ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ, వార్డు, డివిజన్ సభలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిలదీతలు.. నిరసనల మధ్య సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళంగా మారాయి. ప్రజలకు సరైన సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్లపై నిలదీశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని, ఇంకెందుకు సభలు అంటూ మండిపడ్డారు. పలు చోట్ల సభలు జరిగినా వాగ్వాదాలు, ఆందోళనలతో సభలు అర్ధాంతరంగా రద్దు కావడంతో ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.
సిరిసిల్లలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం రామన్నపేటలో ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీశారు. గ్రామస్తులు ఒక్కసారిగా లేచి ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదంటూ మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు సైతం అర్హులకు కాకుండా తమకు నచ్చిన వారికి ఇచ్చారని ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో గోగూరి రాజిరెడ్డి అనే వృద్ధుడు తాను పదిసార్లు దరఖాస్తు పెట్టినా పింఛన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్యాస్ సిలిండర్ కోసం మూడు సార్లు ఎంపీడీవో ఆఫీసుకు పోయి సెక్కరచ్చి అడ్డం పడ్డానని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు. అలాగే గుండారంలో డబ్బులిచ్చినోళ్ల జంగ్ సిపాయి భూములే సర్వే చేస్తున్నారని, ఇవ్వని వారివి చేయడం లేదని గ్రామానికి చెందిన బోడావత్ రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో సుమారు 70 మంది రైతులకు జంగ్ సిపాయి భూములున్నాయని, వీటిని సర్వే చేయించేందుకు 40 వేల నుంచి 50వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు.
కరీంనగర్ నాలుగో డివిజన్ పరిధిలోని దుర్శేడ్‌లో డివిజన్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక ప్రజలకు కనీస సమాచారం అందించకుండా, 20 కుర్చీలు వేసి నిర్వహించండం సరికాదని ఆందోళన చేశారు. ఫొటోల కోసం కార్యక్రమం కాదని అధికారులను, స్థానిక కార్పొరేటర్‌ను నిలదీశారు. చివరగా బీజేపీ, కాంగెస్ నాయకులు వాగ్వాదానికి దిగడంతో సభను రద్దు చేశారు. కరీంనగర్‌లోని 6వ డివిజన్ పరిధిలోని బొమ్మకల్‌లో వార్డు కార్యాలయానికి వచ్చిన అధికారులు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. డివిజన్ ఆఫీస్ భవనం నిర్మించిన తనకు డబ్బులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ తాళం వేయగా, అధికారుల హామీ మేరకు తాళం తీయడంతో గంట ఆలస్యంగా సభ నిర్వహించారు. కరీంనగర్ మండలంలోని చెర్లభూత్కూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇవ్వాలని గ్రామసభలో తమ గోడు విన్నవించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎందుకు తొలగించడం లేదని బీఆర్ఎస్ మండల నాయకుడు మాంకాళి కొమురయ్య గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు వ్యతిరేకంగా గన్నేరువరంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ కంకర తట్టను తీసుకెళ్లి నల్ల కండువా ధరించి వినూత్న నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను టీజీఎన్పీడీసీఎల్లో వీలినం చేయవద్దంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక వార్డు, గ్రామసభల్లో నిరసనలు తెలిపారు. సెస్‌ను విలీనం చేయవద్దని, సెస్ లైసెన్స్ రెన్యూవల్ చేసి, యథావిధిగా కొనసాగించాలని విన్నవించారు. సిరిసిల్లలోని 3 వవార్డులో జరిగన వార్డు సభలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డీవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లోనూ బీఆర్ఎస్నేతలు, సర్పంచ్‌లు గ్రామ, వార్డు సభల్లో అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ వార్డు సభ్యులు నల్ల దుస్తులు ధరించి ప్రజాపాలన సభకు హాజరై తమ నిరసన తెలిపారు. రుద్రంగిలో సెస్‌ను కాపాడుకోవడం కోసం గ్రామస్తులు తీర్మానం చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో సభలను బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఇచ్చిన వాగ్ధ్దానాలను అమలు చేయకుండా సర్కార్ మభ్యపెడుతున్నదని ఆరోపించారు. అలాగే జగిత్యాల మున్సిపాలిటీలోని 25వ వార్డులో అధికారుల సమాచార లోపం కారణంగా వార్డు సభను కౌన్సిలర్ సామల్ల జమున-రాజశేఖర్ బహిష్కరించారు. సభ జరిగే ఫంక్షన్ హాల్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. మల్లాపూర్‌కు చెందిన రైతు ముష్కరి గంగమణి తమ భూమిలో నుంచి అస్తవ్యస్తంగా వేసిన స్తంభాలను తొలగించాలని వేడుకున్నది. తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామసభకు వచ్చి విద్యుత్‌శాఖ ఏఈ వినీత్‌రెడ్డి కాళ్లపై పడింది. మూడేళ్లుగా అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా తమను పట్టించుకోవడం లేదని వాపోయింది.