Roller Coster Ride | రోలర్ కోస్టర్ రైడ్లు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించినప్పటికీ, వాటి వేగం, ఆకస్మిక మలుపులు, ఒక్కసారిగా వేగం పెరగడం లేదా తగ్గడం వంటి కదలికలు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యంగా తల, మెడ, వెన్నెముకపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక వినోద ఉద్యానవనంలోని వేగవంతమైన రోలర్ కోస్టర్పై ప్రయాణించిన కొందరు తీవ్ర మెదడు గాయాలకు గురయ్యారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రోలర్ కోస్టర్ రైడ్ల వల్ల ఎలాంటి గాయాలు సంభవించవచ్చనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. అయితే ఇలాంటి నాడీ సంబంధిత గాయాలు చాలా అరుదుగా నమోదవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోలర్ కోస్టర్లో ఒక్కసారిగా వేగం పెరగడం, తగ్గడం వల్ల తల వేగంగా కదులుతుంది. శరీరం సీటు, భద్రతా పట్టీలతో స్థిరంగా ఉన్నప్పటికీ తల ముందుకు, వెనక్కి లేదా పక్కలకు వేగంగా కదలడం వల్ల మెడపై ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా తలలో జరిగే భ్రమణ కదలికలు మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని రైడ్లలో సీట్లు లేదా బోగీలు కూడా తిరుగుతుండడంతో ఈ కదలికలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా మెడ, వెన్నెముకతోపాటు తలకు కూడా గాయాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలు చాలా అరుదుగానే కనిపిస్తాయి.
కొన్ని సందర్భాల్లో రోలర్ కోస్టర్ ప్రయాణం తరువాత మెదడులో లేదా మెదడు చుట్టూ రక్తస్రావం జరిగినట్లు వైద్య నివేదికల్లో నమోదైంది. రక్తనాళాలకు నష్టం కలిగితే తలలో ఒత్తిడి పెరిగి అత్యవసర చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైన తలనొప్పి, పదేపదే వాంతులు, తికమక, మగత, స్పృహ కోల్పోవడం, ఫిట్స్, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట్లాడడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అరుదైన సందర్భాల్లో మెడలోని రక్తనాళాలకు చీలిక ఏర్పడి రక్తం గడ్డకట్టడం, దాని ప్రభావంతో మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం కలగడం వంటి సమస్యలు కూడా నమోదయ్యాయి.
గుండె లేదా రక్తనాళాల సమస్యలు, గతంలో నాడీ సంబంధిత సమస్యలు, మెడ లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు అధిక వేగంతో కూడిన రైడ్ల విషయంలో ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి వినోద ఉద్యానవనంలోనూ వయసు, ఎత్తు, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన భద్రతా సూచనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా రైడ్ తర్వాత తలనొప్పి, తల తిరగడం లేదా వికారం వంటి లక్షణాలు తీవ్రంగా ఉండటం లేదా తగ్గకుండా కొనసాగితే సాధారణమేనని భావించకూడదు. తీవ్రమైన లేదా పెరుగుతున్న తలనొప్పి, పదేపదే వాంతులు, స్పృహ కోల్పోవడం, ఫిట్స్, బలహీనత, తిమ్మిరి, మాట్లాడడంలో లేదా చూపులో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.