AAP MLA : ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పరిణామం పంజాబ్‌లో శనివారం జరిగింది. సస్పెన్షన్‌కు గురైంది ఆప్ ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ మైసేర్ఖానా. అతడు పంజాబ్‌లోని మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌లో భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వమే ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సుఖ్వీందర్ శనివారం ఫేస్బుక్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించాడు.
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత వేధిస్తోందన్నారు. దీనికి సంబంధించిన 14 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేనే టీచర్ల కొరత అంశాన్ని ఎత్తిచూపుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో ఆప్ పాలనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. సుఖ్వీందర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విమర్శిస్తూ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆప్‌లో అతడి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
సుఖ్వీందర్ వీడియోలో మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సుఖ్వీందర్ 2022లో ఆప్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై సుఖ్వీందర్ స్పందించారు. ఈ నిర్ణయం తనకు ఆవేదన కలిగించిందన్నారు. ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నానని చెప్పారు. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత గురించి మాట్లాడాను అని చెప్పారు. పంజాబ్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.