Sobhita Dhulipala | అక్కినేని కోడలు, నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెనాలికి చెందిన ఆమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. బాలీవుడ్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, ఆ తర్వాత వివాహంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శోభిత.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్న వయసులోనే తన కలలను సాకారం చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయాన్ని శోభిత వెల్లడించింది. తనకు కేవలం 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వైజాగ్ నుంచి బ్యాగ్ సర్దుకుని కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు చెప్పింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకపోయినా.. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
మోడలింగ్, నటనపై తనకు ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే సొంత ఊరిని వదిలి బయటకు వచ్చానని శోభిత చెప్పింది. తన ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమైనదని పేర్కొంది. తనకు నచ్చిన మార్గంలో వెళ్లేందుకు, నటిగా ఎదిగేందుకు వారు ఇచ్చిన స్వేచ్ఛ, ధైర్యమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని తెలిపింది. జీవితంలో ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుందని, అందరికీ గమ్యస్థానాలు ఒకేలా ఉండవని శోభిత అభిప్రాయపడింది. మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగడమే ముఖ్యమని చెప్పింది. ఇక సినిమాల్లో విజయం గురించి కూడా శోభిత తన అభిప్రాయాన్ని వెల్లడించింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడం లేదా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో భాగం కావడమే విజయానికి కొలమానం కాదని చెప్పింది.
నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలను ఎంచుకోవడం, తాను నమ్మిన మార్గంలో నిజాయితీగా ముందుకు సాగడమే తన దృష్టిలో అసలైన విజయం అని శోభిత పేర్కొంది. ప్రస్తుతం శోభిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చిన్న వయసులోనే సొంతంగా నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రయాణం గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.