోనూ ఇదే విధంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తారు. అయితే తలుపు కొట్టారు తప్ప ఇంట్లోకి ఎవరూ రాలేదని పోలీసులు చెబుతారు. దీనికి పాయల్ మాత్రం తాను ఓ అమ్మాయి మనిషి శరీరాన్ని ముక్కలుగా కోయడం చూశానని చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. పాయల్ చూసిన అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే మనుషులను చంపి ముక్కలుగా కోస్తుందా? నగరంలో వరుసగా బయటపడుతున్న శవాల వెనుక ఉన్నది ఎవరు? ఈ కేసుకు పాయల్ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలను ట్రైలర్లో ఆసక్తికరంగా లేవనెత్తారు.
ఇదే సమయంలో ఊరిలో కోళ్లు మాయమవుతుండటం కూడా సినిమాలోని మరో మిస్టరీగా చూపించారు. ఈ చిన్న క్లూతో ప్రధాన క్రైమ్ కథకు ఏదైనా సంబంధం ఉందా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ‘మయూఖ’ మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ అని హీరోయిన్ పాయల్ చెంగప్ప తెలిపారు. ఓ అమ్మాయి కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని ఆమె చెప్పారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే థ్రిల్ కలిగిందని, కొన్ని సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయని పాయల్ పేర్కొన్నారు. ఈ సినిమాలో పాయల్ చెంగప్పతో పాటు బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.