పెద్ద శంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలు మరో నలుగురికి ప్రాణాధారంగా మారాయి. పెద్ద శంకరంపేటకు చెందిన తోట రవీందర్ మండల పరిధిలోని మల్కాపూర్‌లో ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తూ అందరి మన్నలను పొందాడు. ఈ నెల రెండవ తేదీన ఆదివారం పెద్ద శంకరంపేట పట్టణ శివారులో తోట రవీందర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గురుపాదుగుట్ట వద్ద అతడు నడుపుతున్న బైకును ఎదురుగా వస్తున్న బైకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే, అతనికి బ్రెయిన్ డెడ్ కావడంతో బతికే అవకాశం లేదని, అతని అవయవాలు దానం చేస్తే మరికొందరికి నూతన జీవితం లభిస్తుందని జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ నిపుణులు, వైద్యులు అతడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు వివరించారు. వైద్యుల సూచన మేరకు.. తన కుమారుడు భౌతిక రూపంలో లేకపోయినా మరో రూపంలో జీవించి ఉంటాడని ఆశతో అతడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. వైద్య నిపుణులైన బృందం అతని గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలను సేకరించారు. అనంతరం రవీందర్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పెద్ద శంకరంపేటలో గురువారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. రవీందర్ భౌతిక కాయానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రవీందర్ భౌతికకాయాన్ని చూడడానికి పెద్ద శంకరంపేట పట్టణంతోపాటు మల్కాపూర్తోపాటు ఇతర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువకులు, మహిళలు, బంధువులు తరలివచ్చారు.